న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. యుద్ధ విమానాల ఎస్కేప్ వ్యవస్థ తాలూకు రాకెట్ స్లెడ్ పరీక్షను దిగ్విజయంగా జరిపింది. ఈ ఘనత సాధించిన అతి కొద్ది దేశాల సరసన సగర్వంగా నిలిచింది. అత్యంత అపరిమిత వేగంతో కూడిన ఈ పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్ డీఓ) మంగళవారం విజయవంతంగా జరిపింది. ఎయిర్ క్రూ రికవరీతో పాటు పలు కీలక భద్రతా పరిమితులను విజయవంతంగా సాధించింది. ‘చండీగఢ్ లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లాబోరేటరీ లో ఉన్న రైలు ట్రాక్ రాకెట్ స్లెడ్ వేదికగా గంటకు ఏకంగా 800 కి.మీ. నియంత్రిత వేగంతో ఈ పరీక్షను నిర్వహించారు.
కనోపీ సెవెరెన్స్ ఎజెక్షన్ సీక్వెన్సింగ్ తో పాటు పూర్తిస్థాయిలో ఎయిర్ క్రూ రికవరీ వంటి అన్ని లక్ష్యాలనూ ఈ పరీక్ష సాధించింది‘ అని రక్షణ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తద్వారా ఈ ఘనత సాధించిన అరుదైన దేశాల క్లబ్‌లో భారత్ సగర్వంగా నిలిచిందని తెలిపింది. డీఆర్ డీఓతో పాటు వాయు సేన, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, హిందూస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ లను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. మన దేశీయ రక్షణ సామర్థ్యాల పెంపులో స్వావలంబన దిశగా కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాల్లో దీనిని ఒక మైలురాయిగా ఆయన అభివరి్ణంచారు.
ఏమిటీ స్లెడ్ టెస్టు?
విమానం గాల్లో అత్యధిక వేగంతో ఎగిరేటప్పటి పరిస్థితులను రాకెట్ స్లెడ్ పద్ధతిలో నేల మీదే కృత్రిమంగా సృష్టిస్తారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రెండు పట్టాలపై రాకెట్ ప్రొపల్షన్ వ్యవస్థను ఏర్పాటు చేసి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు.


