‘రేవంత్‌.. ఒక్కసారి భ్రమల నుంచి బయటకొచ్చి చూడు’ | BRS Senior Leader Harish Rao Slams CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌.. ఒక్కసారి భ్రమల నుంచి బయటకొచ్చి చూడు’

Dec 6 2025 6:27 PM | Updated on Dec 6 2025 6:56 PM

BRS Senior Leader Harish Rao Slams CM Revanth Reddy

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదని, అట్లాగే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం మార్చుకోరని, మార్చు కోలేరని విమర్శించారు.  

ఈ మేరకు శనివారం(డిసెంబర్‌ 6వ తేదీ) ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశారు. ‘ రెండేళ్లుగా కేసీఆర్ మీద, బీఆర్‌ఎస్‌ పార్టీ మీద పడి ఏడ్వడం తప్ప  చేసిందేముంది రేవంత్ రెడ్డి?, విజయోత్సవాలు అంటూ విచ్చలవిడిగా తిరుగుతూ, వికృతంగా మాట్లాడటం వల్ల చేయనివి చేసినట్లు అయిపోవు. అబద్దాలు ప్రచారం చేసినంత మాత్రాన, వాస్తవాలు మరుగున పడిపోవు. కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలు మరిచిపోరు. 

బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని పచ్చి అబద్దం చెబుతున్న రేవంత్ రెడ్డి.. 6,47,479 రేషన్ కార్డులు మంజూరు చేసింది అబద్దమా?, గతంలో కార్డు మీద నాలుగు కేజీల బియ్యం మాత్రమే ఇస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఆరు కేజీలకు పెంచి, కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చింది అబద్దమా?, నల్లగొండ ప్రజల మీద కక్ష కట్టింది ఎవరు?, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును నెవర్ ఎండింగ్ ప్రాజెక్టుగా డిజైన్ చేసింది ఎవరు? ప్రాజెక్టును పడావు పెట్టింది ఎవరు?, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూ. 3892 కోట్లు ఖర్చు చేసి, 11.48 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి చేసింది నిజం కాదా?, ఈ లెక్కలు మీ ప్రభుత్వం దగ్గర లేవా? 

పదే పదే ఎందుకు అబద్దాలు చెబుతున్నారు రేవంత్ రెడ్డి?, మీ అనాలోచిత నిర్ణయాల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ దుందుడుకు చర్యల వల్ల ఇవాళ ఎస్‌ఎల్‌బీసీని త్రిశంకు స్వర్గంలో పడేసింది మీరు కాదా?, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఎలాంటి స్టడీ నిర్వహించకుండా 8 మంది అమాయకుల ప్రాణాలను బలి కొన్నది మీరు కాదా?, రెండేళ్లలో కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వని నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడితే ప్రజలకు ఇరిటేషన్ కలుగుతుంది. అక్రమంగా కృష్ణా నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే, అక్రమ ప్రాజెక్టులకు డీపీఆర్ లు తయారు చేస్తుంటే అడ్డుకోలేని రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తున్నడు.

కనీసం ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న శవాలను కూడా ఇప్పటికీ బయటకు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం మీది. రోమ్ తగలబడుతుంటే, ఫిడేల్ వాయించినట్లు.. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే..నువ్వు మాత్రం పాలన గాలికి వదిలి ఫుట్ బాల్ ఆడుతున్నవు. ఆటలాడటంపై ఉన్న శ్రద్ద నీకు ప్రజా సమస్యల మీద, పరిపాలన మీద లేక పోవడం సిగ్గుచేటు. రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేక ప్రపంచ ఆటగాడివా?, భ్రమల నుంచి బయటికి వచ్చి చూడు రేవంత్ రెడ్డి. నీ మోసాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు. నీ చేతగాని పాలనను అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నరు. నీ స్కాంల పాలనను ప్రతి ఒక్కరూ ఛీ కొడుతున్నరు.అందిన కాడికి దోచుకోవడం, అందరు కలిసి పంచుకోవడం ఇదే కదా మీరు చేసింది. మూటలు, వాటాలు, కమీషన్లు ఇదే కదా మీకున్న విజన్. నలుదిక్కులా గద్దల్లా మారి భూములను ఖతం పట్టిస్తున్నరు.  

ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి అందిన కాడికి దండుకుంటున్నరు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతగాని సర్కారు మీది.కూట్లో రాయి తీయని రేవంత్ రెడ్డి మాట్లాడితే ప్రపంచ స్థాయి అంటుండటం హాస్యాస్పదం. తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటూ.. ఎవరిని మభ్య పెడుతున్నవు?, ఇందులో ఎన్ని కోట్ల స్కాంకు ప్లాన్ వేసినవు. ఇందులో ఎవరి వాటా ఎంత?, గాల్లో మేడలు కట్టడం, అబద్దాలు చెప్పి రంగుల ప్రపంచం చూపడం మానేసి.. పాలన మీద దృష్టి సారించు. చిల్లర మాటలు, వెకిలి చేష్టలతో రాష్ట్రం అభివృద్ది చెందదు, ప్రజల సమస్యలకు పరిష్కారం లభించదు.నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి అన్న విషయం గుర్తుంచుకో.. అహంకారం తగ్గించుకొని అజ్ఞానాంధకారం తొలగించుకో’ అని హరీష్‌ ధ్వజమెత్తారు.

ఇండిగో ఇష్యూపై.. కేటీఆర్ రియాక్షన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement