ఇంజనీరింగ్ విద్యలోకి టెక్ నైపుణ్య మెళకువలు
కోర్సుల డిజైన్‌పై ఏఐసీటీఈ కొత్త ఆలోచనలు
టెక్ ఉద్యోగాల కొలమానంగా కోర్సుల విభజన
అంతర్జాతీయ ఆన్‌లైన్ కోర్సుల గుర్తింపు
కేంద్రం ముందుకు ఏఐసీటీఈ తాజా ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: టెక్ ఉద్యోగాల ట్రెండ్ సమూలంగా మారుతోంది. విస్తృత నైపుణ్యం సాంకేతిక గీటురాయి అవుతోంది. సీ..సీ ప్లస్..జావా.. పైథాన్ వంటి కంప్యూటర్ లాంగ్వేజ్‌లపై అత్యాధునిక డీప్ లెర్నింగ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. 2030 నాటికి భారత్‌లో 5 లక్షల ఉద్యోగాలకు డీప్ లెర్నింగ్ ప్రాథమిక కొలమానం అవుతుందని నౌకరీ డాట్‌కామ్ వంటి సర్వేలు వెల్లడిస్తున్నాయి.
డేటా కేంద్రాలకు కనెక్ట్ అయ్యే మాడ్యూల్ పరిభాషలో డీప్ లెర్నింగ్ టూల్ అత్యంత కీలకపాత్ర పోషించనుంది. ఈ క్రమంలో దేశీయ ఇంజనీరింగ్ విద్యలో సమూల మార్పులు అవసరమని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) భావిస్తోంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో మారుతున్న టెక్నాలజీపై ఏఐసీటీఈ బృందం ఇటీవల అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు.
వీరిలో కంప్యూటర్ కోర్సులు చేస్తున్నవారే 70 శాతం ఉంటున్నారు. వీరిలో 8 శాతం మంది స్కిల్ ఉద్యోగాలు పొందుతున్నారు. ప్రస్తుత నైపుణ్య స్థాయిలోనే స్కిల్ ఉద్యోగాలు పొందలేనివారు 92 శాతం ఉంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సాంకేతిక విద్యను పూర్తిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీటీఈ ఇటీవల కొన్ని సిఫార్సులు చేసింది.
నడిపించే న్యూరాన్
మనిషిని నరాల వ్యవస్థ ఏవిధంగా నడిపిస్తుందో.. డీప్ లెర్నింగ్ కూడా ఐటీలో ఆ స్థాయి పాత్రను పోషిస్తోంది. డీప్ లెర్నింగ్‌లో ప్ర తీ న్యూరాన్ చిన్నచిన్న లెక్కలను కూడా క్షణాల వ్యవధిలో చేస్తుంది. అనేక లేయర్లతో కూడిన ఈ వ్యవస్థ డేటా కేంద్రానికి నానో సెకన్స్‌తో లింక్ అవుతుంది. వేగంగా ఫార్ములాను పసిగడుతుంది. వేగంగా డేటాను సేకరించగల ఐటీ ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. వేల, లక్షల సార్లు మాడ్యూల్స్‌ను అప్‌డేట్ చేసే సిస్టమ్ ఇందులో ఉంటుంది. పైథాన్ లాంగ్వేజ్‌కు పది రెట్లు వేగంగా పనిచేయగల సీఎస్ 50 లాంగ్వేజ్ మాడ్యూల్స్‌ను ఇందులోకి తెచ్చారు. ఆర్టిఫీషియల్ నేచురల్ నెట్‌వర్క్, కన్వెన్షనల్ నేచురల్ నెట్‌వర్క్ డీప్ లెర్నింగ్‌లో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.
ఐటీలో హైడ్రామా
భారత్‌లో ఐటీ దాని అనుబంధ ఉద్యోగాలు చేస్తున్నవారి సంఖ్య 54 నుంచి 58 లక్షల వరకూ ఉంది. బహుళ జాతి కంపెనీల్లో 17 లక్షల మంది వరకూ ఐటీ ఉద్యోగులున్నారు. ఐటీ ఎకో సిస్టమ్స్, గిగ్ వర్కర్లు, ఫ్లెక్సీ వంటి ఉపాధి రంగంలో ఉన్నవారి సంఖ్య 5 లక్షలకుపైనే. ఈ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపుతోంది. సరికొత్త మాడ్యూల్స్, లాంగ్ లెర్నింగ్ మాడ్యూల్స్ మారుతున్నాయి.
ఈ ఉద్యోగులంతా ఇప్పుడు డీప్ లెర్నింగ్‌లో వస్తున్న మార్పులను అవగతం చేసుకోవాలి. లేకపోతే మారుతున్న ఐటీ ఉద్యోగాలకు సరిపడా నైపుణ్యం కొరవడుతుందని ఏఐసీటీఈ, భారత పరిశ్రమల సమాఖ్య స్పష్టం చేశాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే ఏఐ ఆధారిత నైపుణ్యంపై కృషి జరగాలని వెల్లడించాయి. సీనియర్ సాఫ్ట్‌వేర్ అనలిస్టులకు సైతం మోడ్రన్ డీప్ లెర్నింగ్ మాడ్యూల్స్‌పై మరింత పట్టు అవసరమని పేర్కొంటున్నాయి.
ఆన్‌లైన్‌లోనే ఈ కోర్సులు అవసరం
ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి కొన్ని అంతర్జాతీయ డీప్ లెర్నింగ్ కోర్సులను అందుబాటులోకి తేవాలని ఏఐసీటీఈ ప్రతిపాదించింది. వీటిని ప్రతీ యూనివర్సిటీ అనుసరించడం వల్ల నైపుణ్యం మెరుగవుతుందని సూచిస్తోంది. అయితే, వీటికి ఏ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. విదేశీ కోర్సులు నేర్చుకున్న విద్యార్థికి స్థానికంగా పరీక్షలు నిర్వహించి నైపుణ్య స్థాయి గుర్తింపు సర్టిఫికెట్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా ఐటీ ఉద్యోగాలకు అవసరమైన స్కిల్ అందించే కొన్ని కోర్సులను గుర్తించారు. ఏఐ లింక్డ్ ఇన్ లెర్నింగ్, సీఎస్ 50 లాంగ్వేజ్ విత్ పైథాన్‌ను హార్వర్డ్ యూనివర్సిటీ ఆన్‌లైన్ వేదికగా అందిస్తోంది. ఏఐ డీప్ లెర్నింగ్ అండ్ ఎంఎల్‌ఏపీఎస్ వంటి కొన్ని కోర్సులపై ఏఐసీటీఈ దృష్టి పెట్టింది.


