కొవిడ్ మహమ్మారితో మొదలైన ‘రిమోట్ వర్క్’ సంస్కృతికి 2025 నాటికి తెరపడింది. గత ఐదేళ్లుగా సాగిన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలుకుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి టెక్నాలజీ, ఫైనాన్షియల్ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు పిలుస్తున్నాయి. వారం అంతా ఆఫీసు నుంచే పని చేయాలనే నిబంధన ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో సాధారణ స్థితిగా మారింది.
క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు
2025 ప్రారంభంలో అమెజాన్ తీసుకున్న సంచలన నిర్ణయంతో ఈ మార్పు ఊపందుకుంది. అమెజాన్ క్లౌడ్ విభాగం అధిపతి మాట్ గార్మాన్ ఒక అడుగు ముందుకేసి ఆఫీసుకి రావడం ఇష్టం లేని వారు కంపెనీని విడిచి వెళ్లవచ్చని స్పష్టం చేశారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోస్సేరి వచ్చే ఫిబ్రవరి 2 నుంచి అమెరికా ఉద్యోగులందరూ వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలని మెమో జారీ చేయడంతో ఈ ఏడాది మరింత కఠిన నిర్ణయాలతో ముగుస్తోంది.
కేవలం అమెజాన్ మాత్రమే కాకుండా గత కొన్ని నెలల్లో చాలా కంపెనీలు తమ విధానాలను మార్చుకున్నాయి. టెక్నాలజీ రంగంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా, సేల్స్‌ఫోర్స్, స్నాప్, డెల్, ఐబీఎం వంటి కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని స్వస్తి చెప్పాయి. బ్యాంకింగ్ రంగంలో జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి కంపెనీలతోపాటు డిస్నీ, ఏటీ అండ్ టీ వంటి ఇతర సంస్థలు ఈమేరకు చర్యలు తీసుకున్నాయి. భారతీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్(TCS), ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఇప్పటికే తమ ఉద్యోగులను పూర్తిస్థాయిలో కార్యాలయాలకు రావాలని ఆదేశించాయి.
ప్రతిభ ఉంటేనే ఇంటి నుంచి పని!
ప్రపంచంలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్ సంస్థ రాండ్‌స్టాడ్ సీఈఓ సాండర్ వాన్ స్పందిస్తూ.. ‘రిటర్న్-టు-ఆఫీస్ యుద్ధం ముగిసింది. అయితే, ఇందులో ఒక కొత్త నిబంధన వచ్చి చేరింది. అదే హైబ్రిడ్ హైరార్కీ. మీరు 100% రిమోట్ ఉద్యోగాన్ని కోరుకోవాలంటే చాలా ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉండాలి. అసాధారణమైన సాంకేతిక నైపుణ్యం లేదా నిరూపితమైన నెట్‌వర్కింగ్ నైపుణ్యం ఉన్న స్టార్ పెర్ఫార్మర్స్ అయితేనే అవకాశం ఉంటుంది’ అన్నారు.
ఆఫీసు ఎందుకు ముఖ్యం?
కంపెనీల అధినేతలు ఆఫీసు వర్క్ విధానాన్ని సమర్థించడానికి బలమైన కారణాలను చూపుతున్నారు. జేపీ మోర్గాన్ సీఈఓ జామీ డిమోన్ మాట్లాడుతూ, ఆఫీసులో అందరూ కలిసి పని చేయడం వల్ల జూనియర్లు సీనియర్ల నుంచి నేరుగా నేర్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖాముఖి చర్చల ద్వారా కొత్త ఆలోచనలు పుడుతాయన్నారు. ఉద్యోగుల్లో కంపెనీ విలువలను పెంపొందింవచ్చన్నారు.
ఇదీ చదవండి: ‘కొత్త ఏడాదిలో భారత్‌ను వదిలి వెళ్తున్నా!’


