ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ కాలంలో ఒక గిగావాట్ సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టలేషన్ల సామర్థ్యాన్ని తన సబ్సిడరీ సంస్థ ‘టాటా పవర్ సోలరూఫ్’ ద్వారా సాధించినట్టు టాటా పవర్ ప్రకటించింది. ఈ కాలంలో 1.7 లక్షల నివాస, వాణిజ్య, పారిశ్రామిక భవనాలపై ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేసినట్టు(ఇనస్టలేషన్), అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇన్‌స్టలేషన్లతో (38,494) పోల్చి చూస్తే 345 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపింది.
ఇదే కాలంలో నివాస, వాణిజ్య, పారిశ్రామిక విభాగంలో లక్ష మంది కొత్త కస్టమర్లను చేర్చుకున్నట్టు, దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 3 లక్షలకు, ఇన్‌స్టాల్డ్ సోలార్ రూఫ్‌టాప్ సామర్థ్యం 4 గిగావాట్లకు పెరిగినట్టు వివరించింది. ఒక్క డిసెంబర్ త్రైమాసికంలోనే 58,476 రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టలేషన్లను సాధించినట్టు తెలిపింది.
ఏప్రిల్–డిసెంబర్ కాలంలో అత్యధికంగా యూపీలో 30,857, మహారాష్ట్రలో 21,044 ఇన్‌స్టలేషన్లను చేసినట్టు పేర్కొంది. ఘర్ ఘర్ సోలార్ కార్యక్రమం ద్వారా రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్రయోజనాల గురించి వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపింది.


