- ‘స్కిల్’ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం
- ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ ముసుగులో సీఐడీ కుతంత్రం
- పూర్తి ఆధారాలతో సహా చంద్రబాబు అవినీతిని అప్పట్లో నిగ్గు తేల్చిన సిట్
- బాబు అవినీతికి ఆధారాలున్నాయన్న ఏసీబీ న్యాయస్థానం
- అందుకే చంద్రబాబుకు రిమాండ్ విధింపు
- బాబు పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు, సుప్రీంకోర్టు
- కేసు దర్యాప్తు కొనసాగాల్సిందేనన్న హైకోర్టు
- కేసును కొట్టివేయలేమని స్పష్టంగా చెప్పిన సుప్రీంకోర్టు
- కుంభకోణానికి పాల్పడ్డారన్న ఈడీ.. కాగ్‌ది సైతం అదే మాట
- అయినా కేసు క్లోజ్ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర
- ఆధారాల్లేవంటూ ‘పచ్చ’ పాట పాడుతున్న బాబు గూటి సీఐడీ
- ‘పెద్ద’ల ఆదేశంతో ప్రభుత్వ అనుమతి లేకుండానే కేసు క్లోజర్ పిటిషన్
- కేసు మూసివేత ప్రతిపాదనను సవాల్ చేసిన అప్పటి చైర్మన్ అజయ్‌రెడ్డి
- అసలు ఫిర్యాదుదారుగా ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు
- విచారణపై జాతీయ స్థాయిలో ఆసక్తి
ఈ కేసులో చంద్రబాబు కేవలం సాంకేతిక అంశాలను లేవనెత్తారే తప్ప తాను అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు లేదు. సెక్షన్ 17(ఏ)ను ఉటంకిస్తూ ఈ కేసు తనకు వర్తించదన్న చంద్రబాబు వాదన సరికాదు. నిజాయితీపరులైన అధికారులను రక్షించడానికి సెక్షన్ 17(ఏ) ఉద్దేశించిందే తప్ప.. అవినీతి పరులైన పబ్లిక్ సర్వెంట్లను రక్షించడానికి కాదు. ఈ దృష్ట్యా ఈ కేసును కొట్టివేయలేము. – జస్టిస్ బేలా త్రివేది, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సాక్షి, అమరావతి: చంద్రబాబే నిందితుడిగా, చంద్రబాబే పోలీసుగా సాగుతున్న పచ్చ నాటకం యావత్ దేశాన్ని విభ్రాంతికి గురి చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, న్యాయ ప్రక్రియను పక్కదారి పట్టిస్తూ సాగుతున్న కుట్ర దేశంలో కొత్త దుస్సంప్రదాయానికి తెరతీస్తోంది. చంద్రబాబు బరితెగించి సాగించిన అవినీతి బాగోతాన్ని అడ్డగోలుగా మూసి వేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వ బరితెగింపు విస్మయ పరుస్తోంది. చంద్రబాబు కుట్రదారు, లబ్ధిదారుగా సాగిన రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేత కోసం సీఐడీ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది.
న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తూ మరీ అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంపై న్యాయ నిపుణులే విస్తుపోతున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్ స్కామ్ కేసు అడ్డగోలు మూసివేత ప్రతిపాదనను సవాల్ చేస్తూ ఏపీఎస్‌ఎస్‌డీసీ అప్పటి చైర్మన్ అజయ్‌రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ పిటిషన్‌పై విచారణ, తదుపరి పరిణామాలపై జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లను ఏసీబీ న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేశాయన్నది గమనార్హం. ఈ అవినీతి కేసు దర్యాప్తు, విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేశాయి. ఆ మేరకు ఆ మూడు న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టం చేసిన అంశాలు ఇలా ఉన్నాయి.
స్పష్టంగా ఆధారాలు.. కొట్టేయడం కుదరదు
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతిని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. అందుకే ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత సమరి్పంచిన రిమాండ్ నివేదికతో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సంతృప్తి చెందింది. రిమాండ్ నివేదికను తిరస్కరించాలన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనను తోసిపుచ్చిది. సిట్ నివేదికతో ఏకీభవిస్తూ చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతోనే ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తర్వాత అనారోగ్య సమస్యల కారణంగానే ఆయనకు బెయిల్ మంజూరైంది.
