భారతీయతత్వాన్ని ప్రపంచానికి చాటాం | International Fleet Review for Unity and Trust Between Nations | Sakshi
Sakshi News home page

భారతీయతత్వాన్ని ప్రపంచానికి చాటాం

Feb 19 2026 5:50 AM | Updated on Feb 19 2026 5:50 AM

International Fleet Review for Unity and Trust Between Nations

రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

దేశాల మధ్య ఐక్యత, విశ్వాసానికి ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ

దేశ ప్రయోజనాల రక్షణలో నావికాదళం పాత్ర ఎంతో కీలకం 

విశాఖలో రాష్ట్రపతి ముర్ము  

ఐఎన్‌ఎస్‌ సుమేధ నుంచి 71 దేశీ, విదేశీ నౌకల సామర్థ్యాల పరిశీలన

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వసుధైక కుటుంబం అనే భారతీయ తత్వాన్ని ప్రపంచానికి ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎఫ్‌ఆర్‌) ద్వారా చాటిచెబుతున్నామని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తెలిపారు. క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం మన నావికాదళ విశేష లక్షణాలని ఆమె కొనియాడారు. వ్యూహాత్మకంగా విశాఖపట్నం ఎంతో కీలకమైన నగరమని, ఐఎఫ్‌ఆర్‌ను ఇక్కడ నిర్వహించుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. పదేళ్లకు ఒకసారి జరిగే ఐఎఫ్‌ఆర్‌కు విశాఖపట్నం మరోసారి వేదికైంది. త్రివిధ దళాధిపతి హోదాలో ఐఎఫ్‌ఆర్‌లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు.

విశాఖ తీరంలో లంగరేసిన మొత్తం 71 దేశీ, విదేశీ నౌకలను ఆమె ఐఎన్‌ఎస్‌ సుమేధ నుంచి పరిశీలించారు. రెండు గంటలకుపైగా నౌకల సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. భారతదేశం సముద్ర వారసత్వం కలిగిన దేశమని, దశాబ్దాలుగా ఇతర దేశాలతో సముద్ర మార్గంలో వాణిజ్యం జరిపామని గుర్తు చేశారు. సముద్ర మార్గాలు మన దేశ సంస్కృతి, భద్రతకు ప్రధాన ఆధారమని అభిప్రాయపడ్డారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే విషయాన్ని ఐఎఫ్‌ఆర్‌ ద్వారా మరో సారి చాటిచెప్పినట్టు అయ్యిందన్నారు. అంతర్జాతీయ స్నేహ సంబంధాలకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.  

నావికాదళం మరింత బలోపేతానికి చర్యలు  
ఐఎఫ్‌ఆర్‌లో భారత నావికాదళ విన్యాసాలతో మన శక్తి, సామర్థ్యాలను మరోసారి ప్రదర్శించగలిగామని రాష్ట్రపతి ముర్ము అన్నారు. భారత నావికాదళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సముద్ర భద్రత, ఉగ్రవాద చర్యలను నిరోధించడంతోపాటు సముద్ర మార్గంలో జరిగే దోపిడీని అరికట్టడంలో భారత నావికాదళ కృషిని ఆమె గుర్తు చేశారు. అదేవిధంగా విపత్తు సమయాల్లో భారత నావికాదళం స్వదేశంతోపాటు విదేశాల్లోనూ సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపడుతోందని గుర్తు చేశారు.

‘సురక్షిత సముద్రం – సమృద్ధ భారత్‌’ అనే నినాదంతో మన నావికాదళం నిరంతరం ఎంతో జాగరూకతతో పనిచేస్తోందని ప్రశంసించారు. ఆమె ప్రత్యేకంగా ఒడిశాలోని బలి జాతర ఉత్సవాన్ని ప్రస్తావిస్తూ... ఇది ఆగ్నేయాసియాకు ప్రయాణించిన పురాతన కళింగ నావికులను గౌరవించడంతోపాటు ప్రాంతీయ సాంస్కృతిక స్పృహకు దోహదపడిందని పేర్కొన్నారు.  

ప్రత్యేక ఆకర్షణగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ 
ఆపరేషన్‌ సిందూర్‌లో కీలకపాత్ర పోషించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఐఎఫ్‌ఆర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిగ్‌ – 29కే ఫైటర్‌ జెట్స్‌తోపాటు కామోవ్‌ – 31 హెలికాప్టర్లు, ఎంహెచ్‌ – 60ఆర్‌ మలీ్టరోల్‌ హెలికాప్టర్లు.... ఇలా మొత్తం 36 హెలికాప్టర్లను తీసుకెళ్లగలిగే ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళానికి కేటాయించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌... ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కరాచీ నగరానికి దగ్గరలో లంగరు వేసి శత్రువు గుండెల్లో దడ పుట్టించింది. 

