అవును.. అది అదానీ డేటా సెంటరే | Chandrababu govt finally agreed on Adani Data Center | Sakshi
Sakshi News home page

అవును.. అది అదానీ డేటా సెంటరే

Feb 19 2026 5:20 AM | Updated on Feb 19 2026 8:46 AM

Chandrababu govt finally agreed on Adani Data Center
  • ఎట్టకేలకు ఒప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం

  • విశాఖలో 601.4 ఎకరాలు అదానీ ఇన్‌ఫ్రాకు బదలాయింపు

  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ లేఖ మేరకు భూమి కేటాయింపు

  • క్రెడిట్‌ చోరీకి సర్కారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం

సాక్షి, అమరావతి: గూగుల్‌ పేరుతో డేటా సెంటర్‌ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు సర్కారు చేసిన గిమ్మిక్కు అదే ప్ర­భుత్వం విడుదల చేసిన జీవో సాక్షిగా బట్టబయలైంది. చివరకు ప్రభుత్వమే దిగివచ్చి మొత్తం భూ కేటాయింపులను అదానీ ఇన్‌ఫ్రా (ఇండియా) పేరు మీదకు మార్చడమే కాకుండా, ఇకపై ఈ ప్రాజెక్టును అదాని ఇన్‌ఫ్రా (ఇండి­యా) లిమిటెడ్‌గా ప్రస్తావించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 

గతంలో ఈ ప్రాజెక్టుకు కే­టాయించిన 480 ఎకరాలను ఇప్పుడు 601.4 ఎకరాలకు పెంచడమే కాకుండా, ఈ మొత్తం భూమిని అదాని ఇన్‌ఫ్రా పేరుపైకి బదలా­యించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌ యువరాజ్‌ బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో అడవివరం–ముడసర్లలోవ వద్ద 120 ఎకరాలు కేటాయించగా, ఇప్పుడు దానిని 160 ఎకరాలకు పెంచా­రు. 


అదానీ ఇన్‌ఫ్రాకు 601.4 ఎకరాలు బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 

అలాగే తుర్లవాడ వద్ద 200 నుంచి 266.6 ఎకరాలకు, రాంబిల్లి వద్ద 160 నుంచి 174.80 ఎకరాలకు పెంచుతూ భూ కేటాయింపులు చేశారు. ఇందుకోసం అదానీ ఇన్‌ఫ్రా అ­డ­వివరం–ముడసర్లలోవ భూముల కోసం వై­జాగ్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ పార్క్‌ లిమి­టెడ్, తర్లవాడ భూముల కోసం వైజాగ్‌ మెగా డేటా సెంటర్‌ పార్క్‌ లిమిటెడ్, రాంబిల్లి భూ­ముల కోసం వైజాగ్‌ రాంబిల్లి డేటా సెంటర్‌ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో మూడు అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేశాక, వాటి పే­రు మీద భూ కేటాయింపులు చేయనుంది. ఇ­లా మొ­త్తంగా 601.4 ఎకరాల భూమిని డేటా సెంటర్‌ కోసం అదానీ ఇన్‌ఫ్రాకు కేటాయించింది.

వైఎస్‌ జగన్‌కు క్రెడిట్‌ దక్కకూడదని కుతంత్రం
విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి గతేడాది అక్టోబర్‌ 14న న్యూఢిల్లీలో ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంలో ప్రభుత్వం అదానీ పేరును ప్రస్తావించలేదు. కానీ అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ మాత్రం ఈ డేటా సెంటర్‌లో తాము భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు.

⇒ అలాగే భారతీ ఎయిర్‌టెల్‌ గ్రూపు కూడా ఈ డేటా సెంటర్‌లో తాము భాగస్వాములమంటూ ట్వీట్‌ చేసింది. గత నెలలో విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లో కూడా అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కరణ్‌ అదానీ, సీఎం చంద్రబాబు సమక్షంలోనే గూగుల్‌తో కలిసి 15 బిలియన్‌ డాలర్ల డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో చంద్రబాబు క్రెడిట్‌ చోరీ అంతర్జాతీయ స్థాయిలో బయట పడింది.

⇒ ఈ విషయమై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్‌లో విలేకరుల సమావేశంలో సాక్ష్యాధారాలతో బయట పెట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి క్రెడిట్‌ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్‌తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదన్న విషయాన్ని ఎత్తి చూపారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చెప్పిన ప్రతీ అంశం నిజమేనని ప్రభుత్వ జీవో సాక్షిగా వెల్లడైంది. తొలుత గూగుల్‌ పేరిట జీవో విడుదల చేసి, ఆ తర్వాత ఆ భూములను అదానీ ఇన్‌ఫ్రా పేరు మీదకు బదలాయించడమే ఇందుకు నిదర్శనం.  

⇒ ఈ నేపథ్యంలో రూ.87,250 కోట్ల పెట్టుబడితో 1,000 మె­గావాట్ల డేటా సెంటర్‌ను అదా­నీ ఇన్‌ఫ్రా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొనడం గమనార్హం. గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమి­టెడ్‌ అభ్యర్థన మేరకు భూ కే­టా­యింపులు పెంచి, ఆ మేర­కు అదానీ ఇన్‌ఫ్రాకు కేటాయించినట్లు తెలిపింది.    

Advertisement
 
Advertisement
Advertisement