ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చాలామంది తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పుడు అలాంటిదే.. మరొకటి ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది.
ఒక 21 ఏళ్ల యువకుడు కార్పొరేట్ సంస్థలో పనిచేస్తూ.. తనను తానే సరదాగా 'కార్పొరేట్ మజ్దూర్' (లేబర్) అని చెప్పుకున్నాడు. అతడికి కేటాయించిన పనులన్నింటినీ ఒక గంట ముందే పూర్తి చేశాడు. మేనేజర్ సాయంత్రం 6 గంటలకే వెళ్లిపోయారని భావించి, ఓవర్‌టైమ్ జీతం వస్తుందనే ఉద్దేశంతో ఆఫీసులోనే ఉండిపోయాడు. పని లేకపోవడంతో అతడు తన మొబైల్‌లో రెడిట్ నోటిఫికేషన్లు స్క్రోల్ చేస్తుండగా, రాత్రి 8 గంటల సమయంలో.. మేనేజర్ అతని డెస్క్ దగ్గర కనిపించాడు.

మేనేజర్ అతన్ని చూసి ఎందుకు పని చేయడం లేదు? అని ప్రశ్నించాడు. తనకు అప్పగించిన పనులన్నీ పూర్తయ్యాయని చెప్పగానే.. అయితే ఇంకో పని అడుగు అని మేనేజర్ పేర్కొన్నారు. అక్కడితో ఆ విషయం ఆగలేదు. మేనేజర్.. సీనియర్ మేనేజ్‌మెంట్‌కి సమాచారం ఇచ్చి, ఆఫీసులో ఉద్యోగులు ఏం చేస్తున్నారు అన్నది గమనించమని చెప్పాడట. ముఖ్యంగా తననే ఉదాహరణగా చూపిస్తూ, ఇలాగే ఖాళీగా ఉంటే ఓవర్‌టైమ్ జీతం కట్ చేస్తామని హెచ్చరించారు.
జరిగిన సంఘటన ద్వారా.. తాను టార్గెట్ అయ్యానని ఆ యువకుడు బాధపడ్డాడు. అదే సమయంలో ఇతర ఉద్యోగులు కూడా మొబైల్ ఫోన్లు వాడుతుండగా, వారు మాత్రం మేనేజర్ కంట పడలేదు. సహోద్యోగులు ఈ పరిస్థితిని ఆఫీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మాదిరిగా తీసుకుని, కొత్తగా వచ్చిన ఉద్యోగిని క్లాస్‌లో పిల్లాడిని మందలించినట్లు మందలించడాన్ని చూసి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇది ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా?


