తిరుపతి లడ్డూపై చర్చకు ససేమిరా | YSRCP postpones resolution in Legislative Council on heritage ghee supply | Sakshi
Sakshi News home page

తిరుపతి లడ్డూపై చర్చకు ససేమిరా

Feb 19 2026 5:43 AM | Updated on Feb 19 2026 5:43 AM

YSRCP postpones resolution in Legislative Council on heritage ghee supply

హెరిటేజ్‌ నెయ్యి సరఫరాపై మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం

సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూల కోసం హెరిటేజ్‌ నెయ్యిని ఇందాపూర్‌ డెయిరీ పేరుతో సరఫరా చేసిన అంశంపై చర్చించేందుకు అధికారపక్షం భయపడింది. ఈ అంశంపై వరుసగా రెండో రోజూ శాసనమండలిలో ఎటువంటి చర్చ లేకుండా సభ వాయిదా పడింది. ఇందాపూర్‌ డెయిరీ పేరుతో హెరిటేజ్‌ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన అంశంపై వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆర్‌.రమేష్‌యాదవ్, కేఆర్‌జే భరత్, సిపాయి సుబ్రమణ్యం బుధవారం ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణచక్రవర్తి తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా తిరస్కరించారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఇది సరికాదని, వాయిదా తీర్మానాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియాలని ఆందోళనకు దిగారు. దీనిపై మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు కల్పించుకుని ఒకసారి తిరస్కరించిన తీర్మానంపై చర్చించేది లేదంటూ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అయితే.. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ సభ ఆర్డర్‌లో లేదంటూ మాట్లాడటానికి నిరాకరించారు. 

ఇదే సమయంలో వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు చైర్మన్‌ పోడియంను చుట్టిముట్టి పట్టుబట్టారు. దీంతో సభ ప్రారంభమై 10 నిమిషాలు కాకుండానే వాయిదా వేస్తున్నట్టు చైర్మన్‌ ప్రకటించారు. మూడు గంటల అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో అదే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హెరిటేజ్‌ నెయ్యి సరఫరా అంశంపై చర్చించాల్సిందేనని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు. చర్చను ప్రారంభించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు ‘గోవింద.. గోవింద’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ప్రజాహితం గురించి ఎటువంటి చర్చకైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిట్‌ దర్యాప్తులోని అంశాలను ఉటంకిస్తుండటంతో డైవర్ట్‌ చేయవద్దంటూ చైర్మన్‌ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ కల్పించుకుని మాట్లాడుతుండగా చైర్మన్‌ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

అసెంబ్లీలో పనిచేయని మైకులు
వరుసగా రెండోరోజు కూడా అసెంబ్లీలో మైకులు మొరాయించాయి. దీంతో మాట్లాడేందుకు సభ్యులు ఇబ్బంది పడ్డారు. చివరకు అందరికీ స్టాండ్‌ మైకులే ఆధారమయ్యాయి. సభ్యుల టేబుల్‌పై ఉన్న కొన్ని వైర్‌లెస్‌ స్పీకర్లు పనిచేయగా, మెజార్టీ సభ్యులకు అవి పని చేయలేదు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న సౌండ్‌ సిస్టమ్‌కు స్టాండ్‌ మైకులను అనుసంధానం చేస్తున్న సందర్భంలో రీ సౌండ్‌ వస్తుండడంతో ఎవరేమి మాట్లాడుతున్నారో గ్యాలరీలో కూర్చున్న వారికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. చివరికి స్పీకర్‌ పోడియంపై ఉన్న మైకులు కూడా పనిచేయకపోవడంతో స్పీ­కర్‌ సైతం స్టాండ్‌ మైకుపై ఆధారపడాల్సి వచ్చింది. సెషన్‌ అంతా ఇదే పరిస్థితి కొనసాగింది. టెక్నికల్‌ టీమ్‌ వస్తుందని మైక్‌ సిస్టమ్‌ను సరి చేస్తుందని పలువురు సభ్యులు లాబీల్లో చెప్పుకొచ్చారు. కానీ రెండ్రోజులైనా సాంకేతిక లోపాలను సరిచేయకపోవడం ఏమిటన్న ప్రశ్న తలెత్తింది.

మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాపం
మాజీ ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, టి.రత్నాబాయి మృతికి శాసన మండలి బుధవారం సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు మాజీ ఎమ్మెల్సీల మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రస్తావించారు. వెంకయ్య ఎమ్మెల్సీగా, బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు, బీసీల అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. రత్నాబాయి ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్సీగా విశేష సేవలు అందించారన్నారు. వారి మృతి పట్ల సభ తీవ్ర సంతాపం తెలుపుతోందని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతోందని చైర్మన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా శాసన మండలి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement