బిజినెస్‌ నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌ దాకా | Adani Group completes full takeover of IANS news agency | Sakshi
Sakshi News home page

బిజినెస్‌ నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌ దాకా

Jan 24 2026 5:29 AM | Updated on Jan 24 2026 5:29 AM

Adani Group completes full takeover of IANS news agency

అదానీ చేతికి ఐఏఎన్‌ఎస్‌ ఇండియా

మిగిలిన 24% వాటా కొనుగోలు 

ఇప్పటికే ఎన్‌డీటీవీ, బీక్యూప్రైమ్‌లో వాటా

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ తాజాగా ఇండో–ఏషియన్‌ న్యూస్‌ సర్విస్‌(ఐఏఎన్‌ఎస్‌)ను పూర్తిగా స్వాదీనంలోకి తెచ్చుకుంది. ఇప్పటికే న్యూస్‌ ఏజెన్సీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌ మిగిలిన 24 శాతం వాటాను సైతం చేజిక్కించుకుంది. 

డీల్‌ విలువను వెల్లడించనప్పటికీ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ ద్వారా ఐఏఎన్‌ఎస్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌లో మిగిలిన వాటా ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. 

కాగా.. 2023 డిసెంబర్‌లో అదానీ గ్రూప్‌  ఏఐఎన్‌ఎస్‌ న్యూస్‌ ఏజెన్సీలో 50.5 శాతం వాటా కొనుగోలు చేసింది. తద్వారా న్యూస్‌వైర్‌ ఏజెన్సీని ఏఎంజీ మీడియాకు అనుబంధ సంస్థగా మార్చుకుంది. తిరిగి 2024 జనవరిలో ఐఏఎన్‌ఎస్‌లో వాటా పెంచుకోవడం ద్వారా ఏఎంజీ మీడియా 76 శాతం వోటింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. 

ఈ బాటలో మిగిలిన 24 శాతాన్ని సొంతం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఐఏఎన్‌ఎస్‌ను పూర్తి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేసుకోనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. దేశీయంగా వివిధ భాషల న్యూస్‌ ఏజెన్సీలలో ఒకటైన ఐఏఎన్‌ఎస్‌ ప్రింట్, డిజిటల్, బ్రాడ్‌క్యాస్ట్‌ ప్లాట్‌ఫామ్స్‌కు వార్తలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్‌డీటీవీ, బీక్యూ ప్రైమ్‌లలో వాటాలు కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌ ఇకపై మీడియా, కంటెంట్‌ ఎకోసిస్టమ్‌లో కార్యకలాపాలను మరింత  విస్తరించనుంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement