సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలు, ఆస్పత్రులు, కోర్టులు మొదలు ఎక్కడ పడితే అక్కడ తిష్టవేస్తున్న వీధి శునకాల కారణంగా జనం కుక్కకాటు బారిన మాత్రమేకాదు రోడ్లపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. వీధి శునకాలను జనసమ్మర్ధ ప్రాంతాల నుంచి తరలించి షెల్టర్లకు తరలించాన్న అంశంపై బుధవారం జస్టిస్ జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజారియాల సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్ఘంగా విచారించింది.
ఈ సందర్భంగా శునకాలు సహా వీధి జంతువుల బెడదను జడ్జీలు ప్రస్తావించారు. ‘‘అసలు రహ దారుల వెంబడి శునకాలు, వీధి జంతువులు లేకుండా చేయాలి. కుక్కకాటు మాత్రమే జనాల సమస్య కాదు.. వీధి జంతువులు రోడ్లపై ఇష్టారీతిగా తిరగడంతో జనం అన్యాయంగా రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నా రు. గత 20 రోజుల్లో రాజస్థాన్ హైకోర్టులో ఇద్దరు జడ్జీలు ఇలాగే రోడ్లపై వీధి జంతువుల కారణంగా ప్రమాదాలకు గురయ్యారు. ఒకరు ఇంకా వెన్నుముక గాయాలతో ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇది నిజంగా ఆందోళకరమైన విషయం’’అని జస్టిస్ మెహతా అన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కలి్పంచుకుని వాదించారు. ‘‘వీధి శునకాల తరలింపునకు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించండి. బహిరంగ ప్రదేశాల్లోని శునకాలను బంధించడం సమస్యకు పరిష్కారం అనిపించుకోదు. జంతువులు–మానవుల మధ్య ఘర్షణను రూపుమాపేలా అంతర్జాతీయంగా ఆమోదింపబడిన శాస్త్రీయ పరిష్కారాన్ని చూపండి’’అని ఆయన కోరారు. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్ స్పందించారు. ‘‘చికిత్స కంటే నివారణ అత్యుత్తమం. అయినా ఈ అంశంలో అతిగా వాదించడాని కి ఏమీ లేదు. మేం కేవలం రోడ్ల మీద వీధి శునకాలను తొలగించాలని సూచించాం. సంబంధిత నియమనిబంధనల జోలికి వెళ్లలేదు. ఇప్పటికే ఉన్న చట్టాలు, నియమాలను రాష్ట్రాలు, ప్రభుత్వరంగ సంస్థలు విధిగా అమలుచేస్తే సరిపోతుంది.
గతంలో మా తీ ర్పుకు అనుగుణంగా అఫిడవిట్లు సమర్పించాలని కోరాం. కొన్ని రాష్ట్రాలు మౌనంవహించాయి’’అని న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఈ అంశంలో కోర్టు సలహాదారు(అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ మాట్లాడారు. ‘‘జాతీయరహదారుల్లో దాదాపు 1,400 కిలోమీటర్ల రోడ్డు మార్గాలు జంతువులతో ప్ర మాదకరంగా తయారయ్యాయి. ఇక్కడ రహదారి మీద వీధి శునకాలు, పశువుల బెడద ఎక్కువ. ఇవి రహదారి మీదకు రాకుండా కంచె వేయాలని సూచించాం. కోర్టు గత తీర్పును మధ్య ప్రదే శ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్‌లు పట్టించుకోలేదు. అవి అఫిడ విట్లు సమర్పించలేదు. మిగతా రాష్ట్రాలు సమర్పించినా అవి పేలవంగా ఉన్నాయి’’అని గౌరవ్ అగర్వాల్ వెల్లడించారు. వాటిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని న్యాయస్థానం తెలిపింది.
కుక్కలకు కౌన్సిలింగ్ మిగిలింది
ఈ సందర్భంగా న్యాయస్థానం సరదా వ్యాఖ్యచేసింది. ‘‘ఈ లెక్కన తోటి కుక్కలకు రేబిస్ వంటి వ్యాధి సోకినా అంటించుకోకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ కరవొద్దని ఇతర శునకాలకు హితబోధ చేయాలి. ఆ మేరకు వాటికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అలా కుక్కలకు కౌన్సిలింగ్ చేయడం ఒక్కటే మిగిలిపోయింది. అయితే అంతగా కౌన్సిలింగ్ ఇచి్చన తర్వాత కూడా ఆ కౌన్సిలింగ్ ఇచి్చన వ్యక్తిని బయటికొచి్చన కుక్క కరవకుండా ఉంటుందనే గ్యారెంటీ అయితే లేదు’’అని సరదా వ్యాఖ్యచేసింది.
కుక్క మూడ్ చెప్పగలమా?
‘పాఠశాలలు, ఆసుపత్రులు, కోర్టుల వంటి సంస్థాగత ప్రాంగణాల్లో వీధి కుక్కలు ఎందుకు ఉండాలి? ఏ కుక్క ఎప్పుడు ఏ ‘మూడ్’లో ఉంటుందో.. ఎవరిని కరు స్తుందో ఎవరైనా గుర్తించగలరా?’అని సుప్రీంకోర్టు అధికారులను నిలదీసింది. జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనలను అధికారులు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే సమస్య జఠిలమైందని జంతు ప్రేమికుల సంఘం తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదించారు. దీనిపై స్పందించిన జస్టిస్ సందీప్ మెహతా.. ’అధికారులు తమ పని చేయడంలో విఫలమయ్యారని చెప్పి ప్రజలు నిరంతరం బాధలు పడాలా?’అని ఘాటుగా ప్రశ్నించారు.


