IFR
-
భారతీయతత్వాన్ని ప్రపంచానికి చాటాం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వసుధైక కుటుంబం అనే భారతీయ తత్వాన్ని ప్రపంచానికి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్) ద్వారా చాటిచెబుతున్నామని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తెలిపారు. క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం మన నావికాదళ విశేష లక్షణాలని ఆమె కొనియాడారు. వ్యూహాత్మకంగా విశాఖపట్నం ఎంతో కీలకమైన నగరమని, ఐఎఫ్ఆర్ను ఇక్కడ నిర్వహించుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. పదేళ్లకు ఒకసారి జరిగే ఐఎఫ్ఆర్కు విశాఖపట్నం మరోసారి వేదికైంది. త్రివిధ దళాధిపతి హోదాలో ఐఎఫ్ఆర్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు.విశాఖ తీరంలో లంగరేసిన మొత్తం 71 దేశీ, విదేశీ నౌకలను ఆమె ఐఎన్ఎస్ సుమేధ నుంచి పరిశీలించారు. రెండు గంటలకుపైగా నౌకల సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. భారతదేశం సముద్ర వారసత్వం కలిగిన దేశమని, దశాబ్దాలుగా ఇతర దేశాలతో సముద్ర మార్గంలో వాణిజ్యం జరిపామని గుర్తు చేశారు. సముద్ర మార్గాలు మన దేశ సంస్కృతి, భద్రతకు ప్రధాన ఆధారమని అభిప్రాయపడ్డారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే విషయాన్ని ఐఎఫ్ఆర్ ద్వారా మరో సారి చాటిచెప్పినట్టు అయ్యిందన్నారు. అంతర్జాతీయ స్నేహ సంబంధాలకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. నావికాదళం మరింత బలోపేతానికి చర్యలు ఐఎఫ్ఆర్లో భారత నావికాదళ విన్యాసాలతో మన శక్తి, సామర్థ్యాలను మరోసారి ప్రదర్శించగలిగామని రాష్ట్రపతి ముర్ము అన్నారు. భారత నావికాదళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సముద్ర భద్రత, ఉగ్రవాద చర్యలను నిరోధించడంతోపాటు సముద్ర మార్గంలో జరిగే దోపిడీని అరికట్టడంలో భారత నావికాదళ కృషిని ఆమె గుర్తు చేశారు. అదేవిధంగా విపత్తు సమయాల్లో భారత నావికాదళం స్వదేశంతోపాటు విదేశాల్లోనూ సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపడుతోందని గుర్తు చేశారు.‘సురక్షిత సముద్రం – సమృద్ధ భారత్’ అనే నినాదంతో మన నావికాదళం నిరంతరం ఎంతో జాగరూకతతో పనిచేస్తోందని ప్రశంసించారు. ఆమె ప్రత్యేకంగా ఒడిశాలోని బలి జాతర ఉత్సవాన్ని ప్రస్తావిస్తూ... ఇది ఆగ్నేయాసియాకు ప్రయాణించిన పురాతన కళింగ నావికులను గౌరవించడంతోపాటు ప్రాంతీయ సాంస్కృతిక స్పృహకు దోహదపడిందని పేర్కొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపరేషన్ సిందూర్‌లో కీలకపాత్ర పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎఫ్ఆర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిగ్ – 29కే ఫైటర్ జెట్స్‌తోపాటు కామోవ్ – 31 హెలికాప్టర్లు, ఎంహెచ్ – 60ఆర్ మలీ్టరోల్ హెలికాప్టర్లు.... ఇలా మొత్తం 36 హెలికాప్టర్లను తీసుకెళ్లగలిగే ఐఎన్ఎస్ విక్రాంత్‌ను విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళానికి కేటాయించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్... ఆపరేషన్ సిందూర్ సమయంలో కరాచీ నగరానికి దగ్గరలో లంగరు వేసి శత్రువు గుండెల్లో దడ పుట్టించింది. రష్యా, యుఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ తదితర విదేశాలతోపాటు స్వదేశానికి చెందిన మొత్తం 71 నౌకలు విశాఖ తీరంలో