కడతేర్చి.. కపట నాటకం | Kulvardhan dramatic actions in the Madanapalle incident | Sakshi
Sakshi News home page

కడతేర్చి.. కపట నాటకం

Feb 19 2026 5:40 AM | Updated on Feb 19 2026 5:40 AM

Kulvardhan dramatic actions in the Madanapalle incident

వీధుల్లోని సీసీ కెమెరాలు పరిశీలించమని బాలిక కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చిన కులవర్ధన్‌  

ఇంటిలోకి పోలీసులు రాగానే.. ‘నా పనైపోయింది సార్‌’ అంటూ వ్యాఖ్య  

రాత్రంతా మద్యం మత్తులోనే.. అక్కడే ఆరేడు మద్యం ఖాళీ బాటిళ్లు  

బాలిక మృతదేహాన్ని బయటకు తరలించేందుకు శతవిధాలా యత్నం! 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయాలు  

మదనపల్లె:  ముక్కుపచ్చలారని ఏడేళ్ల బాలికను పొట్టన పెట్టుకున్న కులవర్ధన్‌  ఇంటికి పోలీసులు వెళ్లిన సమయంలోనూ.., అంతకుముందు స్థానికులతో మాట్లాడినప్పుడు నాటకీయంగా వ్యవహరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటిలోకి పోలీసులు రావడంతోనే.. ‘నా పనైపోయింది సార్‌’ అని చెప్పి తర్వాత బెదిరింపు ధోరణితో మాట్లాడ­టం.. అంతకుముందు సోమ­వారం రాత్రి చిన్నారిని వెతుకుతున్నారా..?, కనిపించిందా..? అంటూ ఏమీ తెలియనట్లు చుట్టుపక్కల వారిని ఆరా తీసినట్టు తెలిసింది. 

అతడు వ్యవహరించిన తీరు చూస్తుంటే చిన్నారి మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తరలించాలన్న ఆలోచనతో ఉండి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. బాలిక మృతదేహం తరలించడం సాధ్యం కాకపోవడం వల్లే రాత్రంతా మృతదేహాన్ని ఇంటిలోనే ఉంచుకున్నట్టు తెలుస్తోంది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు బాలిక అదృశ్యం తర్వాత కులవర్ధన్‌ తీరుపై ఆసక్తికర విషయాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి.  

పోలీసులను చూడగానే.. బెదిరింపు ధోరణితో మాట్లాడి..
మంగళవారం ఉదయం పోలీసులు అనుమానితుడు కులవర్ధన్‌ ఇంటికి వెళ్లారు. తలుపు తట్టినా తీయలేదు. పై కప్పు కిటికీ నుంచి లోపలికి తొంగిచూడగా పడుకొని ఉన్నాడు. మళ్లీ తలుపు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులను చూడగానే.. నా పని అయిపోయింది సార్‌.. అని అన్నాడు. బాలిక హత్య విషయం ఇక దాగదనుకుని.. అలా మాట్లాడి ఉంటాడని తెలుస్తోంది. 

తర్వాత పోలీసులు ఇల్లంతా గాలించి చివరకు నీటి డ్రమ్ము మూత తీసి చూడగా బాలిక అందులో మృతదేహం ఉండటంతో వెంటనే సీఐ మొహమ్మద్‌ రఫీకి ఫోన్‌ చేశారు. ఓ పోలీసు అధికారితో కులవర్ధన్‌.. మూడు నెలలు జైల్లో ఉండి మళ్లీ తిరిగి వస్తాను సార్, అప్పుడు చూస్తాను అంటూ హెచ్చరిక ధోరణితో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి బంధువు కూడా అతని బెదిరింపు ధోరణిని బహిరంగంగా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే కులవర్ధన్‌ ప్రవర్తన ఎలాంటిదో అర్థమవుతుందని స్థానికులు అంటున్నారు.  

బాలిక బంధువులకు సలహాలిస్తూ... 
సోమవారం సాయంత్రం చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లిన కులవర్ధన్‌ ఆ రాత్రి 11 గంటలలోపే హత్య చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు వర్గాలు చెబుతున్న దాన్నిబట్టి పరిశీలిస్తే.. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో ఇంటిలో నుంచి బయటకు వచ్చిన కులవర్ధన్‌.. చిన్నారి బంధువులతో మాట్లాడాడు. 

పాప దొరికిందా? వెతుకుతున్నారా..? అంటూ వారినే ప్రశ్నించాడు. రోడ్లపై దుకాణాల సీసీ కెమెరాలు ఉన్నాయని, పరిశీలించాలంటూ సలహాలు కూడా ఇచ్చాడు. అంటే ఆ సమయంలో చిన్నారి అతని ఇంటిలోనే ఉన్నట్టు, అప్పటికే నీటి డ్రమ్ములో ముంచి చంపేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.  

హత్యాచారం తర్వాత.. రాత్రంతా మద్యం సేవిస్తూనే.. 
సోమవారం రాత్రి తన ఇంటిలో బాలికను హతమార్చిన తర్వాత కులవర్ధన్‌ అక్కడే నిద్రించాడు. పోలీసులు ఇంటిలోకి వెళ్లినప్పుడు ఆరేడు ఖాళీ మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. అంటే ఈ ఘటనకు పాల్పడిన తర్వాత విపరీతంగా మద్యం సేవించి ఉంటాడని తెలుస్తోంది. ఆ మద్యం మత్తు వల్లే తలుపు తట్టినా లేవలేదని తెలుస్తోంది. పోలీసులకు దొరికిపోతానన్న ఆందోళనతో ఇలా అతిగా మద్యం సేవించి ఉండొచ్చని భావిస్తున్నారు.  

