ఏపీలో ఎన్నికల ‘మిస్టరీ’ పై ఈసీ సమాధానం చెప్పాలి | Professor K Nageshwar on social media regarding elections in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో ఎన్నికల ‘మిస్టరీ’ పై ఈసీ సమాధానం చెప్పాలి

Feb 19 2026 5:30 AM | Updated on Feb 19 2026 8:41 AM

Professor K Nageshwar on social media regarding elections in AP

సామాజిక మాధ్యమంలో ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ 

‘ద వైర్‌’లో పరకాల వ్యక్తం చేసిన అనుమానాలు విలువైనవి 

కూటమికి 164 సీట్లు ఎలా వచ్చాయన్నది ప్రశ్నార్ధకమే 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ 2024 ఎన్నికల ‘అద్భుతం’ వెనుక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ వ్యక్తం చేసిన అనుమానాలకు ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ కూటమి 175 స్థానాలకు 164 స్థానాలు గెలుచుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనమని, ఈ ‘అద్భుతం’ ఎలా జరిగిందనే ప్రశ్న ఇప్పటికీ ఉత్పన్నమవుతూనే ఉందని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబుకు గతంలో సలహాదారుగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్‌ ఆ మిస్టరీ ఏమిటి..? అంటూ  తాజాగా ‘ద వైర్‌’లో ఒక వ్యాసం రాశారని చెప్పారు. చంద్రబా­బుకు అత్యంత సన్నిహితుడైన పరకాల తన విలువైన వ్యాసంలో పోలింగ్‌ సరళిపై వ్యక్తం చేసిన అనుమానాలకు ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాలని నాగేశ్వర్‌ సూచించారు. పరకాల వ్యక్తం చేసిన అనుమానాలను సామాజిక మాధ్యమంలో ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ వెల్లడించారు. ఆ వివరాలివీ.. 

వీటికి బదులివ్వాల్సిందే.. 
మే 13న సాయంత్రం 5 గంటల సమయంలో అప్పటి వరకూ ఓటింగ్‌ శాతం లెక్కలను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. 68.04 శాతం పోలింగ్‌ జరిగినట్లు పేర్కొంది. అయితే అప్పటికే పోలింగ్‌ బూత్‌లలో ఉన్నవారు ఓట్లు వేస్తారు కనుక అది పెరిగే అవకాశం ఉందని తెలిపింది. తర్వాత 8 గంటలకు మరో ప్రెస్‌ నోట్‌ను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ శాతం 68.12 శాతం అని ఉంది. ఇక అదే రోజు రాత్రి 11.45 గంటలకు 76.50 శాతంగా ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. నాలుగు రోజుల తర్వాత మే 17న మరో ప్రెస్‌ నోట్‌ను విడుదల చేసింది. దానిలో 80.66 శాతం అని వెల్లడించింది. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య ఎన్నికల అధికారి పోలింగ్‌ శాతం 81.86 అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. చివరిగా ఎన్నికల కమిషన్‌ అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించి ఏపీలో పోలింగ్‌ శాతం 81.79గా నిర్ధారించింది. సాయంత్రం ఐదు గంటల వరకూ పది గంటల పాటు పోలింగ్‌ జరిగింది. అంటే గంటకు 6.8 శాతం, తర్వాత మూడు గంటలు 0.08 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగింది. అంత తక్కువ పోలింగ్‌ ఎందుకు జరిగిందనే దానికి ఎన్నికల కమిషన్‌ ఇంత వరకూ వివరణ ఇవ్వలేదు.  

ఇదెలా సాధ్యం..? 
ఎన్నికల రోజు రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య 3,500 పోలింగ్‌ బూత్‌లలో 4.16 శాతం పోలింగ్‌ పెరిగింది. అంటే గంటకు 2 శాతం కంటే ఎక్కువ జరిగింది. అంత భారీ స్థాయిలో అ సమయంలో ఓటింగ్‌ ఎలా జరిగిందనేది పెద్ద ప్రశ్న. కేవలం 2.15 గంటలలో 17,19,482 మంది ఓట్లు వేసేశారు. అంటే ఒక్కో పోలింగ్‌ బూత్‌లలో 491 మంది ఓట్లు వేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన ఓటింగ్‌లో ఏపీలో ఉన్న 46,389 బూత్‌లతో గంటకు దాదాపు 60 ఓట్లు పడ్డాయి. అంటే నిమిషానికి ఒక ఓటు చొప్పున పడ్డాయి. 

కానీ అర్ధరాత్రి ఒక్కో బూత్‌లో 491 మంది.. అంటే నిమిషానికి ముగ్గురు కంటే ఎక్కువ మంది ఓట్లు వేశారు. ఇది సాధ్యమయ్యే పనేనా? 3,500 పోలింగ్‌ బూత్‌లలో అప్పటికే 17 గంటల పాటు పోలింగ్‌ జరిగితే సగటున గంటకు 24 మందే ఓట్లు వేశారు. అదే అర్ధరాత్రి 11.45 నుంచి 2 గంటల మధ్య గంటకు 200 మంది కంటే ఎక్కువ ఓట్లు వేశారు. ఈ నెంబర్ల మధ్య అనుమానాలకు ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాలి. అర్ధరాత్రి బారులు తీరి ఉన్న ఓటర్ల వీడియోలు బయటపెట్టాలి.  

Advertisement
 
Advertisement
Advertisement