న్యూఢిల్లీ: దేశంలోని పలు మహానగరాలను వాయు కాలుష్యం వెంటాడుతూ, ప్రజలను తీవ్ర అనారోగ్యం బారినపడేలా చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇక్కడ నిత్యం పీల్చే గాలి ఎంత ప్రమాదకరంగా మారిందంటే, జనం ప్రతీరోజూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఆస్పత్రులను సందర్శించేలా చేస్తోంది.
అత్యవసర కేసులు అధికం
2022-2024 మధ్య కాలంలో ఢిల్లీలో రెండు లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (ఏఆర్‌ఐ)సంబంధిత అత్యవసర కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి వెలువడ్దాయి. ఈ రెండు సంవత్సరాల కాలంలో లక్షల మంది ప్రజలు ఆస్పత్రులలో చేరాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమని వైద్యాధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం అందించిన డేటా వాయు కాలుష్య పరిస్థితికి సాక్ష్యంగా నిలుస్తోంది.
దీర్ఘకాలిక వ్యాధులుగా..
ఢిల్లీలోని ఆరు కేంద్ర ఆసుపత్రులు ఇచ్చిన నివేదిక ప్రకారం 2022లో 67,054 ఏఆర్‌ఐ అత్యవసర కేసులు ఉంటే, 2024లో ఈ సంఖ్య 68,411కి పెరిగింది. అత్యవసర కేసుల సంఖ్యతో పాటు, ఆస్పత్రులలో చేరేవారి సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇదే కాలంలో ఆస్పత్రులలో చేరేవారి సంఖ్య 9,878 నుండి 10,819కి పెరిగింది. ఇది కేవలం అత్యవసర చికిత్సతో తగ్గిపోయే సమస్య కాదని, చాలా మందికి దీర్ఘకాలిక సంరక్షణ అవసరమవుతోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. బాధితుల సంఖ్య పెరుగుదల వాయు కాలుష్య స్థాయిల పెరుగుదలతో ముడిపడి ఉందని నిపుణులు అంటున్నారు.
ముంబై, చెన్నైలలో కూడా..
రాజ్యసభలో డాక్టర్ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నే అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆరోగ్య మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. కలుషితమైన గాలి శ్వాసకోశ వ్యాధులను ప్రేరేపించే ఒక అంశం అని ఆయన స్పష్టం చేశారు. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగానే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం అంగీకరించింది. పట్టణ కేంద్రాలలో గాలి నాణ్యత క్షీణతను పర్యవేక్షించడానికి జాతీయ నిఘా వ్యవస్థను విస్తరిస్తున్నట్లు కూడా మంత్రి తెలిపారు. ఈ ఆరోగ్య సంక్షోభం ఢిల్లీకే పరిమితం కాలేదు. భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలైన ముంబై, చెన్నైలలో కూడా ఇదే విధమైన పెరుగుదల నమోదైంది. ఈ నగరాల్లో తీవ్రమైన కాలుష్యం ఏర్పడినప్పుడు వేలాది మంది జనం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడి, అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రులను ఆశ్రయించారు. ఈ ఉదాహరణలు దేశవ్యాప్తంగా పట్టణ కాలుష్యం ఒక సామాన్య ఆరోగ్య ముప్పుగా మారుతోందని నిరూపిస్తున్నాయి.
వీరికి మరింత హాని..
ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కలుషితమైన గాలి ప్రభావం వ్యక్తిపై పడటానికి అనేక కారకాలు కారణమవుతాయి. ఆహారపు అలవాట్లు, వృత్తి, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, రోగనిరోధక శక్తి, మునుపటి వైద్య చరిత్ర వంటి అంశాలు కొందరిని ఇతరులకన్నా మరింత హానికి గురిచేస్తాయి. ఈ సంక్లిష్ట నమూనాలను నిర్ఱారించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 230కి పైగా సెంటినెల్ నిఘా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆగస్టు 2023లో ప్రారంభమైన డిజిటల్ ఏఆర్‌ఐ నిఘా కూడా సమాచారాన్ని సేకరిస్తోంది.
తక్షణ చర్యలు అవసరం
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కూడా దీనిపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఐదు ఆసుపత్రులలో శ్వాసకోశ లక్షణాలతో వచ్చిన 33,213 అత్యవసర రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. కాలుష్య స్థాయిలు పెరిగినప్పుడు, శ్వాసకోశ సమస్యలకు అత్యవసర చికిత్స కోసం వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ అధ్యయనంలో తేలింది. ప్రపంచ పరిశోధనలకు అనుగుణంగా ఈ ఫలితాలు ఉన్నప్పటికీ, ఈ అధ్యయనం అధికారికంగా కారణాన్ని నిరూపించలేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ డేటా ప్రభుత్వానికి వాయు కాలుష్యం నివారణపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.
ఇది కూడా చదవండి: షాకిస్తున్న కేరళ ‘హెచ్‌ఐవీ’.. నెలకు 100 కొత్త కేసులు