బాలిక మృతదేహాన్ని తరలించాలనుకున్నాడా? 
కులవర్ధన్‌ చిన్నారిని చంపేసిన తర్వాత ఇంటి నుంచి బయటకు తరలించాలన్న యత్నం జరిగిందా అన్న అనుమానాలు అతని ప్రవర్తనను బట్టి వ్యక్తమైనట్టు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి ఘటన జరిగిన ప్రాంతంలోనే ఓ అగి్నప్రమాదం జరగడంతో పోలీసులు అక్కడే ఉన్నారు. దాంతో ఇతను అనుకున్నది చేయలేకపోవడంతోనే.. ఇంటిలోకి  పోలీసులు వచ్చినప్పుడు నా పనైపోయింది సార్‌ అని చెప్పి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహం దొరక్కపోయి ఉంటే తప్పించుకునే అవకాశం ఉండేదన్న భావన అతడిలో కలిగిందని చెబుతున్నారు. 

ఎదురింటిలోనే మృగాడున్నా.. 
కులవర్ధన్, అతడి చేతిలో హతమైన బాలిక నివాస గృహాలు ఎదురెదురుగానే ఉంటాయి. మధ్యలో వీధి రోడ్డు ఉంటుంది. పడమర దిశలో బాధిత చిన్నారి కుటుంబం, తూర్పుదిశలో నిందితుడు ఉంటున్న ఇల్లు ఉంది. అతడు దుర్బుద్ధి కలవాడని తెలిసినా, అనుమానం ఆ వైపు వెళ్లేసరికే ఆలస్యమైపోయింది. ఈలోపే కులవర్ధన్‌ బాలిక ప్రాణాలు తీసేసి తాపీగా మద్యం సేవించి నిద్రించాడు.

మృగాడు ఆత్మహత్య
చెరువులో శవమై కనిపించిన బాలిక హత్యాచార కేసు నిందితుడు 
అదుపులోకి తీసుకున్నాక రక్షక్‌ వాహనం నుంచి తప్పించుకున్నాడన్న ఎస్పీ 
రెండు బృందాలు గాలిస్తుండగా చెరువులో మృతదేహం గుర్తించామని వెల్లడి
మదనపల్లె:  అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై హత్యాచారం చేసిన నిందితుడు కులవర్ధన్‌(27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం కనసానివారిపల్లె వద్ద హైవే సర్వీసు రోడ్డు పక్కనున్న తిరుగంగులప్ప చెరువులో అతడి మృతదేహాన్ని బుధవారం ఉదయం గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం జిల్లా ఎస్పీ ధీరజ్‌ కనుబిల్లి మదనపల్లెలో మీడియా సమావేశంలో కేసు వివరాలు ప్రకటించారు. 

ఆయన కథనం ప్రకారం... ‘‘సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యంపై ఫిర్యాదు అందగానే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మంగళవారం ఉదయం బాలిక ఇంటికి ఎదురింట్లో నివసిస్తున్న కులవర్ధన్‌పై అనుమానంతో పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. తలుపులు వేసుకుని లోపలే ఉండడంతో గడియ పగులగొట్టి లోపలికి వెళ్లారు. బాలిక మృతదేహాన్ని నీటి డ్రమ్ములో పోలీసులు గుర్తించి నిందితుడైన కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆగ్రహంతో ఉన్న 50 మంది గ్రామస్తులు గుమిగూడి అతడిపై దాడికి యత్నించారు. 

పోలీసులు రక్షక్‌ వాహనంలో తరలిస్తుండగా, ప్రజలు ఆందోళన చేస్తూ రహదారిని స్తంభింపజేశారు. ఈ క్రమంలో రక్షక్‌ వాహనం ఆగినప్పుడు కులవర్ధన్‌ పరారయ్యాడు. ఆ సమయంలో రక్షక్‌ వాహనం డ్రైవర్‌ ఒక్కడే ఉండడంతో కులవర్ధన్‌ను పట్టుకోలేకపోయాడు. నిందితుడి ఆచూకీ కోసం రెండు బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. బుధవారం ఉదయం కనసానివారిపల్లె వద్ద చెరువులో గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని సమాచారం వచ్చింది. 

వెళ్లి చూడగా కులవర్ధన్‌దిగా నిర్ధారణ అయింది. అతడు భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కులవర్ధన్‌పై గతంలో ఒక కేసు ఉంది. ఫిర్యాదితో లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ చేసుకున్నాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లె వీఆర్వో సుస్మిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు’’ అని ఎస్పీ వెల్లడించారు.   

బాలికకు అంత్యక్రియలు  
వీరబల్లి: హత్యాచారానికి గురైన బాలిక అంత్యక్రియలు బుధవారం జరిగాయి. వైఎస్సార్‌సీపీ ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్‌ రెడ్డితోపాటు స్థానిక నాయకులు హాజరై బాలికకు కన్నీటి నివాళులు అర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement