విపక్షాల నినాదాల నడుమ వాయిదా పడిన లోక్‌సభ
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వేపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షపార్టీల సభ్యులు పట్టుబట్టడంతో శీతాకాల సమావేశాల రెండోరోజు సభాకాలంసైతం నిరుపయోగంగా ముగిసింది. ఎస్‌ఐఆర్‌పై చర్చకు తామేమీ విముఖత చూపట్లేమని, కాలావధిపై పట్టుబట్టడం సరైన పద్ధతికాదంటూ కేంద్రప్రభుత్వం వ్యాఖ్యానాలతో విపక్షాలు ఏమాత్రం సంతృప్తిచెందలేదు. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జార్జియా ప్రతినిధి బృందాన్ని పార్లమెంట్ గ్యాలరీలోకి ఆహా్వనించి సభాకార్యక్రమాలు మొదలెట్టారు.
ప్రశ్నోత్తరాల సమయం ఆరంభంకాగానే విపక్షసభ్యులు తమతమ స్థానాల నుంచి లేచినిలబడి ఎస్‌ఐఆర్‌పై వెంటనే చర్చించాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనల నడుమే పలువురు మంత్రులు తమను అడిగిన లిఖితపూర్వక ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయినా విపక్షసభ్యులు నినాదాలు ఆపలేదు. దీంతో స్పీకర్ ఆగ్రహంతో ‘‘ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. కానీ సభలో కొందరు సభ్యుల ప్రవర్తన ఏమాత్రం ఆమోదనీయంగా లేదు. సభ గౌరవాన్ని కాపాడండి. ప్రతి ఒక్క సభ్యునికి మాట్లాడే అవకాశమిస్తా. అప్పటిదాకా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యయుత పార్లమెంట్‌గా సభ అత్యున్నత ప్రమాణాలను పాటించండి’’ అని హితవు పలికారు.
అయినా నినాదాలు సద్దుమణగకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైన కేవలం 10 నిమిషాలకే నినాదాలు రెట్టించడంతో సభను వెంటనే 2 గంటలకు వాయిదావేశారు. లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటలకు మళ్లీ మొదలైనా విపక్షసభ్యుల నినాదాలతో హోరెత్తిపోయింది. ఎస్‌ఐఆర్‌పై చర్చకు ప్రభుత్వం సైతం సమాయత్తమవుతోందని, సభ సజావుగా సాగేలా సంయమనం పాటించాలని విపక్ష సభ్యులకు సభాధ్యక్షుడి స్థానంలో కూర్చున్న దిలీప్ సైకియా విజ్ఞప్తిచేశారు. విపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదావేశారు.
పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీల ధర్నా
ఎస్‌ఐఆర్‌తోపాటు ఎన్నికల సంస్కరణలపై ఉభయసభల్లో చర్చకు ప్రభుత్వం సమ్మతి తెలపకపోవడంతో నిరసనగా విపక్ష పార్టీల ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో ధర్నాకు దిగారు. నిరసనలోభాగంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు. ‘‘ఎస్‌ఐఆర్‌ను అంతం చేద్దాం. ఓట్ల చోరీకి ముగింపు పలుకుదాం’, ‘ఎస్‌ఐఆర్ అంటేనే ఓట్ల చోరీ’, ‘వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల ఓట్లను తొలగించారు’’ అనే ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు.
ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ వాద్రాసహా పలు విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘ పార్లమెంట్ దేశ ప్రజలదని మోదీ పదేపదే అంటారు. తీరా ప్రజాసమస్యలపై చర్చిద్దామంటే జడుసుకుంటారు. చర్చించకుండా పారిపోతున్నారు’’ అని ఎద్దేవాచేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఓటింగ్ హక్కుల కంటే పెద్ద సమస్య మరోటి ఉంటుందా?’’అని తర్వాత ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్ చేశారు. డీఎంకే నేతలు కనిమొళి, టీఆర్ బాలు, సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిట్టాస్ తదితరులు సైతం పార్లమెంట్ మకరద్వారం వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు


