ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కున్న దొంగ
కోటా (రాజస్థాన్): అది ఆదివారం రాత్రి.. రాజస్థాన్‌లోని కోటా నగరంలో సుభాష్ కుమార్ రావత్ తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లి ప్రశాంతంగా ఇంటికి తిరిగి వచ్చారు. తాళం తీసి లోపలికి వెళ్లిన ఆ దంపతులకు గుండె ఆగినంత పనైంది. గాలి కోసం పెట్టిన ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఒక వింత ఆకారం వేలాడుతూ కనిపించింది.
సగం లోపల.. సగం బయట!
నేలకి పది అడుగుల ఎత్తులో.. తల, చేతులు ఇంట్లోకి వచ్చి ఉన్నాయి.. కాళ్లు మాత్రం బయట గాలిలో ఊగుతున్నాయి. సరిగ్గా గమనిస్తే అర్థ్ధమైంది.. ఆ ఆకారం ఒక ’దొంగ’ ప్రబుద్ధుడిదని.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా దూరి లోపలికి రావాలని ప్రణాళిక వేసి, నడుము భాగం దగ్గర గట్టిగా ఇరుక్కుపోయాడు. పాపం, అటు లోపలికి రాలేక, ఇటు బయటకి వెళ్లలేక బావురుమన్నాడు.
ఇరుక్కుపోయినా తగ్గని ’ఈగో’!
రావత్ దంపతులు తేరుకుని, ‘ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు?’.. అని గట్టిగా అరిచారు. సాధారణంగా దొంగలు దొరికిపోతే కాళ్లావేళ్లా పడతారు. కానీ మన దొంగ రూటే వేరు! ఇరుక్కుపోయినా కూడా, ఇంటి యజమానులనే బెదిరించడం మొదలుపెట్టాడు. ‘నన్ను ఇప్పుడే వదిలేయండి. నా మనుషులు బయటే ఉన్నారు.. నన్నేమై నా చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు!’.. అంటూ బడాయిలు పోయాడు. కానీ, అసలు విషయం ఏంటంటే.. అసలు దొంగ ఇరుక్కుపోవడం చూసి, బయట కాపలా ఉన్న కొసరు దొంగలంతా తమ కారు వదిలేసి మరీ పరారయ్యారు.
ఏడుపులంకించుకున్న దొంగోడు
వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అతన్ని బయటకి తీయడం పెద్ద సాహసమే అయిపోయింది. బయట ఒక కానిస్టేబుల్ నెట్టడం, లోపల ఇద్దరు పోలీసులు లాగడం.. ఈ క్రమంలో మన దొంగ గారు నొప్పితో విలవిల్లాడుతూ, ఏడుస్తూ పెట్టిన కేకలు చుట్టుపక్కల వారికి మాత్రం వినోదాన్ని పంచాయి. ఎట్టకేలకు అతన్ని బయటకు తీసి, సంకెళ్లు వేసి స్టేషన్‌కు తరలించారు. దొంగలు వచ్చిన కారు మీద ’పోలీస్’ అని స్టిక్కర్ ఉండటం విశేషం. ఇప్పుడు పోలీసులు.. ఆ కారు ఎక్కడిది? ఆ దొంగ వెనుక ఉన్న ముఠా ఎక్కడ? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.