కాగా, ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయిచినా ఆయనకు చుక్కెదురైంది. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న ఆయన వాదనను హైకోర్టు తిరస్కరించింది. అధికారిక విధుల్లో భాగంగానే స్కిల్ కార్పొరేషన్ నిధుల చెల్లింపునకు అనుమతిచ్చానన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చిది. ప్రజాధనాన్ని స్వీయ అవసరాలకు వాడుకోవడం అధికారిక విధుల కిందకు రాదని స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా సిట్ 140 మంది సాక్షులను విచారించి, నాలుగు వేల డాక్యుమెంట్లను కూడా సేకరించిందని తన తీర్పులో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
ప్రభుత్వ అనుమతి లేకుండానే దొంగాట
చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న స్కిల్ స్కామ్‌ను అర్ధంతరంగా మూసివేతకు కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు, న్యాయ ప్రక్రియ ప్రమాణాలకు విరుద్ధంగా కుట్రకు తెగబడుతోంది. వాస్తవానికి స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుపై కేసు నమోదు, విచారణకు గతంలో ప్రభుత్వం అధికారికంగా సీఐడీకి అనుమతినిచ్చిది. అనంతరమే సీఐడీకి చెందిన సిట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కాగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆ అధికారిక విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎటువంటి అధికారిక అనుమతి ఇవ్వలేదు.
కానీ సీఐడీ మాత్రం కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని.. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ’ ముసుగులో కేసును మూసి వేయడానికి న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడం గమనార్హం. ఎందుకంటే అధికారికంగా అనుమతి జారీ చేస్తే తదుపరి పరిణామాలకు సంబంధిత అధికారి బాధ్యుడు అవుతారు. ఆ అధికారిక ఆదేశాలను న్యాయస్థానంలో సవాల్ చేయొచ్చు. అందుకే ప్రభుత్వం అడ్డదారిలో కేసు మూసివేతకు కుట్ర పన్నింది. ప్రభుత్వ అధికారిక అనుమతి లేకుండానే కేసు మూసివేతకు సీఐడీ అధికారులు బరితెగించారు. ఆ అధికారులు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని న్యాయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇద్దరు ఎండీల పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు
ఈ కేసు మూసివేత వ్యవహారంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ పూర్వ ఎండీ, ప్రస్తుత ఎండీ పరస్పర భిన్న వాంగ్మూలాలు ఇవ్వడం గమనార్హం. గతంలో ఎండీగా వ్యవహరించిన బంగార్రాజును ప్రభుత్వ పెద్దలు తమదైన శైలిలో బెదిరించి లొంగ దీసుకున్నారు. దాంతో ఈ కేసు మూసివేతకు తనకు అభ్యంతరం లేదని ఆయన న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. కాగా ప్రస్తుత ఎండీ గణేశ్ మాత్రం అందుకు విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న ఆయన తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పారు.
అంతే కాకుండా న్యాయపరంగా నిబంధనలను పాటించడంతోపాటు.. ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. అంటే కేసు మూసివేయవచ్చని.. అందుకు తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పలేదు. నిబంధనలు పాటించాలని చెప్పారు. అంటే సీఐడీ నిబంధనలను పాటించడం లేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. కేసు మూసివేతకు అభ్యంతరం లేదని చెబితే తాను భవిష్యత్‌లో న్యాయ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన గుర్తించారు. అందుకే ఈ కేసు మూసివేత ప్రతిపాదనను ఆయన సమర్ధించ లేదు.
అడ్డగోలుగా మూసివేత ప్రతిపాదన సవాల్ చేసిన అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి
చంద్రబాబు అవినీతి కేసును అడ్డగోలుగా మూసి వేయాలన్న ఆతృతలో సీఐడీ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ఈ కుంభకోణంపై ఫిర్యాదుదారును పక్కన పెట్టేసి, తమ గుప్పిట్లో ఉండే అధికారుల ద్వారా కుట్ర కథ నడుపుతోంది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఏపీఎస్‌ఎస్‌డీసీ అప్పటి చైర్మన్ కె.అజయ్‌రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించి సీఐడీ కేసు నమోదు చేసి చంద్రబాబు పాత్రను నిగ్గు తేల్చింది. కాగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసు మూసివేత ప్రక్రియలో అజయ్ రెడ్డిని విస్మరించింది.
