బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బాబు సర్కారు దగా
ఉప ప్రణాళిక నిధుల్లో ఏకంగా దాదాపు రూ.27,000 కోట్లు కటింగ్
రెండేళ్లుగా ప్రచారం కోసం బడ్జెట్ కాగితాల్లో భారీగా కేటాయింపులు
నిధులు వ్యయం చేయకుండా ఆయా వర్గాలకు వంచన..
బీసీలకు బాబు ఎగ్గొట్టింది రూ.12,426 కోట్లు.. ఎస్సీలకు రూ.9,591 కోట్లు.. ఎస్టీలకు రూ.3,695 కోట్లు ఎగవేత
సబ్‌ప్లాన్ కోతలతో మైనారిటీలు మోసపోయిన మొత్తం రూ.1,132 కోట్లు
బడుగు, బలహీన వర్గాల విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, వ్యవసాయం, సంక్షేమానికి గండం
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను ఎగ్గొడుతూ.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సైతం నిలిపివేసిన చంద్రబాబు సర్కారు కనీసం ఉప ప్రణాళిక నిధులైనా వ్యయం చేయకుండా బడుగు, బలహీన వర్గాలను దారుణంగా వంచిస్తోంది. సబ్ ప్లాన్ నిధులను కాగితాలపై చూపిస్తూ.. ఖర్చు పెట్టకుండా మురగబెడుతోంది.
సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు సర్కారు రెండేళ్లలో ఎగ్గొట్టిన మొత్తం ఏకంగా దాదాపు రూ.27,000 కోట్లు!! గత రెండు బడ్జెట్ల గణాంకాల సాక్షిగా చంద్రబాబు సర్కారే దీన్ని ఒప్పుకుంది! విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, వ్యవసాయం.. సంక్షేమం కోసం ఉప ప్రణాళిక నిధులను వ్యయం చేయాలి. విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు ఉప ప్రణాళిక నుంచి అందించాలి. సంక్షేమానికి రూ.వేల కోట్లు కోత పడటంతో ఆయా వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
భారీ కేటాయింపులు చూపిస్తూ మోసం..
2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ఉత్త కేటాయింపులు మినహా ఖర్చు చేయలేదని చంద్రబాబు ప్రభుత్వమే సవరించిన బడ్జెట్ అంచనాల్లో వెల్లడించింది. కేవలం బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చూపించి మోసం చేయడం మినహా వాస్తవంగా ఖర్చు చేయడం లేదని బహిర్గతమైంది. 
గత రెండు ఆర్థిక సంవత్సరాల (2024–25, 2025–26) బడ్జెట్ల కేటాయింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ ఉప ప్రణాళికలకు ఏకంగా రూ.9,591 కోట్లు కోత విధించింది. ఇక ఎస్టీ సబ్‌ప్లాన్ కేటాయింపుల్లో ఏకంగా రూ.3,695.23 కోట్లు కోత పెట్టింది. బీసీ సంక్షేమానికి గత రెండు బడ్జెట్ల కేటాయింపుల్లో ఏకంగా రూ.12,426 కోట్లు కోత విధించింది. మైనారిటీ సంక్షేమానికి గత రెండు బడ్జెట్ కేటాయింపుల్లో రూ.1,132 కోట్ల మేర కోత విధించింది.
ఆగిపోతున్న పిల్లల చదువులు...!
చంద్రబాబు సర్కారు ప్రచారం కోసం ఎక్కువ మొత్తంలో సబ్‌ప్లాన్‌కు కేటాయింపులు చేస్తున్నట్లు బడ్జెట్లలో చూపిస్తోంది. కేటాయింపుల మేరకు ఆయా వర్గాల సంక్షేమం, ఆర్థికాకాభివృద్ధికి చేయూతనివ్వకుండా మోసగిస్తోంది. విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఉప ప్రణాళిక నుంచే అందించాలి. వీటిని ఎగ్గొట్టడంతో పేదింటి పిల్లలు చదువులు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.4,642 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో కేవలం రూ.545.51 కోట్లకే పరిమితం చేయడం గమనార్హం. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం పట్ల చంద్రబాబు సర్కారు ఎంత చిన్న చూపు చూస్తోందో స్పష్టం అవుతోంది.


