భారత పౌర విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) వాణిజ్య కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మొదటి ప్యాసింజర్ విమానం విజయవంతంగా టేకాఫ్, ల్యాండ్ అయింది.
ఘన స్వాగతం.. తొలి విమానం ఇదే!
బెంగళూరు నుంచి ప్రారంభమైన ఎయిర్‌క్రాఫ్ట్ విమానాశ్రయంలో మొదటి సర్వీసుగా నిలిచింది. ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో విమానం (6E460) రన్‌వేపై ల్యాండ్ అయింది. ఈ చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా విమానానికి సంప్రదాయ పద్ధతిలో ‘వాటర్ సెల్యూట్’తో స్వాగతం పలికారు.
అనంతరం ఉదయం 8:40 గంటలకు ఇక్కడి నుంచి మొదటి విమానం హైదరాబాద్‌కు బయలుదేరింది. ఇండిగో విమానం (6E882) టేకాఫ్ అయింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తొలి విమానంలో వచ్చిన ప్రయాణికులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు.
#WATCH | Maharashtra: Navi Mumbai International Airport commenced its airside operations today with the arrival of its first commercial flight. The aircraft was accorded a ceremonial water cannon salute on arrival.
The inaugural arrival, IndiGo flight 6E460 from Bengaluru,… pic.twitter.com/SWoKSexdW4— ANI (@ANI) December 25, 2025
మొదటి విమానాశ్రయంపై తగ్గనున్న ఒత్తిడి
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ముంబై విమానాశ్రయంపై ఉన్న విపరీతమైన రద్దీని తగ్గించడంలో ఈ కొత్త విమానాశ్రయం కీలక పాత్ర పోషించనుంది. గంటకు 10 విమానాల కదలికలను నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంది. 2018లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్ట్ కొవిడ్-19 వంటి వివిధ కారణాల వల్ల దాదాపు ఎనిమిదేళ్లు ఆలస్యమైంది. ఈ విమానాశ్రయం అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ పర్యవేక్షణలో ఉంది.
ఆకృతిలో ప్రత్యేకతలు
విమానాశ్రయ రూపకల్పన భారత జాతీయ పుష్పం కమలం ఆకారంలో ఉంటుంది. దీని మొదటి దశ నిర్మాణానికి సుమారు రూ.19,650 కోట్లు** ఖర్చు చేశారు. ఇది 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ విమానాశ్రయం ప్రస్తుతం ఏడాదికి 20 మిలియన్ల(రెండు కోట్లు) మంది ప్రయాణికులను నిర్వహించగలదు. భవిష్యత్తులో మొత్తం ఐదు దశలు పూర్తయిన తర్వాత ఇది ఏటా 90 మిలియన్ల(9 కోట్లు) మంది ప్రయాణికులకు సేవలందించనుంది.


