
అమెరికా బహుళజాతి సంస్థ ఒరాకిల్ తన క్లౌడ్ యూనిట్‌లో ఉద్యోగాలను తొలగిస్తోందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలోనే ఈ మేరకు కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. తమ కొలువులు కోల్పోయామని కొందరు ఉద్యోగులు సైతం చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అయితే ఎంతమందికి లేఆఫ్స్ ఇచ్చారో మాత్రం తెలియరాలేదు. ఈ విషయంపై కంపెనీ అధికారులు స్పందిస్తూ ఈ లేఆఫ్స్ పూర్తిగా పనితీరుపై ఆధారపడినవేనని చెప్పారు.
వ్యూహాత్మక మార్పులు, పునర్వ్యవస్థీకరణలు, ఉద్యోగుల పనితీరు కారణంగా తమ సిబ్బంది సంఖ్యలో మార్పులు చేస్తామని ఒరాకిల్ జూన్ ఫైలింగ్‌లోనే చెప్పింది. చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు విభిన్న కారణాలతో లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసేందుకు, పెరుగుతున్న ఖర్చులను నియంత్రించడానికి మైక్రోసాఫ్ట్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్, మెటా ప్లాట్‌ఫామ్స్ వంటి కంపెనీలు కూడా కృత్రిమ మేధ అభివృద్ధికి ఎక్కువ ఖర్చు చేస్తుండడంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
ఇదీ చదవండి: ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?
గత నెలలో అమెరికాలో 4.5 గిగావాట్ల డేటా సెంటర్ పవర్ కోసం ఓపెన్ఏఐ ఓరాకిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒరాకిల్ డేటా సెంటర్ల నుంచి భారీ మొత్తంలో కంప్యూటింగ్ పవర్‌ను అద్దెకు తీసుకునేందుకు ఓపెన్ఏఐ అంగీకరించింది. తర్వాత ఒరాకిల్ స్టాక్ ఆల్‌టైమ్ గరిష్టానికి దగ్గరగా చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఒరాకిల్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ లేఆఫ్స్ తరుణంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుని, మెరుగైన పనితీరు కనబరచాలని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు ఏఐపై ఆధారపడబోతోందని స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన స్కిల్స్‌పై ఎక్కువ దృష్టి సారించాలని చెబుతున్నారు.