తోటి సైనికుల మనోభావాలను గౌరవించరా?
క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్ తొలగింపు సరైనదే
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
మతపరమైన పరేడ్‌లకు హాజరుకాని అధికారిపై వేటుకు సమర్థన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రక్షణ విధుల్లో ఉండి.. ‘నా దేవుడు వేరు.. ఆ గుడిలోకి నేను రాను’అంటూ మొండికేసిన ఒక ఆర్మీ ఆఫీసర్‌కు సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ’తోటి సైనికుల మనోభావాలను గౌరవించలేని మీకు.. మత అహంకారం అంత ఎక్కువగా ఉందా? సైన్యం అంటేనే లౌకికవాదానికి ప్రతీక.. అక్కడ మీ మత చాందసవాదం చూపించడానికి వీల్లేదు. ఇలాంటి వాళ్లను ఒక్క నిమిషం కూడా ఉపేక్షించొద్దు.. సర్వీస్ నుంచి పీకి పారేయండి’అంటూ సీజేఐ ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రెజిమెంట్ నిర్వహించే మతపరమైన పరేడ్‌లను బహిష్కరించిన క్రైస్తవ అధికారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం పూర్తిగా సమర్థించింది.
’ఇది సాదాసీదా తప్పు కాదు.. ఘోరమైన క్రమశిక్షణా రాహిత్యం. ఇలాంటి ప్రవర్తన సైన్యం పునాదులనే దెబ్బతీస్తుంది’అంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తీర్పు సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ’ఇది తప్పుడు సంకేతం ఇస్తుంది’అని అనగా.. ’కాదు.. ఇది గట్టి గుణపాఠం కావాలి.. స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లాల్సిందే’అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కరాఖండిగా తేల్చిచెప్పారు.
మన సైన్యం క్రమశిక్షణకు పేరు
భారత సైన్యం అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. అక్కడ వ్యక్తిగత మత విశ్వాసాల కంటే, దళంలోని సైనికుల మనోభావాలు, ఐకమత్యమే ముఖ్యం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. రెజిమెంట్ నిర్వహించే మతపరమైన పరేడ్‌లలో పాల్గొనడానికి నిరాకరించిన శామ్యూల్ కమలేషన్ అనే క్రైస్తవ ఆర్మీ అధికారిని సర్వీస్ నుంచి తొలగించడాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ’ఇది తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుంది’అని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సదరు ఆఫీసర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల బాగ్చిలతో కూడిన ధర్మాసనం నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఆమోదయోగ్యం కాదంటూ ఆగ్రహం
మంగళవారం విచారణ సందర్భంగా సీజేఐ ధర్మాసనం పిటిషనర్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ’మీరు మీ తోటి సైనికుల మనోభావాలను గౌరవించడంలో విఫలమయ్యారు. ఇతరుల గురించి పట్టించుకోనంతగా మీ మతపరమైన అహంకారం పెరిగిపోయిందా?’అని సీజేఐ సూర్యకాంత్ సూటిగా ప్రశ్నించారు. ఒక అధికారిగా ఉండి, తోటి సైనికుల మనోభావాలను కించపరిచేలా ప్రవర్తించడం క్రమశిక్షణ ఉన్న ఫోర్స్‌లో ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు.
అసలేం జరిగింది?
శామ్యూల్ కమలేషన్ అనే అధికారి భారత ఆర్మీలోని 3వ క్యావలరీ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌గా చేరారు. ఆ రెజిమెంట్‌లో సిక్కు, జాట్, రాజ్‌పుత్ సైనికులు ఉన్నారు. రెజిమెంట్ సంప్రదాయం ప్రకారం వారందరూ అక్కడి మందిరం, గురుద్వారాలో వారంవారం జరిగే మతపరమైన పరేడ్‌లలో పాల్గొంటారు. అయితే, తాను క్రై స్తవుడినని, ఏకేశ్వ రోపాసకుడినని చెబుతూ, ఆలయ గర్భగుడిలోకి వెళ్లడానికి గానీ, పూజల్లో పాల్గొనడానికి గానీ కమలేషన్ నిరాకరించారు. తన మతం ఇతర దేవుళ్ళను పూజించడానికి అంగీకరించదని తన ఉన్నతాధి కారులతో అనేకసార్లు వాదించారు. దీంతో ’ఆర్మీ నిబంధనలను, లౌకిక స్ఫూర్తిని ఉల్లంఘించారు’అనే కారణంతో శామ్యూల్ కమలేషన్‌ను సర్వీస్ నుంచి తొలగించారు.