అప్పటి ఎండీగా ఉన్న బంగార్రాజు ద్వారా పావులు కదుపుతోంది. కేసు మూసివేతపై అభ్యంతరం ఉందా లేదా తెలపాలని సీఐడీ బంగార్రాజుకు నోటీసులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. ఎందుకంటే ఆయన్ను ప్రభుత్వ పెద్దలు బెదిరించి తమ దారికి తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వడం.. ఆయన సమ్మతించడం జరిగిపోయింది. అంతా పక్కా పన్నాగంతో కేసు క్లోజర్ కథకు పన్నాగం పన్నారు. కాకపోతే కూటమి ప్రభుత్వ కుట్రను అప్పటి చైర్మన్ అజయ్‌రెడ్డి తిప్పి కొట్టారు. ఈ కేసులో అసలు ఫిర్యాదుదారు తానే అని, ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు స్కిల్ కేసు కొట్టివేతను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
కమీషన్లు దండుకున్న వారు అరెస్టు.. కొల్లగొట్టిన చంద్రబాబుపై కేసు క్లోజా!?
స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరి విస్మయ పరుస్తోంది. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా ఉండీ.. కొల్లగొట్టిన నిధుల్లో కమీషన్లు దండుకున్న వారిని ఈడీ అరెస్టు చేసింది. షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖని్వల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది.
ఈడీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ కుంభకోణం సూత్రధారి, ప్రధాన లబ్ధిదారు చంద్రబాబుపై కేసును ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా మూసి వేస్తుందని నిపుణులు ప్ర శ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అధికార దురి్వనియోగానికి పాల్పడి, లేని ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది ఆయనే. ఇక నిబంధనలకు విరుద్ధంగా నిధుల జారీకి ఆదేశాలు జారీ చేసిందీ చంద్రబాబే. కొల్లగొట్టిన నిధుల్లో సింహ భాగం ఏకంగా రూ.271 కోట్లు చంద్రబాబు ప్యాలస్‌కే చేరాయి. ఈ పరిస్థితిలో చంద్రబాబుపై కేసును తొలగించడం నిబంధనలకు విరుద్ధం.. చట్ట విరుద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సీఐడీ క్లోజర్ రిపోర్ట్‌పై నా వాదనలు వినండి
⇒ స్కిల్ స్కామ్ ఫిర్యాదుదారు, ఆ కార్పొరేషన్ నాటి చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్
⇒ ఈ కుంభకోణంలో ఆధారాలున్నందునే చంద్రబాబుపై కేసు.. రిమాండ్
⇒ దానిపై హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ ఆయనకు చుక్కెదురు
⇒ చంద్రబాబు సీఎం కాగానే కేసు మూసివేతకు కుట్ర
⇒ అసలు ఫిర్యాదుదారుడినైన నాకు నోటీసు ఇవ్వలేదు
⇒ ఇలా నోటీసు ఇవ్వక పోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం
⇒ హైకోర్టు, సుప్రీంకోర్టు కేసుల్లోనూ నేను పార్టీగా ఉన్నా
సాక్షి అమరావతి : స్కిల్ డెవలప్‌మెంట్æ కార్పొరేషన్ కుంభకోణంలో ఫిర్యాదుదారునైన తనకు తెలియకుండానే కేసును మూసి వేయడానికి వీల్లేదని ఆ కార్పొరేషన్ అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ కుంభకోణం కేసుని మూసివేసేందుకు సీఐడీ, ప్రాసిక్యూషన్, నిందితుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని అయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ముగ్గురూ కుమ్మక్కై కేసును మూసి వేసేందుకు రంగం సిద్ధం చేశారని తెలిపారు. ఈ కుమ్మక్కు కుట్రను అడ్డుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉందన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2021 డిసెంబర్ 9న సీఐడీ కేసు నమోదు చేసిందని, ఇందులో చంద్రబాబు నాయుడు 37వ నిందితుడిగా ఉన్నారని చెప్పారు.
ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉండటంతో సీఐడీ ఆయన్ను 2023 సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసిందని, ఆ మరుసటి రోజు అంటే 2023 సెపె్టంబర్ 10న ఏసీబీ కోర్టు రిమాండ్‌కు పంపిందని తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబుకు హైకోర్టు, సుప్రీంకోర్టులో చుక్కెదురైందన్నారు. అనారోగ్యం కారణంగా చంద్రబాబు బెయిల్ పొంది బయటకు వచ్చారని, ఆ తర్వాత ప్రభుత్వ మార్పుతో ప్రస్తుత దర్యాప్తు అధికారి నిందితులతో కుమ్మక్కై క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారని చెప్పారు. ఫిర్యాదుదారు అయిన తనకు విచారణ పురోగతి గానీ, క్లోజర్ రిపోర్ట్ దాఖలు గురించి గానీ తెలియజేయలేదన్నారు.
