ఈ నెలాఖరుకు సైన్యం చేతికి
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇప్పటికే ఐరన్ డోమ్ రక్షణ ఛత్రం ఉండగా, తక్కువ ఖర్చుతో లేజర్ వ్యవస్థ ‘ఐరన్ బీమ్’ను త్వరలో సమకూర్చుకోనుంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ శాఖలోని పరిశోధన అభివృద్ధి విభాగం చీఫ్ బ్రిగేడియర్ జనరల్ డేనియల్ గోల్డ్ సోమవారం చెప్పారు. ‘ఐరన్ బీమ్ అభివృద్ధి పూర్తయింది, ఈ వ్యవస్థ సామర్థ్యాలను ధ్రువీకరించే సమగ్ర పరిశీలన సైతం ముగిసింది.
డిసెంబర్ 30న ఇజ్రాయెల్ మిలటరీకి అందించడానికి సిద్ధంగా ఉన్నాం’అని వివరించారు. దీంతోపాటు తదుపరి తరం ఆయుధ వ్యవస్థల అభివృద్ధి సైతం కొనసాగుతోందన్నారు. రాకెట్లు, శతఘ్నులు, డ్రోన్ల వంటివాటితో ఎదురయ్యే గగనతల ముప్పును ఎదుర్కోవడానికే ఈ భూ ఆధారిత హై–పవర్ లేజర్ వైమానిక రక్షణ వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. ఈ వ్యవస్థ యుద్ధరంగంలో పోరాటం తీరునే మార్చేస్తుందని గోల్డ్ ప్రకటించారు.
ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు తమకు దశాబ్ద కాలం పట్టిందన్నారు. భవిష్యత్తు సంఘర్షణల కోసం అద్భుతమైన తదుపరి తరం ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వాటిని సరైన సమయంలో కార్యాచరణలోకి తెస్తామని చెప్పారు. ఇటీవలి యుద్ధంలో స్వల్ప–శ్రేణి వ్యూహాత్మక లేజర్ వ్యవస్థలను మోహరించామని, అవి డజన్ల కొద్దీ లక్ష్యాలను విజయవంతంగా అడ్డగించాయని గోల్డ్ ప్రకటించారు. ఇజ్రాయెల్ రక్షణ శ్రేణిలోకి ఐరన్ డోమ్ అదనంగా చేరనుందన్నారు. దీని నిర్వహణ వ్యయం చాలా తక్కువని వివరించారు.


