కొనసాగుతున్న టెక్ లేఆఫ్స్
జాబితాలో ప్రపంచ దిగ్గజ కంపెనీలు
రెండేళ్ల క్రితంతో పోలిస్తే సగంతగ్గుదల
సాక్షి, స్పెషల్ డెస్క్: సాంకేతికరంగ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఏఐ చిచ్చు ప్రధానంగా ఐటీ రంగంపైనే ప్రభావం చూపుతోంది. కంపె నీలు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, పునర్ వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తుండటంతో ఉద్యోగుల తీసివేతలు తప్పడం లేదన్నది పరిశ్రమ వర్గాల మాట. కోవిడ్–19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొంత కాలంపాటు టెక్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా నియామ కాలు చేపట్టాయి. అయితే స్థూల ఆర్థిక ఒత్తిళ్లతోకొన్నాళ్లుగా మార్కెట్ దిద్దుబాటుకు గురవుతోంది.

ఇటీవలి కాలంలో ఏఐ, ఆటోమేషన్ వైపు పరిశ్రమ మళ్లుతోంది. దీని ఫలితంగా 2025లో ప్రపంచవ్యాప్తంగా 257 టెక్ సంస్థలు 1.22 లక్షల మందికి ఉద్వాసన పలికాయని ఉద్యోగుల తొలగింపులను ట్రాక్ చేస్తున్న లేఆఫ్స్. ఎఫ్‌వైఐ వెబ్‌సైట్ వెల్లడించింది. సిబ్బందిని ఇంటికి సాగనంపిన సంస్థల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజాలూ ఉన్నాయి. కానీ 2023తో పోలిస్తే ఈ తీసివేతలు సగానికంటే తక్కువే కావ డం గమనార్హం. మరో సాంకేతిక దిగ్గజం యాపిల్ సైతం డజన్లకొద్దీ సేల్స్ సిబ్బందిని కుదించింది. ద్రవ్యోల్బణం, సుంకాల కారణంగా పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలను తగ్గించుకోవడానికి మార్గాలను అన్వే షిస్తున్నాయి. తక్కువ మంది ఉద్యోగులతో కార్యకలా పాలను నిర్వహించడం, ఏఐపై ఆధారపడటం కంపెనీలకు ఆకర్షణీయమైన స్వల్పకాలిక పరిష్కారంగా కనిపిస్తోంది.

లేఆఫ్స్‌కు ప్రధాన కారణాలు ఇవీ..
1. ఓవర్ హైరింగ్–మార్కెట్ కరెక్షన్
కోవిడ్–19 సమయంలో ఈ–కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రిమోట్ వర్క్ టూల్స్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో టెక్ పరిశ్రమలో భారీ నియామకాలకు దారితీసింది. ప్రస్తుతం మార్కెట్ యథాతథ స్థితికి చేరుకోవడం, డిమాండ్ వృద్ధి సాధారణం కావడంతో కంపెనీలు తాము అధిక సిబ్బందితో ఉన్నట్లు గుర్తించాయి. ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా శ్రామిక శక్తిని సరైన పరిమాణంలో ఉపయోగిస్తున్నాయి.
2. పెట్టుబడిదారుల డిమాండ్స్
అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, మాంద్యం భయాలు వంటి ప్రపంచ ఆర్థిక ఎదురుగాలులు నిర్వహణ ఖర్చులను పెంచడంతోపాటు లాభాలను తగ్గించాయి. పెట్టుబడి దారులు ఇప్పుడు లాభదాయకత, ఆర్థిక క్రమశిక్ష ణను కోరుతున్నారు. ఖర్చులను తగ్గించడానికి, లాభాలను మెరుగుపరచడానికి తొలగింపులను కంపెనీలు తక్షణ మార్గంగా భావిస్తున్నాయి.
3. ఏఐ, ఆటోమేషన్ వైపు పయనం
ఏఐ, ఆటోమేషన్ విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి, స్వీకరణ ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణం. కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాలు, పరిశోధనలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయి. నిధులు సమకూర్చ డానికి ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి రంగాల్లో రోజువారీ పనులను ఏఐ ఆటోమేట్ చేస్తోంది. కార్మికుల అవసరాన్ని తగ్గిస్తోంది. ఐటీ పరిశ్రమలో నైపుణ్యాల పునఃసమీక్షకు దారితీస్తోంది.
4. సమర్థతకు పెద్దపీట
అనేక టెక్ దిగ్గజాలు నిర్వహణ సామర్థ్యం, వేగంపై దృష్టిసారించాయి. భవిష్యత్ వృద్ధి విభాగాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వీలుగా అప్రాధాన్య ప్రాజెక్టులు, పేలవమైన పనితీరుగల యూనిట్లను తగ్గించుకుంటున్నాయి.
5. నిర్దిష్ట రంగాల్లో తగ్గుతున్న డిమాండ్
వ్యక్తిగత కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్, సంప్రదాయ నెట్‌వర్కింగ్ హార్డ్‌వేర్ వంటి కొన్ని ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా వాటితో ముడిపడి ఉన్న నిర్దిష్ట వ్యాపార యూనిట్లలో ఉద్యోగాల కోతలు ఏర్పడుతున్నాయి.