లంగరేసి నగరానికి కొత్త శోభను తీసుకొచ్చాయి. అదేవిధంగా నగరాల పేర్లతో ఉన్న ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ మైసూర్, ఐఎన్ఎస్ ముంబై యుద్ధనౌకలు కూడా ఇందులో పాల్గొన్నాయి. భారత నౌకాదళంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొదటి సర్వే నౌక ఐఎన్ఎస్ సంధాయక్కు అనకాపల్లి జిల్లాకు చెందిన కెప్టెన్ ధీరజ్ కమాండింగ్ అధికారిగా వ్యవహరించడం గమనార్హం. ఆకట్టుకున్న నావికాదళ విన్యాసాలు వివిధ యుద్ధనౌకల సామర్థ్యాన్ని పరిశీలిస్తూ రాష్ట్రపతి ముర్ము ముందుకు సాగుతున్న తరుణంలో నావికాదళం చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ల (ఎఎల్‌హెచ్) నుంచి కాంబాట్ జంప్స్, యుద్ధ సమయంలో ఉపయోగించే టెన్ – టెన్ మెథడ్‌లో రెస్క్యూ డైవర్లని యుద్ధ నౌకలపై మోహరించడం, నీటి ఉపరితలానికి కేవలం 10 అడుగుల ఎత్తులో ఎగురుతూ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడం, హెలికాప్టర్లపై నుంచి సాహసోపేతంగా సముద్రంలోకి దూకి.. బాధితులను రక్షించడం, వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించడం... వంటి విన్యాసాలు గగుర్పొడిచాయి. అదేవిధంగా రెండు హాక్ విమానాలు.. ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నట్లుగా ప్రెసిడెన్షియల్ యాచ్ మీదుగా గంటకు 400 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళ్తూ నిర్వహించిన విన్యాసాలు కంటి రెప్ప వాల్చనీయలేదు. అనంతరం చేతక్ హెలికాఫ్టర్ ద్వారా ఫ్లైపాస్ నిర్వహించారు. ఆ తర్వాత ఏఎల్‌హెచ్ ధ్రువ్, యూహెచ్త్రీహెచ్, సీకింగ్, కామోవ్ హెలికాఫ్టర్లు, విమానాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా చేసిన విన్యాసాలు నౌకాదళ సత్తాని చాటాయి. చివరిగా డోర్నియర్, మిగ్ – 29కే యుద్ధ విమానాలు డైమండ్ ఆకారంలో గంటకు 400 నాటికల్ మైళ్ల వేగంతో గాల్లో దూసుకొస్తూ చేసిన విన్యాసాలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. తీరంలో 6 వరుసల్లో 71 నౌకల లంగరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తూర్పు నావికాదళ కేంద్రానికి ఉదయం 9.50 నిమిషాలకు చేరుకున్నారు. ఆమెకు నౌకాదళ ప్రధానాధికారి దినేష్ కె.త్రిపాఠితోపాటు గవర్నరు అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ యుద్ధనౌకలో ప్రయాణిస్తూ తీరప్రాంతం వెంబడి ఆరు వరుసల్లో లంగరు వేసిన 71 దేశీ, విదేశీ నౌకల సామర్థ్యాలను ఆమె పరిశీలించారు. మొత్తం 19 విదేశీ యుద్ధనౌకలతోపాటు భారత నేవీకి చెందిన 45 యుద్ధ నౌకలు, తీరప్రాంత రక్షణ నౌకలు, వాణిజ్య నౌకలు, పరిశోధన నౌకలు కూడా ఇందులో భాగమయ్యాయి. ఈ సందర్భంగా మిగ్ – 29 కే జెట్ ఫైటర్లు, డారి్నయర్ ఎయిర్‌క్రాఫ్ట్స్, చేతక్ హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి నిప్పులు చిమ్ముతూ ఎయిర్‌క్రాఫ్ట్‌లు దూసుకెళ్లిన దృశ్యాలు మురిపించాయి. -
విశాఖకు చేరుకుంటున్న విదేశీ యుద్ధ నౌకలు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్), మిలాన్, ఐవోఎన్ఎస్ చీఫ్ ఆఫ్ నేవీస్ కాంక్లేవ్‌కు విశాఖ నగరం సిద్ధమవుతోంది. యుద్ధ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఒక్కో దేశానికి చెందిన నౌకాదళాధికారులు, యుద్ధ నౌకలు, సెయిలర్స్ విశాఖ నేవల్ బేస్‌కు చేరుకుంటున్నారు. తూర్పు నౌకాదళాధికారులు, నావికులు విదేశీ ప్రతినిధులు, నౌకలకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఈనెల 15 నుంచి ఐఎఫ్ఆర్–2026 ప్రారంభం కానుంది. ఇప్పటికే మాల్దీవులు, వియత్నాం, సీషెల్స్, ఫిలిప్పీన్స్ నౌకాదళాలు విశాఖ చేరుకున్నాయి. మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బందితో పాటు సీజీఎస్ హరావీ, సీషెల్స్‌కు చెందిన ఎస్‌సీజీఎస్ జొరాస్టర్ కోస్ట్‌గార్డ్ షిప్, వియత్నాంకు చెందిన వార్‌షిప్‌లకు తూర్పు నౌకాదళం ఆతిథ్యమందించింది. శుక్రవారం రాత్రి మరికొన్ని దేశాలకు చెందిన నౌకలు వచ్చాయి. శనివారం సాయంత్రానికి వివిధ దేశాలకు చెందిన 23 యుద్ధ నౌకలు విశాఖకు రానున్నాయని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. -
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు భారత యుద్ధ నౌకలు
సాక్షి, విశాఖపట్నం: జపాన్‌లో ఈ నెల 6న ప్రారంభం కానున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు భారత యుద్ధనౌకలు బుధవారం యెకోసుకా తీరానికి చేరుకున్నాయి. తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కమోర్తా యుద్ధ నౌకలు ఐఎఫ్ఆర్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ ఐఎఫ్ఆర్లో 13 దేశాలకు చెందిన 40 యుద్ధనౌకలు, జలాంతర్గాములు పాల్గొంటున్నాయి. ఫ్లీట్ రివ్యూని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమీక్షించనున్నారు. ఐఎఫ్ఆర్లో పాల్గొన్న అనంతరం.. భారత యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కమోర్తా జపాన్‌లో జరిగే మలబార్ 26వ ఎడిషన్ విన్యాసాల్లో పాల్గొననున్నాయి. నవంబర్ 8 నుంచి 18 వరకు జరిగే మలబార్లో భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాల నౌకాదళాలు పాల్గొంటాయి. -
వెలుగుల్లో కురుసుర.. టీయూ 142 (ఫోటోలు)
-
సంభ్రమాశ్చర్యాల కలబోత
సాహసోపేతమైన విన్యాసాలు, సంప్రదాయ కళారూపాలు, అధునాతన నృత్య రీతులు, ర్యాప్ సంగీత హోరు విశాఖ సాగర తీరాన్ని ఉత్తేజభరితం చేశాయి. నాలుగు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ నౌకా దళ ప్రదర్శన(ఐఎఫ్ఆర్) సందర్భంగా ఆకాశంలో, సముద్రంలో, నేలమీదా నావికా దళం చేసిన విన్యాసాలు చూసి వేలాదిమంది వీక్షకులు మంత్రముగ్ధులయ్యారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శించిన పాటవం అందరినీ అబ్బురపరిచింది. ఎప్పుడో పదిహేనేళ్లక్రితం జరిగిన ఐఎఫ్ఆర్ తర్వాత మన దేశం నిర్వహించిన రెండో వేడుక ఇది. తూర్పు తీరం వేదికగా జరిగిన మొట్టమొదటి సంరంభం. ఈ అంతర్జాతీయ ప్రదర్శన కోసం నావికారంగ నిపుణులు, ఉన్నతాధికారులు ఎంతకాలంనుంచో ఎదురుచూస్తున్నారు. దేశదేశాలనుంచీ వచ్చి ఇందులో పాలుపంచుకునేవారందరి ముందూ తమ ప్రతిభాపాటవాలను చాటడానికి, తమ యుద్ధ సన్నద్ధతను వెల్లడించడానికి, తమ శక్తియుక్తులను తెలపడానికి నావికాదళానికి లభించే అపూర్వ అవకాశమిది. అంతేకాదు...వారి విన్యాసాలతో సరిపోల్చుకుని మరింత పదునుదేరడానికి తోడ్పడే సందర్భమిది. ఈ ప్రదర్శనలో 51 దేశాలు పాల్గొంటే అందులో సగం దేశాలు యుద్ధ నౌకలను పంపాయి. దాదాపు 90 యుద్ధ నౌకలు, తీర రక్షక నౌకలు, మర్చంట్ నౌకలు, జలాంతర్గాములు...వాటితోపాటు మిగ్ 29కె, పీ81, హక్, ఫాంటన్స్, బ్లాక్ పాంథర్స్, వైట్ టైగర్స్ యుద్ధ విమానాలు, పలు హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. 