సాక్షి, తిరుపతి: నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినిని బెదిరించి గర్భవతిని చేశాడు. బాధిత విద్యార్థిని.. వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేసింది. కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ వీసీ ఆదేశాలు జారీ చేశారు.
యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కన్నేశారు. ఆ విద్యార్థినిని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
లక్ష్మణ్ కుమార్‌పై యూనివర్శిటీ సిబ్బంది.. తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. కానీ ఆ విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్ళిపోయింది.


