భయపడడం నా రక్తంలోనే లేదు | Ambati Rambabu was released on Wednesday | Sakshi
Sakshi News home page

భయపడడం నా రక్తంలోనే లేదు

Feb 19 2026 5:44 AM | Updated on Feb 19 2026 7:16 AM

Ambati Rambabu was released on Wednesday

ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు

బెయిలబుల్‌ కేసులో అన్యాయంగా జైలులో ఉంచారు  

మా ఇంటిపై దాడిని చంద్రబాబు, లోకేశ్‌ పర్యవేక్షించారు  

వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రజాస్వామ్యయుతంగా కూటమి ప్రభుత్వాన్ని కూలదోస్తాం 

మాజీ మంత్రి అంబటి రాంబాబు  

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నన్ను జైలులో పెడితే భయపడతానని అనుకున్నారని, అది నా రక్తంలోనే లేదని... ఎన్ని కేసులు పెట్టినా ఒక్క అడుగూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జైలుకు వెళ్లినప్పుడు సంతోషంగానే ఉన్నానని, తిరిగి వచ్చినప్పుడూ అంతే సంతోషంగా ఉన్నానని, ఐ డోంట్‌కేర్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో 18 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న రాంబాబు బుధవారం విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బెయిలబుల్‌ కేసుకు ఇన్ని రోజులు జైలులో ఉండాల్సి వచ్చిందన్నారు. 

తనకు మద్దతు పలికిన వారికి, పలకని వారికి ధన్యవాదాలన్నారు. తనను జైలులో పెట్టడానికి చంద్రబాబు, లోకేశ్‌ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారని, వారికి ఈ చిన్నపాటి విషయం దొరికిందన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా కూల్చేవరకు ఈ పోరాటం ఆగదన్నారు. సెంట్రల్‌ జైలును తనలో పట్టుదల పెంచే శిక్షణ కేంద్రంగా భావించానన్నారు. త్వరలో పరిస్థితులు మారుతాయన్నారు. తనను అన్యాయంగా, అక్రమంగా జైలులో పెట్టారన్నారు.  

చంద్రబాబు, లోకేశ్‌ పర్యవేక్షణలోనే దాడి  
‘నా ఇంటిని దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు, ఆఫీసు పగులకొట్టారు. నా భార్య, పిల్లలను తరిమికొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైలులో పెట్టారు, అయితే ఏమైంది..’ అని చంద్రబాబు, లోకేశ్‌ను అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఏడు గంటల సేపు తన ఇంటిపై దాడి జరిగిందని, దాన్ని చంద్రబాబు, లోకేశ్‌ పర్యవేక్షించారన్నారు. పోలీసుల సమక్షంలో తెలుగుదేశం కార్యకర్తలు, రౌడీలు, గంజాయి బ్యాచ్‌ తమపై దాడి చేశారన్నారు. ఎప్పుడూ, ఎక్కడా తప్పు చేయలేదని, పొరబాటు మాట్లాడి వెంటనే పశ్చాత్తాప పడ్డానన్నారు. దానికి మించిన ప్రాయశ్చిత్తం లేదన్నారు. 

దేనికైనా సిద్ధపడి ఉన్నామని, అప్పుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెనుక, ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెనుక నడుస్తున్నామన్నారు. ఎన్ని కుట్రలైనా, కుతంత్రాలైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. జైలు అధికారులు వారి డ్యూటీ చేశారని, తనకు నచ్చకపోయినా వారు పెట్టిన ఆహారాన్నే తిన్నానని, తనను ప్రత్యేకంగా చూడాలని కోర­లేదన్నారు. జైలులో ఇబ్బంది పడలేదని, బాత్‌రూమ్‌లో జారిపడ్డానని తెలిపారు. జైలు బయట అంబటి వెంట మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, తలారి వెంకట్రావు ఉన్నారు.

అంబటి రాంబాబుకుబెయిల్‌ మంజూరు 
గుంటూరు లీగల్‌: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన క్రైమ్‌ నం.8 /23 కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.కుముదిని షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘‘రంగోలి లక్కీ డ్రా’ కార్యక్రమానికి సంబంధించి ఆరి్థక నేర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు పీటీ వారెంట్‌ ఆధారంగా అరెస్టు చేసి ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. 

ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట రాంబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి బుధవారం కోర్టులో వాదనలు వినిపిస్తూ... ఆ కార్యక్రమం ప్రజా ఉత్సవాల్లో భాగమని, మోసం, బలవంతం లేదా ఆరి్థక దుర్వినియోగం జరగలేదని, కేసులో నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని, విచారణ పూర్తికాక ముందే అరెస్టు చేయడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని వివరించారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించిన అనంతరం, న్యాయమూర్తి రెండు పక్షాల వాదనలు పరిశీలించి బెయిల్‌ మంజూరు చేశారు. విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement