రోహింగ్యాలకు అన్ని రకాల వసతులు కల్పించాలా?
అక్రమంగా తిష్టవేసిన వారిని ఎందుకు పంపించకూడదు?
ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
దేశంలో పేదల బతుకులను బాగు చేయడంపై దృష్టి పెట్టాలని సూచన
న్యూఢిల్లీ: రోహింగ్యాల చొరబాట్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకాలా? అని మండిపడింది. ఇప్పటికే ఇక్కడ తిష్టవేసినవారిని ఎందుకు బయటకు పంపించకూడదు అని ప్రశ్నించింది. దేశంలో ఉండడానికి చట్టపరమైన అనుమతి లేనివారంతా చొరబాటుదారులేనని తేల్చిచెప్పింది. మన సొంత పౌరులు పేదరికంలో మగ్గిపోతున్నారని, పరాయి వ్యక్తులను భరించలేమని పరోక్షంగా స్పష్టంచేసింది.
మానవ హక్కుల కార్యకర్త రీటా మన్‌చందా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగీ్చతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీలో కొందరు రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, తర్వాత వారి జాడ తెలియడం లేదని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల ఆచూకీ బయటపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.
ఒకవేళ రోహింగ్యాలను వెనక్కి పంపించాలనుకుంటే చట్టప్రకారం నడుచుకోవాలని 2020లో సుప్రీంకోర్టు ఇచి్చన ఉత్తర్వును ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. దేశంలో చొరబాటుదార్ల సమస్య తీవ్రంగా ఉన్నట్లు ఆందోళన వ్యక్తంచేసింది.
బయటకు పంపిస్తే సమస్య ఏమిటి?
‘‘చొరబాటుదార్లు సరిహద్దును దాటేసి మన దేశంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నారు. సొరంగం తవ్వుకొని లేదా కంచెను ఛేదించి అక్రమంగా అడుగుపెడుతున్నారు. భారతదేశంలోకి వచ్చారు కాబట్టి వారిని ఇక్కడి పౌరులుగా గుర్తించాలని, స్థానిక చట్టాలను వర్తింపజేయాలని కొందరు వాదిస్తున్నారు. ఆహారం, నివాసం, విద్య వంటి వసతులు కల్పించాలని అంటున్నారు. నిజంగా చొరబాటుదార్లకు రెడ్‌కార్పెట్ స్వాగతం పలకాలా? వారికి అన్ని రకాల వసతులు కల్పించాలా? ఇదెక్కడి చోద్యం? వారిని బయటకు పంపిస్తే వచ్చే సమస్య ఏమిటో చెప్పాలి? చొరబాటుదార్లను పక్కనపెట్టి మన దేశంలో పేదల బతుకులను బాగు చేయడంపై దృష్టి పెడితే బాగుంటుంది.
మన పౌరులకు ప్రభుత్వ ప్రయోజనాలు, వసతులు ఎందుకు కల్పించకూడదు? దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారి పట్ల థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించాలని మేము చెప్పడం లేదు’’ అని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పిటిషనర్ దాఖలు చేసే అర్హత రీటా మన్‌చందాకు లేదని, పోలీసుల అదుపులో ఉన్న రోహింగ్యాలెవరూ కోర్టును ఆశ్రయించలేదని పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
శరణార్థులా? అక్రమ వలసదారులా?
రోహింగ్యాల అంశంపై దాఖలైన పిటిషన్లపై ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు విచా రణ నిర్వహించింది. వారు శరణార్థులా? లేక అక్రమ వలసదారులా? అనేది మొదట తేల్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో స్పష్టత వస్తే తదుపరి చర్యలు చేపట్టవచ్చని సూచించింది. రోహింగ్యాలను శరణార్థులుగా గుర్తిస్తే వారికి ఎలాంటి రక్షణలు, ప్రయోజనాలు, హక్కులు కల్పించాన్నలది పరిగణనలోకి తీసుకోవచ్చని తెలియజేసింది. ఒకవేళ అక్రమ వలసదారులే అయితే వారిని వెనక్కి పంపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని వివరించింది.


