ఢిల్లీ ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో ఉన్న షాలిమార్ బాగ్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న భార్యను కూడా హత్య చేశారు దుండగులు. శనివారం రాత్రి సమయంలో పాయింట్ బ్లాంక్‌లో రేంజ్‌లో గన్ గురిపెట్టి కాల్చి చంపేశారు. రచనా యాదవ్.. ఆమెకు 44 ఏళ్లు. సుమారు మూడేళ్ల క్రితం ఆమె భర్త విజేంద్ర యాదవ్‌ను కోల్పోయింది.
2023లో విజేంద్ర యాదవ్‌ను కొంతమంది హత్య చేశారు. ప్రస్తుతం ఆ కేసు అండర్ ట్రయల్‌లో ఉంది. ఆ కేసులో భార్య రచనా యాదవ్‌నే కీలక సాక్షిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమెను కూడా గుర్తుతెలియని పలువురు గన్‌తో కాల్చి హత్య చేశారు. అయితే భర్తను హత్య చేసిన నిందితులే.. ఆమెను హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె షాలిమార్ బాగ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్(ఆర్‌డబ్యూఏ)కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆమెను తలపై కాల్చడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
విజేంద్ర యాదవ్ కేసులో ఐదుగురు నిందితులు
రచనా యాదవ్ భర్త విజేంద్ర యాదవ్ హత్య కేసులో ఐదుగురు నిందితులుగా ఉన్నారు. భరత్ యాదవ్ అనే వ్యక్తితో పాటు మరో నలుగురు నిందితులుగా చేర్చారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తు దశలో ఉన్న క్రమంలో భార్య రచనా యాదవ్‌ను కూడా హత్య చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భర్తను అప్పుడు హత్య చేసిన వారే ఇప్పుడు భార్యను కూడా అడ్డులేకుండా తొలగించుకోవాలని చూశారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే భర్త హత్య కేసులో నిందితుడిగా ఉన్న భరత్ యాదవ్.. ఇంకా పరారీలో ఉన్నాడు. భరత్ యాదవ్ అనే వ్యక్తి ప్రకటిత నేరస్థుడిగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.


