సీబీఐ దర్యాప్తునకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధమా?.. కాకాణి సవాల్‌ | Kakani Govardhan Reddy Challenges Tdp Leaders | Sakshi
Sakshi News home page

సీబీఐ దర్యాప్తునకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధమా?.. కాకాణి సవాల్‌

Dec 6 2025 6:46 PM | Updated on Dec 6 2025 7:34 PM

Kakani Govardhan Reddy Challenges Tdp Leaders

సాక్షి, నెల్లూరు: వరుస తుపాన్లు, వరదల కారణంగా రైతులు నష్టపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని, కూటమి ప్రభుత్వానికి వ్యవసాయంపై నిర్లక్ష్యం కాగా, సీఎం చంద్రబాబుకు రైతులంట ఏహ్యభావమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. మొంథా తుపాను, తాజా దిత్వా తుపానుతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఏదీ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నేతలు వరద సాయాన్ని దొంగ బిల్లులు పెట్టి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప, రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి వారిలో లేదని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:

అసలు ప్రభుత్వం అనేది ఉందా?:
రాష్ట్రంలో గత నెల మొంథా తుపాన్, తాజాగా దిత్వా తుపాన్‌ ప్రభావంతో నెల్లూరు జిల్లా మొత్తం నష్టపోయినా ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం ప్రకచించలేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. జిల్లాలో వరినాట్లు పూర్తిగా పాడైపోయాయి. ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు పెట్టిన రైతులకు పైసా సహాయం లేదు. పంట నష్టం అంచనా వేసేందుకు అధికారులు గ్రామాలకు వెళ్లలేదు.

ఇవన్నీ చూస్తుంటే, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉందా అన్న సందేహం కలుగుతోంది. తుపాన్ల సమయంలో ప్రభుత్వం పట్టించుకోకపోతే, మా పార్టీ చాలా చోట్ల భోజన వసతి ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిల్చింది. గతంలో మా ప్రభుత్వ హయాంలో 2023లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే, చాలా వేగంగా స్పందించాం. రైతులను వెంటనే ఆదుకున్నాం.

మా ఎమ్మెల్యే ఆ మాటలు ఫాలో అవుతున్నారు:
సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట అంటారు. ‘సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోండి’ అని ఆయన చెబుతుంటారు. వాటిని మా సర్వేపల్లి ఎమ్మెల్యే గట్టిగా వంట బట్టించుకున్నాడు. అందుకే కష్టనష్టాల్లో ఉన్న రైతులను ఎలా ఆదుకోవాలని ఆలోచించకుండా, ఎక్కడ దొంగ బిల్లులు పెట్టుకోవచ్చని ఆలోచిస్తున్నారు. మా జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫ్లడ్‌ డ్యామేజ్‌ మరమ్మతుల పేరిట కోట్లు దోచుకుంటున్నారు. రైతుల పేరు చెప్పి గతంలో నీరు–చెట్టు కార్యక్రమంలో ఎలా అయితే దోచుకున్నారో.. ఈరోజు మరమ్మతు పేరిట మళ్లీ అదే చేస్తున్నారు.

అరాచకంగా మారిన విజిలెన్స్‌ విభాగం:
ఈరోజు విజిలెన్స్‌ దర్యాప్తు అన్న దానికి అర్థమే పూర్తిగా మారిపోయింది. అధికార పార్టీ నేతల ఆదేశాలను రాసి పెట్టే కార్యాలయంగా ఇక్కడి విజిలెన్స్‌ విభాగం తయారైంది. ఒకసారి జిల్లా విజిలెన్స్‌ అధికారుల కాల్‌ లిస్టులు బయటపెడితే, మంత్రి, ఎమ్మెల్యేలతో ఎలాంటి సంబంధాలు కొనసాగుతున్నాయి.. వారి ఆదేశాలు అధికారులు ఎలా అమలు చేస్తున్నారనేది బయటపడుతుంది. విజిలెన్స్, ఏసీబీ విభాగాలు.. జిల్లాలో అధికార పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి, వారితో ఫోన్లలో మాట్లాడి, వారి ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా రిపోర్టులు తయారు చేస్తున్నారు. ఇదే అత్యంత దారుణం. అరాచకం.

దమ్ముంటే బహిరంగ చర్చకు రండి:
మీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. కూటమి ప్రభుత్వం ఏ ఒక్క రైతుకూ మేలు చేయడం లేదు. అదే గత మా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాం. విత్తనం మొదలు, పంటల అమ్మకాల వరకు గ్రామాల్లో ఆర్బీకేలు రైతుల కోసం పని చేశాయి. అందుకే మీకు, దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి. మీడియా, రైతుల సమక్షంలో ఎక్కడైనా కూర్చొని మాట్లాడుదాం. జగన్‌గారి హయాంలో రైతులకు ఎలా సహాయం జరిగింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎలా దోపిడీ జరుగుతోంది.. అన్నదానిపై కూలంకషంగా చర్చిద్దాం. నా నియోజకవర్గం సర్వేపల్లిలోనే చర్చ మొదలు పెడదాం. మరి మీరు అందుకు సిద్ధమా?.

విజిలెన్స్‌ రిపోర్టులపై సీబీఐ విచారణకు సిద్ధమా?:
వరద సాయాన్ని అధికార పార్టీ నేతలు దొంగ బిల్లులతో దోచుకుంటున్నారు. వీటిని సీబీఐ విచారణ పెడితే ఎంత మంది అధికారులు ఇళ్లకు వెళ్తారో, ఎన్ని అవకతవకలు బయటపడతాయో తెలుస్తుంది. ఈరోజు ఫాల్స్‌ విజిలెన్స్‌ రిపోర్టులు తయారు చేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. విచారణ సంస్థలు కూడా పూర్తిగా రాజకీయ బానిసలయ్యాయి. ఈ దుస్థితి కొనసాగితే సమాజంపై ప్రమాదకర ప్రభావం ఉంటుంది. అధికారంలో ఉండి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వ్యవసాయ మంత్రికి  లెటర్‌ రాయడం విడ్డూరంగా ఉంది. ఆయనకు నేరుగా మంత్రితో, ప్రభుత్వంతో మాట్లాడే దమ్ము, ధైర్యం లేదా?. ఏదేమైనా కోట్ల రూపాయల దోపిడిపై సీబీఐ విచారణకు అధికార పార్టీ నేతలు సిద్ధమా?

వ్యవసాయ మంత్రి పారిపోతున్నారు:
వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడికి అసలు వ్యవసాయం గురించే తెలియదు. ఆయన రైతుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో మేం చర్చకు సిద్ధమైతే అచ్చెన్నాయుడు తోక ముడుచుకుని పారిపోయాడు. ఇప్పుడు కూడా అచ్చెన్నాయుడు వేదిక, సమయం నిర్ణయిస్తే గత ప్రభుత్వ రైతు సంక్షేమం, ఈ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. కానీ, ఆయన పారిపోతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement