సాధారణంగా తల్లిదండ్రులనో, తమ జీవిత భాగస్వాములనో జీవితంలో మొదటి సారి విమానం ఎక్కించి, వారికి చక్కటి అనుభవాన్ని అందించాలని చాలామంది కోరకుంటారు. కానీ తమ ఇంటిలో సహాయకులకు మరపురాని అనుభవాన్ని అందించేఘటనలు చాలా అరుదు. నటి అర్చన పూరన్ సింగ్ మంచిమనసును చాటుకున్న వైనం నెట్టింట ఆకర్షణీయంగా నిలుస్తోంది.
నటి అర్చన పూరన్ సింగ్ ఇటీవల తన హౌస్ కీపర్ భాగ్యశ్రీకి జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని అందించింది. ఆమెను మొట్టమొదటిసారి విమానంలో ప్రయాణించేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.
రాత్రిబాగా నిద్రపోయి భాగ్యశ్రీ పనికి లేటుగా రావడం,విమానాశ్రయంలో భోజనం కోసం ఆగినప్పుడు, దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే మూవీలోని జోక్‌లు మొదలు, విమానం ఎక్కడానికి సిద్ధమవుతుండగా తన సీట్ బెల్ట్ బిగించుకోవడానికి సహాయం చేయమని అర్చన భాగ్యశ్రీ పక్కన ఉన్న ప్రయాణికుడిని అడగడం, నేను వేసుకున్నా అని భాగ్యశ్రీ చెప్పడం, సూట్ కేస్ మిస్ అయిందనే జోకులతో పాటు ఎన్నో సన్నివేశాలు ఈ వీడియోలో చూడవచ్చు. టేక్ ఆఫ్ అప్పుడు కొద్దిగా భయమేసింది అందరూ నా వైపే చూశారు. కానీ ఒక్కసారి విమానం ఆకాశంలోకి ఎగిరాక మేఘాల్లో తేలినట్టు ఉంది అంటూ భాగ్యశ్రీ తన ప్రయాణ అనుభవంపై ఉత్సాహంగా మాట్లాడింది.


