సాక్షి హైదరాబాద్ : భారత విమానయాన సంస్థలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సివిల్ ఏవియేషన్ లో ఇండిగో సంస్థ గుత్తాధిపత్యం నడుస్తుందన్నారు. విమానయానం మెుత్తం ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఐదు రోజులుగా దేశంలోని ఎయిర్ పోర్టులు బస్టాండ్లను తలపిస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడాది కింద డీజీసీఏ కొత్త రూల్స్ తీసుకవస్తే వాటిని ఇండిగో సంస్థ అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. శ్రమ దోపిడికి అలవాటు పడ్డ సంస్థ రూల్స్ అమలు చేయడానికి ఇష్టపడట్లేదని వాటిని అమలు చేయాలని డీజీసీఏ ఒత్తిడి తెస్తే 1,000 విమానాలను రద్దు చేసిందని తెలిపారు. ఇండిగో చర్యలతో విమానాశ్రయాలన్నీ బస్టాండ్లను తలపిస్తున్నాయన్నారు. పవర్ కొంతమంది చేతుల్లో ఉంటే ఏం జరుగుతుందో అందరికీ అర్థమైందని కేటీఆర్ ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


