ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించడంతో సీఏక్యూఎం పూర్తిగా విఫలమవుతోంది
నిపుణులతో చర్చించి పరిష్కారాలతో నివేదికను
2 వారాల్లోగా సమర్పించండి
వాయునాణ్యతా నిర్వహణ కమిషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: వాయుకాలుష్యంలోనూ దేశరాజధానిగా పనికిరాని పేరు తెచ్చుకుని గ్యాస్‌ఛాంబర్‌గా తయారైన ఢిల్లీని కాలుష్యం బారి నుంచి తప్పించడడంలో కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్(సీఏక్యూఎం) విభాగం ఘోరంగా విఫలమవుతోందని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఢిల్లీని చుట్టేస్తున్న వాయుకాలుష్యానికి ప్రధాన హేతువులను గుర్తించి, పరిష్కారాలను సూచిస్తూ రెండు వారాల్లోగా తగు నివేదికను సమర్పించాలని సీఏక్యూఎంకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగీ్చల ధర్మాసనం మంగళవారం సూచించింది.
పొరుగురాష్ట్రాల గుండా ఢిల్లీలోకి వచ్చే వాహనాలు గంటలతరబడి వేచి ఉండటంతో సరిహద్దుల వెంబడి ఉన్న ప్రధాన టోల్‌ప్లాజాలు కాలుష్యకేంద్రాలుగా తయారయ్యాయని, వెంటనే వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. దీంతో వాటిని తాత్కాలికంగా మూసేయడం లేదంటే వేరే చోటుకు మార్చడంపై తుది నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలల సమయం కావాలని సీఏక్యూఎం కోరడంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రెండు నెలల గడువు ఇవ్వడం కుదరదు. కేవలం రెండు వారాల సమయం ఇస్తున్నాం. ఈలోపు నివేదిక ఇవ్వండి’’అని ధర్మాసనం ఆదేశించింది.
సమస్య వదిలేసి ఆదాయంపై యావ?
‘‘పరిష్కారం చూపండయ్యా అంటే అది వదిలేసి ఆయా టోల్‌ప్లాజాలే మాకు ఆదాయ వనరులు అంటూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అఫిడవిట్ సమర్పించింది. వీళ్లను చూసి గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ సైతం ఇదే పాట పాడుతోంది. గురుగ్రామ్‌లో పర్యావరణ నష్టపరిహార రుసుముల్లో సగభాగం తమకు ఇప్పించాలని కోరుతోంది. ఇదేం వైఖరి?. దీర్ఘకాలిక పరిష్కారాలతో లేదా నిర్మాణాత్మకమైన ప్రతిపాదనలతో ముందుకు రావాల్సిన సంస్థలు ఇలా సమస్య తీవ్రత తెలీకుండా వ్యవహరిస్తున్నాయి. గతంలో మేం లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వకుండా మౌనం దాల్చడం కూడా ఏమాత్రం సబబుగా లేదు’’అని కోర్టు వ్యాఖ్యానించింది.
కారు ఇప్పుడు స్టేటస్ సింబల్
‘‘ఢిల్లీలో కాలుష్యం తగ్గాలంటే కార్ల సంఖ్యను కుదించాలి. కొన్ని కుటుంబాలకు ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉన్నాయి. కుటుంబానికి లేదా ఒక వ్యక్తికి ఒక్కటే కారు అనే నిబంధన అమలుచేస్తే వాహన కాలు ష్యం కాస్తం తగ్గొచ్చు’’అని సీనియర్ న్యా యవాది రాకేశ్ ద్వివేది వాదించారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ‘‘ఇప్పుడు జనాల్లో కారు అనేది స్టేటస్ సింబల్‌గా తయారైంది. జనం సైకిళ్లు ఉపయోగించడం మానేశారు. సరిపడా డబ్బులు కూడబెట్టి నేరుగా కారు కొనేస్తున్నారు’’అని అన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ అత్యంత శక్తివంతంగా తయారైందని లాయర్ వ్యాఖ్యానించారు. దీనిపై సీజేఐ స్పందించారు. ‘‘ధనవంతులు ఒక రకమైన త్యాగం చేస్తే బాగుంటుంది. అత్యంత ఖరీదైన కార్లు కొనేబదులు విద్యుత్‌తో నడిచే కార్లు కొంటే ఉత్తమం’’అని అన్నారు.


