గన్నవరం: ప్రతికూల వాతావరణ పరిస్ధితుల కారణంగా సోమవారం గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. న్యూఢిల్లీ విమానాన్ని దారి మళ్లించగా, మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. గన్నవరం విమానాశ్రయ ప్రాంతాన్ని తెల్లవారుజాము నుంచి పొగమంచు దుప్పటిలా కప్పేసింది.
దీంతో న్యూఢిల్లీ నుంచి ఉదయం 8.15 గంటలకు ఇక్కడకు వచ్చిన ఎయిరిండియా విమానం రన్‌వేపై విజిబులిటీ లేకపోవడంతో సుమారు అరగంట పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. అయినప్పటికి ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలించకపోవడంతో విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించారు. ఈ విమానం తిరిగి 11 గంటలకు ఇక్కడికి చేరుకుంది. పొగమంచు కారణంగా హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై విమాన సర్వీస్‌లు ఆలస్యంగా నడిచాయి.


