
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరిన వెంటనే చైనాకు ప్రత్యక్ష విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ఇండిగో సిద్ధమవుతోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) పీటర్ ఎల్బర్స్ తెలిపారు. కొవిడ్-19 పరిణామాల కారణంగా 2020 ప్రారంభంలో నిలిపివేసిన చైనా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆంక్షలకు ముందు ఈ సంస్థ న్యూఢిల్లీ నుంచి చెంగ్డూ, కోల్‌కతా-గ్వాంగ్ జౌ మధ్య రోజువారీ సర్వీసులను నడిపేది.
ద్వైపాక్షిక ఒప్పందంపై ఆశలు..
ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని పునరుద్ధరించడానికి భారత్, చైనాలు సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, అధికారిక అనుమతులు ఇంకా ఖరారు కాలేదు. ప్రత్యక్ష సేవలను తిరిగి ప్రారంభించేందుకు మార్గాలను అన్వేషించడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. కొవిడ్-19కు ముందు తాము చైనాకు విమానాలు నడిపేవారమని, ప్రభుత్వం ఒక ఒప్పందానికి వస్తే వాటిని పునప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్బర్స్ చెప్పారు. 2020 ప్రారంభం నుంచి భారతదేశం-చైనా మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ లేదు. ఆ ఏడాది చివర్లో లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇది దౌత్య, ఆర్థిక సంబంధాలపై ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం భారతదేశం-హాంకాంగ్ మధ్య విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడి నుంచి చైనాకు వెళ్లాల్సి ఉంటుంది.
ప్రధాన సమస్య
ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో భారత విమానయాన సంస్థలపై చైనా విధించిన విమాన ఛార్జీల నిబంధనల అంశం ప్రాధానమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఛార్జీలను నిర్ణయించడానికి విమానయాన సంస్థలకు అనుమతిస్తూ, అధిక ధరల స్వేచ్ఛ కోసం భారత్ ఒత్తిడి తెస్తోంది. చైనాలో తమ గత నిర్వహణ అనుభవాలపై భారత ప్రభుత్వం విమానయాన సంస్థల నుంచి ఫీడ్‌బ్యాక్ కోరిందని సీనియర్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: మరో టాప్ కంపెనీలో లేఆఫ్స్ పర్వం
ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరితే భారత విమానయాన మార్కెట్లోకి చైనీస్ చౌక ధరల విమానయాన సంస్థల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇది ద్వైపాక్షిక పర్యాటకం, వ్యాపార ప్రయాణాన్ని పెంచే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ఐదేళ్ల విరామం తర్వాత ఇటీవల చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలు జారీ చేసే ప్రక్రియను తిరిగి ప్రారంభించింది.