రష్యా, యుఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌ తదితర విదేశాలతోపాటు స్వదేశానికి చెందిన మొత్తం 71 నౌకలు విశాఖ తీరంలో లంగరేసి నగరానికి కొత్త శోభను తీసుకొచ్చాయి. అదేవిధంగా నగరాల పేర్లతో ఉన్న ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం, ఐఎన్‌ఎస్‌ చెన్నై, ఐఎన్‌ఎస్‌ మైసూర్, ఐఎన్‌ఎస్‌ ముంబై యుద్ధనౌకలు కూడా ఇందులో పాల్గొన్నాయి. భారత నౌకాదళంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొదటి సర్వే నౌక ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌కు అనకాపల్లి జిల్లాకు చెందిన కెప్టెన్‌ ధీరజ్‌ కమాండింగ్‌ అధికారిగా వ్యవహరించడం గమనార్హం.  

ఆకట్టుకున్న నావికాదళ విన్యాసాలు 
వివిధ యుద్ధనౌకల సామర్థ్యాన్ని పరిశీలిస్తూ రాష్ట్రపతి ముర్ము ముందుకు సాగుతున్న తరుణంలో నావికాదళం చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్ల (ఎఎల్‌హెచ్‌) నుంచి కాంబాట్‌ జంప్స్, యుద్ధ సమయంలో ఉపయోగించే టెన్‌ – టెన్‌ మెథడ్‌లో రెస్క్యూ డైవర్లని యుద్ధ నౌకలపై మోహరించడం, నీటి ఉపరితలానికి కేవలం 10 అడుగుల ఎత్తులో ఎగురుతూ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడం, హెలికాప్టర్లపై నుంచి సాహసోపేతంగా సముద్రంలోకి దూకి.. బాధితులను రక్షించడం, వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించడం... వంటి విన్యాసాలు గగుర్పొడిచాయి. 

అదేవిధంగా రెండు హాక్‌ విమానాలు.. ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నట్లుగా ప్రెసిడెన్షియల్‌ యాచ్‌ మీదుగా గంటకు 400 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకెళ్తూ నిర్వహించిన విన్యాసాలు కంటి రెప్ప వాల్చనీయలేదు. అనంతరం చేతక్‌ హెలికాఫ్టర్‌ ద్వారా ఫ్లైపాస్‌ నిర్వహించారు. ఆ తర్వాత ఏఎల్‌హెచ్‌ ధ్రువ్, యూహెచ్‌త్రీహెచ్, సీకింగ్, కామోవ్‌ హెలికాఫ్టర్లు, విమానాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా చేసిన విన్యాసాలు నౌకాదళ సత్తాని చాటాయి. చివరిగా డోర్నియర్, మిగ్‌ – 29కే యుద్ధ విమానాలు  డైమండ్‌ ఆకారంలో గంటకు 400 నాటికల్‌ మైళ్ల వేగంతో గాల్లో దూసుకొస్తూ చేసిన విన్యాసాలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. 

తీరంలో 6 వరుసల్లో 71 నౌకల లంగరు 
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తూర్పు నావికాదళ కేంద్రానికి ఉదయం 9.50 నిమిషాలకు చేరుకున్నారు. ఆమెకు నౌకాదళ ప్రధానాధికారి దినేష్‌ కె.త్రిపాఠితోపాటు గవర్నరు అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్వాగతం పలికారు. అనంతరం ఐఎన్‌ఎస్‌ సుమేధ యుద్ధనౌకలో ప్రయాణిస్తూ తీరప్రాంతం వెంబడి ఆరు వరుసల్లో లంగరు వేసిన 71 దేశీ, విదేశీ నౌకల సామర్థ్యాలను ఆమె పరిశీలించారు. 

మొత్తం 19 విదేశీ యుద్ధనౌకలతోపాటు భారత నేవీకి చెందిన 45 యుద్ధ నౌకలు, తీరప్రాంత రక్షణ నౌకలు, వాణిజ్య నౌకలు, పరిశోధన నౌకలు కూడా ఇందులో భాగమయ్యాయి. ఈ సందర్భంగా మిగ్‌ – 29 కే జెట్‌ ఫైటర్లు, డారి్నయర్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్, చేతక్‌ హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నుంచి నిప్పులు చిమ్ముతూ ఎయిర్‌క్రాఫ్ట్‌లు దూసుకెళ్లిన దృశ్యాలు మురిపించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement