- రాష్ట్రంలో ప్రజల తీర్పునకు తూట్లు
- ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలలోనే దొరికిపోయిన ‘కల్తీ’ కూటమి
- అర్ధరాత్రి మెరుపువేగంతో పోలింగ్ వెనుక ‘మాయాజాలం’
- సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల మధ్య 51.83 లక్షల ఓట్లు
- ఒక్కో నియోజకవర్గంలో 29వేలకు పైగా ఓట్లు కలిశాయి..
- ‘అద్భుత’మైన ఫలితాలకు ఇదే కారణం
- ప్రముఖ పరిశోధనాత్మక వెబ్‌సైట్ ‘ద వైర్’ విశ్లేషణాత్మక కథనం
సరిగ్గా 18 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో దారుణ “మోసం’ జరిగింది. వ్యవస్థలన్నిటినీ అత్యంత హేయమైన రీతిలో వాడుకుని ప్రజల తీర్పునకు దుర్మార్గంగా తూట్లు పొడిచారు. కూటమి అనూహ్యమైన గెలుపు వెనక నీతిబాహ్యమైన, నీచమైన కుట్రలు ఉన్నాయని ఇపుడు సాక్ష్యాలతో సహా బయటపడింది. ఎన్నికల సంఘం గణాంకాలలోనే ఈ దుర్మార్గం స్పష్టంగా కనిపిస్తోందని, ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదని, ఇందులో ఏదో మోసం దాగి ఉందని ప్రముఖ పరిశోధనాత్మక వెబ్‌సైట్ “ద వైర్’ ఓ విశ్లేషణాత్మక వ్యాసాన్ని ప్రచురించింది.
అది రాసింది మరెవరో కాదు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక వేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్. ఆయన 201419 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో కమ్యూనికేషన్ సలహాదారు కూడా. పరకాల బయట పెట్టిన సంచలన అంశాలపై అటు నేషనల్ మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ విస్తృతమైన చర్చ జరుగుతోంది. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
సమాధానం లేని ప్రశ్నలు
మే 13 నుంచి మే 17 వరకు పోలింగ్ శాతాలను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం పదేపదే ఎందుకు మార్చాయి?
» రెండు సంస్థల ప్రకటనల మధ్య అంత తేడా ఎందుకు ఉంది?
» క్యూలో ఉన్న ఓటర్లనే అనుమతించారనుకుంటే సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు కేవలం 33,064 ఓట్లు (0.08%) మాత్రమే నమోదవడం ఏమిటి?
» రాత్రి 8 గంటల నుంచి రాత్రి 11.45 మధ్య 34,63,767 ఓట్లు (8.38%) పెరగడమేమిటి?
» అర్థరాత్రి తర్వాత 3,500 పోలింగ్ కేంద్రాలలో 17,19,482 ఓట్లు (4.16%) పోలవడం అసాధారణం కాదా? ఇంత తక్కువ సమయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఓట్లు ఎలా వేశారు?
» పోలింగ్ కేంద్రంలో ఓటరు ఓటువేయడానికి కనీసం నిమిషం పట్టిందని అనుకున్నా. 2 గంటల 15 నిముషాల్లో 17.19 లక్షల మంది ఓటర్లు ఓటేయడం సాధ్యమేనా?
» సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 491 మంది ఓటేశారనుకుంటే పోలింగ్ మరుసటి రోజు ఉదయం 10 లేదా 11 గంటల వరకు కొనసాగాలి కదా? రాత్రి 2 గంటలకు ఎలా ముగిసింది?
» పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్‌లలో ఉన్న ఓటర్లకు టోకెన్లు ఎందుకు ఇవ్వలేదు?
» ‘‘వీడియోగ్రఫీ ఆఫ్ క్రిటికల్ ఈవెంట్స్ ఇన్ పోలింగ్ స్టేషన్స్’’ మార్గదర్శకాల ప్రకారం లైన్‌లలో ఉన్న ఓటర్లను ఎందుకు వీడియో తీయలేదు?
» ఈ ప్రక్రియను ప్రిసైడింగ్ ఆఫీసర్ తన డైరీలో ఎందుకు నమోదు చేయలేదు?
» ఒకవేళ ఇవన్నీ పాటించి ఉంటే ఆ రికార్డులను ఎందుకు బయటపెట్టడం లేదు?
» అత్యంత ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా తుది పోలింగ్ శాతం ప్రకటనకు 4 రోజుల సమయం ఎందుకు పట్టింది?
పోలింగ్ శాతం... మెరుపు వేగం
ఉ. 7 గం. సా. 5 గంలకు 68.04% (గంటకు సగటున 6.8%)
సా. 5 గం రా. 8 గంలకు 68.12% (+0.08%)
రా 8 గం.రా 11.45 గంలకు 76.50% (+ 8.38%)
రా. 11.45 గం రా. 2 గంలకు 80.66%
ఫైనల్‌గా సవరించిన పోలింగ్ 81.79శాతం
ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికల డేటాను సమగ్రంగా పరిశీలిస్తే.. అధికార కూటమి 175 అసెంబ్లీ స్థానాలలో 164 స్థానాలను గెలుచుకోవడానికి కారణమైన ‘అద్భుతం’ వెనుక ఉన్న మోసం ఏమిటో తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) అధికారికంగా విడుదల చేసిన సమాచారం, ప్రకటనలు, నోటిఫికేషన్‌లు, పత్రికా ప్రకటనలలో పేర్కొన్న గణాంకాలను పరిశీలిస్తే వాస్తవాలేమిటో సులువుగా అర్ధమౌతాయి.
68.04% నుంచి 81.79% వరకు...
2024, మే 13 సాయంత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీడియాతో మాట్లాడు తూ సాయంత్రం 5 గంటల వరకు 68.04 శాతం పోలింగ్ నమోదైందని ప్రకటించారు. ఇంకా ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద వరుసలో ఉన్నారని తెలిపారు.
» 2024, మే 13న రాత్రి 8 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆంధ్రప్రదేశ్‌లో 68.12 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొంది.
» అదే రోజు అంటే మే 13, 2024 రాత్రి 11:45 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఏపీలో ఓటింగ్ 76.50 శాతానికి పెరిగిందని వెల్లడించింది.
» ఆ తర్వాత 2024, మే 17న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ శాతం మరింత పెంచి 80.66 శాతానికి సవరించింది.
» ఇవన్నీ కాదు కాదు.. అంటూ సీఈఓ పోలింగ్ శాతాన్ని 81.66 శాతంగా పేర్కొంటే.. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదికలో తుది పోలింగ్ శాతం 81.79 శాతమని తేల్చింది. కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీసీఈఓ విడుదల చేసిన గణాంకాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఎన్నికల ఫలితాల ‘అద్భుతం’ వెనుక అనుమానాస్పద అంశాలు కనిపిస్తాయి.
అర్ధరాత్రి తర్వాత 17.19 లక్షల ఓట్లు ఎలా?
పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకు 68.04 శాతం ఓటింగ్ నమోదైంది. ఏపీసీఈఓ ప్రకారం.. గంటకు సగటున 6.8 శాతం పోలింగ్ జరిగినట్లు అర్థమవుతుంది. అప్పటికి 10 గంటల పోలింగ్ పూర్తయింది. రాత్రి 8 గంటల వరకు 68.12 శాతానికి పెరిగింది. అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూడు గంటల వ్యవధిలో పోలింగ్ శాతం పెరుగుదల కేవలం 0.08 శాతం మాత్రమే. కానీ.. అదే రోజు రాత్రి 11.45 గంటలకు పోలింగ్ 76.50 శాతానికి పెరిగింది. అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకూ పోలింగ్ 8.38 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది.
» అర్ధరాత్రి తర్వాత ఈ 3,500 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లు ఓటరు టర్నౌట్ (వీటీఆర్) మరో 4.16 శాతం పెంచి 80.66 శాతానికి చేర్చినట్లు, మే 17, 2024 తేదీతో విడుదలైన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది. ఇందులో పోస్టల్ బ్యాలెట్లు లెక్కలో లేవు. ఈ శాతాన్ని వాస్తవ సంఖ్యలుగా మార్చితే, అర్ధరాత్రి తర్వాత ఈ 3,500 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 17,19,482 ఓట్లు నమోదయ్యాయని అర్థం. అంటే, సగటున ప్రతి పోలింగ్ కేంద్రంలో అర్ధరాత్రి తర్వాత 491 కంటే కొంచెం ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి.
» పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో గంటకు సగటున 60.7 ఓట్లు నమోదయ్యాయి. ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉన్న పరిస్థితిలో (ఒకటి లోక్‌సభకు, మరొకటి అసెంబ్లీకి) ఇది కూడా వేగవంతమైన పోలింగ్‌గా చెప్పవచ్చు.
» అయితే, ఈ 3,500 కేంద్రాల్లో రాత్రి 11:45 తర్వాత ఇంకా అంత పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాల్సి ఉంటే.. ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:45 వరకు అక్కడ పోలింగ్ అసాధారణంగా నెమ్మదిగా జరిగి ఉండాలి. అది గంటకు 24 ఓట్ల కంటే ఎక్కువగా ఉండకపోవచ్చు. ఈ అసాధారణ మందగమనాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, రాష్ట్ర సగటు పోలింగ్ వేగాన్ని తీసుకుంటే, ఈ 3,500 కేంద్రాల్లో పోలింగ్ మరుసటి రోజు ఉదయం 7 లేదా 8 గంటల వరకు కొనసాగాలి. ఇంకా 491 కంటే ఎక్కువ ఓట్లు నమోదైన కేంద్రాల్లో అయితే, అది ఉదయం 10 లేదా 11 గంటల వరకు కొనసాగాలి. అలా జరిగిందా? జరగలేదు.
16.5 సెకన్లలోనే రెండు ఓట్లా ?
» మే 14, 2024న జరిగిన మీడియా సమావేశంలో ఏపీ సీఈఓ చివరి ఓటు మే 14 తెల్లవారుజామున సుమారు 2 గంటలకు నమోదైందని తెలిపారు. అంటే.. మే 13 రాత్రి 11:45 పోలింగ్ శాతాన్ని ప్రకటించిన తర్వాత కేవలం 2 గంటలు 15 నిమిషాల్లో పోలింగ్ పూర్తయింది. అంటే ఈ 2 గంటలు 15 నిమిషాల్లోనే మొత్తం 17,19,482 ఓట్లు నమోదయ్యాయి.
» ఒక్క ఓటు వేయడానికి కనీసం ఒక నిమిషం పట్టిందని అనుకుంటే, ఒక్క పోలింగ్ కేంద్రంలో 491 ఓట్లు వేయడానికి 491 నిమిషాలు.. అంటే కనీసం 8 గంటలు పట్టాలి. ఒక ఓటుకు 2 నిమిషాలు పట్టిందని అనుకుంటే, అది సుమారు 16 గంటలు పడుతుంది. ఈ 17,19,482 ఓట్లు అన్ని కేంద్రాల్లో సమానంగా నమోదయ్యాయని అనుకోవడం అసాధ్యం. కొన్ని కేంద్రాల్లో 491 కంటే తక్కువ ఉంటే, మరికొన్ని కేంద్రాల్లో 491 కంటే ఎక్కువ ఉండాల్సిందే. 491 లేదా అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు క్యూలో ఉన్న కేంద్రాల్లో పోలింగ్ మరింత ఎక్కువ సమయం కొనసాగాలి. 491 కంటే తక్కువ ఉన్న కేంద్రాల్లో మాత్రం ముందుగానే ముగియాలి.
కానీ.. ఏపీ సీఈఓ చివరి ఓటు మే 14న తెల్లవారుజామున సుమారు 2 గంటలకు నమోదైంది అని చెప్పారు. అంటే.. 491 లేదా అంతకంటే ఎక్కువ మంది క్యూలో ఉన్న కేంద్రాల్లో పోలింగ్ 2 గంటలకు ముగియడం సాధ్యం కాదు. ఒకవేళ నిజంగా 2 గంటలకు ముగిసిందంటే, ఏ కేంద్రంలోనైనా క్యూలో ఉన్న గరిష్ట ఓటర్ల సంఖ్య 491 కంటే చాలా తక్కువగా ఉండాలి..
» కానీ.. మే 13 రాత్రి 11:45 నుంచి 14 తెల్లవారుజామున 2 గంటల మధ్య 17,19,482 మంది ఓటేశారని సీఈఓ చెప్పిన లెక్కతో 2 గంటల సమయం ఎలా సరిపోతుంది? సీఈఓ చెప్పిన 2 గంటల సమయాన్ని తీసుకుంటే, 491 మంది ఓటర్లు ఉన్న ఒక కేంద్రంలో నిమిషానికి సుమారు 3.6 మంది ఓటేయాలి.. అంటే ప్రతి 16.5 సెకన్లకు ఒక ఓటరు లోక్‌సభ, అసెంబ్లీకి రెండు ఓట్లేయాలి.
ఈ రికార్డులివ్వడానికి ఈసీ సిద్ధమా?
పోలింగ్ అధికారులు తీసుకోవలసిన చర్యలు తీసుకున్నారా?
» ఈసీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ హ్యాండ్‌బుక్–2023(సెక్షన్ 7.1.1)ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద నిరీ్ణత సమయానికి ముందు క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు ఉంటుంది. దానికి అధికారులు తీసుకోవాల్సిన చర్యలు అనేకం ఉంటాయి. మొదట గేట్లు మూసివేయాలి.
» ‘వీడియోగ్రఫీ ఆఫ్ క్రిటికల్ ఇవెంట్స్ ఇన్ పోలింగ్ స్టేషన్స్’ మార్గదర్శకాల్లో పోలింగ్ ముగిసే సమయానికి బయట క్యూలో ఉన్న ఓటర్లను.. చివరి ఓటరు వరకూ వీడియో తీయాలని స్పష్టంగా పేర్కొన్నారు. క్యూలో ఉన్న ప్రతి ఓటరు ముఖం స్పష్టంగా కనిపించేలా వీడియో తీసి భద్రపరచాలి. ఈ అన్ని రికార్డులు భవిష్యత్ పరిశీలన కోసం నిల్వ ఉండాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ తన డైరీలో ఈ మొత్తం ప్రక్రియను నమోదు చేయాలి. ఆ డైరీ కూడా పరిశీలనకు అందుబాటులో ఉండాలి. ఈ అంశాలపై సవాల్ స్వీకరించి రికార్డులను పరిశీలనకు అందించడానికి ఎన్నికల సంఘం సిద్ధమా?
క్యూలో ఉన్న ఓటర్లు కేవలం 33,064 మాత్రమే! మరి 51.83 లక్షల ఓట్లు ఎక్కడివి?
ఈసీ నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారికి టోకెన్లు ఇవ్వాలి. (చివరలో ఉన్నవారికి 1వ నెంబర్, మొదట ఉన్న వారికి చివరి నెంబర్). ఓటు వేసినపుడు ఆ టోకెన్లు తీసి భద్రపరచాలి. పోలింగ్ సరళిని గమనిస్తే 5 గంటల నుంచి 8 గంటల వరకు ఓటేసిన 33,064 మంది ఓటర్లే సరైన ఓటర్లని అర్ధమవుతుంది.
ఓటేయడానికి పట్టిన సమయం మ్యాచ్ అవుతోంది.. కానీ తర్వాత 11.45 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు జరిగినదంతా రిగ్గింగే. ఈవీఎం మిషన్ల దగ్గర కూర్చుని నొక్కితే గానీ 51.83 అన్ని లక్షల ఓట్లు పోలవడం సాధ్యం కాదని ఆ పోలింగ్ శాతాలను గమనిస్తే అర్థమవుతుందని విశ్లేషకులంటున్నారు.
బూత్‌లో ఓటరు 16.5 సెకన్లలో ఈ పనులన్నీ చేశారా?
» ఈసీ చెప్పిన ప్రకారం 17,19,482 మంది రెండుంబావు గంటల్లో ఓట్లేశారంటే ఒక్కొక్కరు 16.5సెకన్లలోనే లోక్‌సభ, అసెంబ్లీలకు రెండు ఓట్లు వేసి ఉంటారని అనుకోవాలి. మరి పోలింగ్ బూత్‌లో నిర్వహించాల్సిన పనులన్నీ ఆ 16.5 సెకన్లలోనే పూర్తి చేశారంటారా.. అది సాధ్యమయ్యే పనేనా?ఇది మోసపూరితంగా కనిపించడంలేదా?
» పోలింగ్‌బూత్‌లో ప్రతి ఓటరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.. ఓటర్ల జాబితాలో పేరు ధృవీకరించుకోవాలి. సంతకం చేయాలి లేదా బొటనవేలు ముద్ర ఇవ్వాలి.
» వేళ్లపై ఇంక్ వేయించుకోవాలి.
» రెండు వేర్వేరు కంపార్ట్‌మెంట్‌లలో రెండు ఓట్లు వేయాలి. బయటకు రావాలి.. ఇవన్నీ 16.5 సెకన్లలో పూర్తవ్వాలి.
» ప్రతి ఓటు తర్వాత వీవీప్యాట్ స్లిప్ రావడానికి ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో 7 సెకన్లు పడుతుంది. అంటే మొత్తం 14 సెకన్లు.
» అంటే మిగిలిన ప్రక్రియలన్నీ.. పేరు ధృవీకరణ, సంతకం లేదా బొటనవేలు ముద్ర, ఇంక్ వేయడం, మొదటి కంపార్ట్‌మెంట్‌కి వెళ్లి ఓటేయడం, తర్వాత రెండో కంపార్ట్‌మెంట్‌కి వెళ్లి ఓటేయడం.. ఇవన్నీ పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టవచ్చు?
» ఈ ప్రక్రియను పరిగణనలోకి తీసుకుంటే, కేవలం 2 గంటలు 15 నిమిషాల్లో 17,19,482 ఓట్లు నమోదవడం అసాధ్యం.
» ఈ అసాధారణ విషయాన్ని ఎలా సుసాధ్యమయ్యేలా చేశారో కేంద్ర ఎన్నికల సంఘం మాత్రమే చెప్పగలదు.
మొత్తం అదనపు ఓట్లు 51.83 లక్షలు..
పోలింగ్ శాతం పెరుగుదల పరిమాణాన్ని నిశితంగా పరిశీలిస్తే...
» 2024 మే 13న సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.. అంటే 3 గంటల్లో పోలింగ్ శాతం 68.04 శాతం నుంచి 68.12 శాతం అంటే కేవలం 0.08 శాతం మాత్రమే పెరిగింది. మొత్తం సంఖ్యల్లో చూస్తే, ఇది కేవలం 33,064 ఓట్లు మాత్రమే.
» అదే రోజు రాత్రి 8 గంటల నుండి 11.45 వరకు.. అంటే 3 గంటలు 45 నిమిషాల్లో పోలింగ్ శాతం 68.12 శాతం నుంచి 76.50 శాతానికి అంటే 8.38 శాతం పెరిగింది. మొత్తం సంఖ్యల్లో ఇది భారీగా 34,63,767 ఓట్లు. ఈ సమయంలో ప్రతి పోలింగ్ కేంద్రానికి సగటున 74 నుంచి 75 ఓట్లు నమోదైనట్లు అవుతుంది.
ఇదే కూటమి సృష్టించిన ‘మాయాజాలం’
» ఓట్లు అన్ని కేంద్రాల్లో సమానంగా నమోదు కాలేవు అన్నది సహజం. అయితే ప్రతి ఓటరు రెండు ఓట్లు వేసిన సంగతి గుర్తుంచుకోవాలి. ఒకటి అసెంబ్లీకి, మరొకటి లోక్‌సభకు.
» పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత, 2024 మే 17 నాటికి పోలింగ్ శాతం మరోసారి పెరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన గణాంకాలను సంఖ్యను తీసుకుంటే 4.16%పెరుగుదల.
» మొత్తం సంఖ్యల్లో చూస్తే.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన 80.66 శాతాన్నే తీసుకున్నా, ఇది మరో 17,19,482 ఓట్ల పెరుగుదల.
» ఈ మొత్తం పెరుగుదల కలిపి చూస్తే, 2024 మే 13 పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన శాతం నుంచి మే 17న ప్రకటించిన తుది శాతం వరకు మొత్తం 12.54 శాతం పెరుగుదలతో 51,83,249 ఓట్లు అదనంగా నమోదయ్యాయి.
» అంటే మొత్తం అదనపు ఓట్లు: 51,83,249..
» ఈ సంఖ్యను రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సమానంగా పంచితే, ఒక్కో నియోజకవర్గానికి సగటున 29,618 అదనపు ఓట్లు వస్తాయి.
» అయితే ఈ పెరుగుదల అన్ని చోట్ల సమానంగా జరిగి ఉండదు. ఒకవేళ ఈ పెరుగుదల కొన్ని ఎంచుకున్న నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే జరిగి ఉంటే, అది కొంతమంది అభ్యర్థులు లేదా పార్టీలకు భారీ విజయాన్ని ఇవ్వగలదు, మరికొంతమందిని పూర్తిగా ఓడించగలదు.
» అందువల్లే ఈ పెరుగుదల 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు, పార్టీల ఘన విజయాలకు కారణమైందని చెప్పవచ్చు.


