కాలుష్యం ఎఫెక్ట్‌.. ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం | Delhi Govt ban on outdoor sports in schools | Sakshi
Sakshi News home page

కాలుష్యం ఎఫెక్ట్‌.. ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం

Nov 21 2025 11:44 AM | Updated on Nov 21 2025 12:49 PM

Delhi Govt ban on outdoor sports in schools

ఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో స్కూల్స్‌లో స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌ను నిషేధిస్తూ నిర్ణయించింది. పెరిగిపోతున్న వాయుకాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం.. శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, వాయు కాలుష్యంలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కారణంగా విద్యార్థులు, ప్రజలకు శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్న విషయం తెలిసిందే. 


కాగా, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమైంది. ఈ నేపథ్యంలో.. పాఠశాలల స్పోర్ట్స్‌, అథ్లెటిక్స్‌ కార్యక్రమాలను వాయిదా వేసేలా ఆదేశించడాన్ని పరిశీలించాలని ‘వాయునాణ్యత నిర్వహణ కమిషన్‌ (CAQM)’కు సుప్రీం కోర్టు సూచించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యంపై దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

నవంబరు, డిసెంబరు నెలల్లో అండర్‌-16, అండర్‌-14 విద్యార్థులకు ఇంటర్‌ జోనల్‌ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సీనియర్‌ న్యాయవాది, అమికస్‌ క్యూరీ అపరాజిత సింగ్‌ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) దృష్టికి తీసుకెళ్లారు. కాలుష్యం గరిష్ఠ స్థాయిలో ఉండే ఈ నెలల్లో ఇటువంటి ఈవెంట్స్‌కు అనుమతించడం.. స్కూల్‌ పిల్లలను గ్యాస్ ఛాంబర్‌లో ఉంచడంతో సమానమేనని వాదించారు. ఈ సమయంలో బహిరంగ క్రీడా కార్యకలాపాలు నిర్వహించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. వాయు కాలుష్యం తక్కువగా ఉండే నెలల్లో క్రీడాపోటీలు నిర్వహించేలా స్కూళ్లను ఆదేశించాలని ‘సీఏక్యూఎం’కు సూచించింది. 

Advertisement
 
Advertisement
Advertisement