ఇది మీనూ కుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధం అని తెలిపారు. ఫిర్యాదుదారుడికి నోటీసు ఇచ్చి వాదనలు వినడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ‘కేసు మూసివేతకు ఇఐఈ, ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్, నిందితులు కలిసి కుట్ర పన్నారు. ఎఫ్‌ఐఆర్ లో కాలమ్ 6లో ఫిర్యాదుదారుగా నా పేరు స్పష్టంగా ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు కేసుల్లో కూడా నేను పార్టీగా ఉన్నా. ఈ నేపథ్యంలో ఈ కేసును మూసి వేసేందుకు సీఐడీ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసినప్పుడు ముందుగా నాకు నోటీసు ఇవ్వాలని సీఐడీ దర్యాప్తు అధికారిని ఆదేశించండి. ఆ క్లోజర్ రిపోర్ట్‌ను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశాను. ఈ సందర్భంగా నా వాదనలు వినాలి’ అని అజయ్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు.
స్కిల్ స్కామ్‌పై ఏం జరగనుంది.. సర్వత్రా తీవ్ర చర్చ
స్కిల్ స్కామ్ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసును అడ్డగోలుగా మూసి వేయాలన్న సీఐడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అజయ్‌రెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఏసీబీ కోర్టు సోమవారం చేపట్టనుంది. ఈ కేసు విచారణ కేవలం స్కిల్ స్కామ్ కేసుపైనే కాదు.. భవిష్యత్‌లో ప్రజా ప్రతినిధుల అవినీతి కేసులపై కూడా ప్రభావం చూపుతుందన్నది సుస్పష్టం. అందుకే ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విచారణలో భాగంగా సిట్ బృందం 40 మందికిపైగా సాక్షులను విచారించింది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వారు చెప్పిన సాక్ష్యాలు, నమోదు చేసిన వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.
ఎఫ్‌ఐఆర్‌లు, చార్జ్‌షీట్లు దాఖలు చేసిన విషయం ప్రస్తావనార్హం. ఏకంగా నాలుగు వేల పేజీల డాక్యుమెంట్లలో పేర్కొన్న విషయాల్లోని ప్రామాణికతను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు కొనసాగాలని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులే తేల్చి చెప్పిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి హోదాలో పాల్పడిన అవినీతి కేసులను అడ్డగోలుగా మూసి వేయడం ఒక దుస్సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుందని న్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే జరిగితే మునుముందు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు బరితెగించి అవినీతికి పాల్పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే స్కిల్ స్కామ్ కేసులో దర్యాప్తు, విచారణ కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
రూ.3,300 కోట్లుగా నిగ్గుతేల్చిన సీఐడీ
2014–19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం జరిగింది. రూ.370 కోట్ల మేర అవినీతి అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ, అందుకు అనుగుణంగా కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అచ్చెన్నాయుడులతో పాటు పలువురిని నిందితులుగా చేర్చి తదుపరి దర్యాప్తు ప్రారంభించింది. అంతిమంగా ఈ కుంభకోణం విలువను రూ.3,300 కోట్లుగా తేల్చింది. అటు తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. స్కిల్ కుంభకోణం నిధులను నిందితులందరూ కలిసి షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించినట్లు ఈడీ తేల్చింది.
స్కిల్ కుంభకోణం కేసులో ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ, చంద్రబాబు నాయుడిని 2023 సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసి 10న విజయవాడ ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచింది. ప్రాథమిక దర్యాప్తులో సేకరించిన పలు ఆధారాలను రిమాండ్ రిపోర్ట్ రూపంలో కోర్టుకు సమరి్పంచింది. సాక్షుల వాంగ్మూలాలను సైతం కోర్టుకిచ్చిది. చంద్రబాబును రిమాండ్‌కు పంపాలని కోరింది. 2015లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్–సీమెన్స్ మధ్య కుదిరిన ఒప్పందం మొదలు నిధుల మళ్లింపు వరకు సేకరించిన ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచింది.
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన హైకోర్టు
తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు నాయుడు హైకోర్టులో కేవలం మూడు రోజుల లోపే పిటిషన్ దాఖలు చేశారు. అలాగే స్కిల్ కుంభకోణంపై సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కూడా కోరారు. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టేస్తూ 2023 సెపె్టంబర్ 22న తీర్పునిచ్చిది. దర్యాప్తులో భాగంగా సీఐడీ 140 మంది సాక్షులను విచారించిందని, అలాగే 4,000 డాక్యుమెంట్లను కూడా సేకరించిందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. దర్యాప్తు విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సీమెన్స్‌కు నిధుల చెల్లింపుల నిర్ణయాన్ని అధికారిక విధుల్లో భాగంగానే తీసుకున్నానన్న చంద్రబాబు వాదనను సైతం హైకోర్టు తోసి పుచ్చిది. పబ్లిక్ సర్వెంట్ ప్రజాధనాన్ని తన స్వీయ అవసరాలకు వాడుకోవడం అధికారిక విధుల కిందకు రాదని తేల్చి చెప్పింది.