2001లో ముంబై తీరాన తొలిసారి జరిగిన ఐఎఫ్ఆర్లో కేవలం 29 దేశాలు మాత్రమే పాల్గొన్నాయని గుర్తుంచుకుంటే ఇప్పుడు విశాఖ తీరంలో సాగిన విన్యాసాల విస్తృతి ఎంతటిదో అర్ధమవుతుంది. ఈసారి ఐఎఫ్ఆర్ను కేవలం యుద్ధ నౌకల, విమానాల విన్యాసాలకే పరిమితం చేయకుండా ఎన్నో సంక్లిష్టతలతో నిండి ఉన్న వర్తమాన తీర ప్రాంత భద్రతా వాతావరణాన్ని, ఆ నేపథ్యంలో వివిధ దేశాలమధ్య పెంపొందాల్సిన సుహృద్భావాన్ని, అందుకోసం అవసరమైన సహకారాన్ని తేటతెల్లం చేసేవిధంగా రూపొందించారు. మహాసాగరాల సాక్షిగా కలిసి సాగుదామన్న ఇతివృత్తంతో రూపొందిన ఈ ఐఎఫ్ఆర్... ఉగ్రవాదం, సముద్ర దొంగతనాలు, స్మగ్లింగ్వంటి నేర చర్యలను అరికట్టడంలో ప్రాంతీయ సహకారం ఎంత కీలకమో నొక్కిచెప్పింది. ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థల్ని ఏర్పాటుచేసుకుంటే పెనుముప్పును తప్పించుకోవచ్చునని చాటింది. అంతేకాదు...భూగోళం వేడెక్కి మంచు కరుగుతున్న కారణంగా సముద్ర మట్టాలు పెరగడం, పర్యవసానంగా దేశాల సరిహద్దులు మారడంవంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇక సునామీలు, తుఫానుల సంగతి సరేసరి. ఇలాంటి సమయాల్లో సమాచారం ఇచ్చిపుచ్చుకునే విధానం సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. సంక్షోభ నివారణకు తోడ్పడుతుంది. ఆ దిశగా కూడా ఆలోచింపజేసేందుకు ప్రస్తుత సందర్భం దోహదపడిందని చెప్పాలి. ప్రపంచ వాణిజ్యంలో 90 శాతం సాగరమార్గాల్లోనే సాగుతుంది. అంటే దేశాలు ఆర్ధికంగా బలపడాలంటే సముద్ర మార్గాలు ప్రమాదరహితంగా, ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. పరస్పర అపనమ్మకం, అనుమానాలు అలుముకొన్న ప్రస్తుత కాలంలో ఇలాంటి అంతర్జాతీయ ప్రదర్శనల నిర్వహణ సులభం కాదు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న చైనా, జపాన్‌లమధ్య దక్షిణ చైనా సముద్ర విషయమై ఇప్పటికే తగాదా ఉంది. కొన్ని నెలలక్రితం జపాన్ నిర్వహించిన అంతర్జాతీయ నావికాదళ ప్రదర్శనలో చైనాకు చోటు దొరకలేదు. ఒక్క జపాన్‌తో మాత్రమే కాదు... సరిహద్దు జలాల విషయంలో అనేక ఆగ్నేయాసియా దేశాలతో చైనాకు వివాదాలున్నాయి. ఆ దేశాలన్నిటికీ వెనకనుంచి అమెరికా అండదండలందిస్తున్నదనే అనుమానాలు పుష్కలంగా ఉన్నాయి. హిందూ మహా సముద్రంలో భారత్ తన చొరవనూ, సమర్ధతనూ ప్రదర్శించడం కోసం ప్రస్తుత సందర్భాన్ని వినియోగించుకుంటుందని కూడా చైనా అంచనా వేసింది. ఇక ఈ వేడుకలకు రమ్మని పిలిచినా మన పొరుగునున్న పాకిస్తాన్ మొహం చాటేసింది. అందువల్లే ‘భౌగోళికంగా విడివడి ఉన్నా మహాసాగరాల్లో కలిసి పనిచేద్దామ’ని ఈ సందర్భానికి చాలాముందే మన నావికాదళ చీఫ్ ఆర్కే ధావన్ అన్ని దేశాలకూ విజ్ఞప్తిచేశారు. మనకుండే అభ్యంతరాలనూ, సందేహాలనూ ప్రాంతీయ ప్రయోజనాల కోసం పక్కనబెడదామని కోరారు. విశాఖ తీరంలో జరిగిన ఈ ప్రదర్శన మరో ముఖ్యమైన అంశాన్ని ప్రపంచ దేశాల ముందు పరిచింది. ప్రధాని నరేంద్రమోదీ ‘మేకిన్ ఇండియా’ పిలుపును ప్రతిబింబించేవిధంగా దేశీయంగా రూపొందించిన అనేక ఉత్పత్తులను మన నావికాదళం ప్రదర్శించింది. రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలన్న తపనతో నావికాదళం పదిహేనేళ్లక్రితం డీఆర్డీఓ సహకారంతో వివిధ ఉత్పత్తులపై దృష్టిపెట్టింది. ఆ రంగంలో ఎంతో పురోగతి సాధించింది. ప్రపంచ శాంతి సాకారం కావాలంటే సముద్ర జలాల్లో శాంతి, సుస్థిరతలు అవసరమని...