గత కొద్ది రోజులుగా దేశీయ విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇండిగో సంస్థకు చెందిన విమానాలు హఠాత్తుగా రద్దు కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో వేలమంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభానికి కారణమైన ఇండిగో సంస్థపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ను తొలగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.
దేశీయ విమానాయాన సంస్థ ఇండిగో నిర్వాకంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఐదో రోజు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. విమానాలు రద్దయ్యే సమాచారం ప్రయాణికులకు ఇవ్వకపోవడంతో వారంతా విమానాశ్రయాలలో చిక్కుకొని తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇండిగో సంస్థ కావాలనే ఈ విధంగా చేసిందని కేంద్రం భావిస్తోంది. దీంతో ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ పై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఈఓ పదవి నుంచి ఆయనను తొలగించడంతో పాటు పెద్ద మెుత్తంలో జరిమానా విధించనున్నట్లు సమాచారం.
ఈ మేరకు కేంద్ర విమానయాన సంస్థ ఈ రోజు సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ భేటీకి ఇండిగో సంస్థ యాజమాన్యం తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ భేటీలో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించే అవకాశం ఉంది.ప్రస్తుత ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ 2022లో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన కేఎల్ఎమ్ రాయల్ డచ్ ఎయిర్ లైన్స్ కి సీఈఓగా వ్యవహరించారు.
కాగా ఇండిగో ఘటనపై ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెప్పారు. అంతర్గతంగా చర్యలు తీసుకోవడంలో సంస్థ విఫలమైందని అంగీకరించారు. అంతర్గతంగా అన్నీ షెడ్యూళ్లను రీబూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో 5-10 రోజుల్లో ఇండిగో కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని పీటర్ ఎల్బర్స్ తెలిపారు.