కేసు కొట్టివేతకు సుప్రీం నిరాకరణ
ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను ఆయన సవాలు చేశారు. అలాగే తనపై కేసును సైతం కొట్టేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా, కేవలం సాంకేతిక అంశాలను లేవనెత్తారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. అవినీతి నిరోధక చట్టం కింద తనపై కేసు నమోదు చేసే ముందు ఆ చట్టంలోని సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోలేదన్న వాదనను తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు వాదనలు విన్న ఇద్దరు న్యాయమూర్తులు కూడా భిన్న తీర్పులు వెలువరించారు.
అయితే ఇరువురు న్యాయమూర్తులు కూడా చంద్రబాబు కుమ్మక్కుకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సమరి్థస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పులేదని తేల్చి చెప్పింది. అంతేకాక చంద్రబాబుపై కేసును కొట్టేసేందుకు సైతం ఇరువురు న్యాయమూర్తులు నిరాకరించారు. సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ బోస్ చెప్పగా, అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది చెప్పారు. సెక్షన్ 17(ఏ)ను నిజాయితీపరులైన అధికారులను రక్షించేందుకే తీసుకొచ్చారే తప్ప, అవినీతిపరులైన పబ్లిక్ సర్వెంట్లను రక్షించడానికి కాదని జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు.
స్కిల్ స్కామ్‌లో అసలు దోషి బాబే
ఆధారాలతో నిగ్గు తేల్చిన ఈడీ, సీఐడీ
⇒ దాచాలన్నా చంద్రబాబు అవినీతి బాగోతం దాగేది కాదు. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం సీఐడీ అధికారులు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’అనే పేరుతో కుట్రకు తెరతీశారు. కానీ స్కిల్ స్కామ్ కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబేనని ఇప్పటికే ఈడీ, సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చాయి. సీమెన్స్ ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో సమరి్పంచిన రిమాండ్ నివేదికలో సిట్ వెల్లడించింది.
⇒ జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. రూ.370 కోట్ల ప్రాజెక్టు విలువను అడ్డగోలుగా రూ.3,300 కోట్లకు పెంచేశారు. లేని ఈ ప్రాజెక్టును కాగితాలపై చూపించి.. సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందని బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు.
⇒ నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లింపునకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ఆదేశాలు జారీ చేశారు. ఏకంగా 13 నోట్ ఫైళ్లపై ఆయన సంతకాలు చేసి ఈ కుంభకోణాన్ని అంతా తానై నడిపించారు. అలా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా చేరాల్సిన చోటుకు చేర్చారు.
⇒ 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్‌వాయిస్‌లను గుర్తించడంతో ఈ కుంభకోణం బయట పడింది. కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు విచారణ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. 2019లో పుణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు అవినీతి వెలుగులోకి వచ్చిది.
⇒ సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తుతో ఆధారాలతో సహా నిగ్గు తేలింది. ఈ అవినీతి నెట్‌వర్క్‌ను సీఐడీ అధికారులు పక్కా ఆధారాలతో ఛేదించారు. కొల్లగొట్టిన అవినీతి సొమ్ములో రూ.77.37 కోట్లను హైదరాబాద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిల్లోని టీడీపీ ఖాతాల్లో డిపాజిట్ చేశారు. కేవైసీ నిబంధనలకు విరుద్ధంగా నిధులను డిపాజిట్ చేసినట్టు సిట్ దర్యాప్తులో బట్టబయలైంది.
⇒ ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్ïÙట్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసి 2023 సెపె్టంబరు 9న సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసింది. సీఐడీ అధికారుల రిమాండ్ నివేదికతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం ఆరోగ్య సమస్యల కారణంగా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతేగానీ చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఎక్కడా ఎవరూ చెప్పక పోవడం గమనార్హం.
⇒ ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్‌కు తరలించినట్టు గుర్తించింది. డిజైన్ టెక్‌కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖని్వల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్‌చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది.
⇒ రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది.
ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది.



