లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వే కసరత్తు కొలిక్కి వచ్చింది. రివిజన్ అనంతరం ఏకంగా 2.89 కోట్ల ఓట్లు తొలగింపుకు గురయ్యాయి. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నవ్‌దీప్ రిన్వా మంగళవారం ఈ మేరకు వెల్లడించారు. వీరిలో ఏకంగా 2.57 కోట్ల మంది శాశ్వత వలస వెళ్లిపోయినట్టు తెలిపారు.
మరణాలు, బహుళ నమోదుల వంటి కారణంగా మిగతా ఓట్లను తొలగించినట్టు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్యను 12.55 కోట్లుగా ముసాయిదా ఎన్నికల జాబితా పేర్కొంది. ఎస్‌ఐఆర్‌కు ముందు యూపీలో ఓటర్ల సంఖ్య 15.44 కోట్లుగా ఉండేది. తుది ఓటర్ల జాబితాను మార్చి 6న ప్రచురిస్తామని రిన్వా ప్రకటించారు. ముసాయిదా జాబితాపై యూపీలో విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఈసీ అసలు రివిజన్ కసరత్తుకు సరిపడా సమయమే ఇవ్వలేదని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ఆరోపించారు.