అందుకోసం సాగర తీర దేశాల మధ్య వ్యూహాత్మక, సుహృద్భావ సంబంధాలుండాలని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంతోపాటు అందుకోసం ఏప్రిల్‌లో ముంబైలో మారిటైమ్ సదస్సు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. తీర ప్రాంత భద్రతలో మన సంసిద్ధతను ఐఎఫ్ఆర్ ప్రపంచానికి వెల్లడించింది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత్ పోషించే వ్యూహాత్మక పాత్రను తేటతెల్లం చేసింది. గత ఏడెనిమిదేళ్లుగా హిందూమహా సముద్ర ప్రాంతంలో మన నావికాదళం చురుగ్గా పనిచేస్తోంది. అరేబియా సముద్ర ప్రాంతంలో సముద్ర దొంగల పనిబట్టడంలో పేరు సంపాదించుకుంది. అయితే మన నావికాదళం వినియోగించే నౌకలు, జలాంతర్గాములు వగైరాల్లో 60 శాతం వార్థక్యానికొచ్చాయి. ఐఎఫ్ఆర్లో పాల్గొన్న ఐఎన్ఎస్ విరాట్ 29 ఏళ్ల సర్వీసు తర్వాత త్వరలో నిష్ర్కమించబోతున్నది. రెండేళ్లక్రితం ఐఎన్ఎస్ సింధురక్షక్లో పేలుళ్లు సంభవించి 18మంది నావికా సిబ్బంది మరణించడంతో మొదలెట్టి వరసబెట్టి అనేక చిన్నా పెద్దా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీనికితోడు ఉన్నతాధికారుల స్థాయిలో 16 శాతం...నాన్ కమిషన్డ్ అధికారుల్లో 11 శాతం ఖాళీలున్నాయి. ఈ లోటుపాట్లన్నిటినీ సరిదిద్దుకోవడానికీ, మన సామర్ధ్యానికి మరింత పదునుపెట్టుకోవడానికీ ఇలాంటి సందర్భాలు దోహదపడతాయి. పటిష్ట కార్యాచరణకు కదిలిస్తాయి. -
ప్రధాని మోదీకి అరకు కాఫీ రుచి!
6న ఐఎఫ్ఆర్లో జీసీసీ స్టాల్ సందర్శించనున్న ప్రధాని ఈ సందర్భంగా కాఫీ రుచి చూపించనున్న అధికారులు సీఐఐ సదస్సులో అరకు కాఫీని ఆస్వాదించిన కేంద్ర, రాష్ట్ర నేతలు సాక్షి, విశాఖపట్నం: ఒకప్పటి చాయ్ వాలా.. నేటి ప్రధాని నరేంద్రమోదీ అరకు కాఫీ రుచి చూడబోతున్నారు. విశాఖ ఏజెన్సీలో పండించే ఆర్గానిక్ కాఫీకి జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ ఉంది. వాతావరణం, భూసారం, పండించే విధానం వంటివి ఈ కాఫీకి అమోఘమైన రుచి తెచ్చిపెడుతున్నాయి. గిరిజనులకు ఆర్థిక వెసులుబాటు కోసం కొన్నాళ్ల క్రితం గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ‘అరకు వ్యాలీ కాఫీ’ పేరుతో దీని మార్కెటింగ్ బాధ్యతలు చేపట్టింది. ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన కేంద్రమంత్రి అనంతకుమార్, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, ఇతర జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ కాఫీ రుచి చూసి.. ఔరా! అన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్)లో పాల్గొనేందుకు ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ విశాఖ వస్తున్నారు. ఆ మర్నాడు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న మారిటైం ఎగ్జిబిషన్, ఐఎఫ్ఆర్ విలేజ్‌ను సందర్శిస్తారు. అందులో వీవీఐపీ లాంజ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కనే అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయాలని గురువారం సాయంత్రం కలెక్టర్ ఎన్.యువరాజ్ జీసీసీ ఎండీ ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్‌కు సూచించారు. ఆ స్టాల్ వద్దే ఫిబ్రవరి 6న సాయంత్రం మూడు గంటలకు ప్రధాని మోదీ అరకు కాఫీ రుచిని ఆస్వాదించనున్నారు. విశాఖ మన్యంలో లక్ష మంది గిరిజనులు పండిస్తున్న అరకు కాఫీకి దక్కుతున్న అరుదైన గౌరవంగా దీన్ని భావిస్తున్నామని రవిప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు.


