ఎవరు ఇంటికొచ్చినా స్వాగతం పలికేవి ఇంటి తలుపులే.. అందుకే సింహద్వారం ఎంత అందంగా ఉంటే ఆ ఇల్లు అందమైన పొదరిల్లు అవుతుంది. గతంలో తలుపులు, కిటికీలంటే చెక్కతో చేయించేవారు. కాస్త ఉన్నవాళ్లయితే కలపతో చేయించినవి వాడేవారు. అయితే ఇవి కొన్నేళ్లయితే చెదలు పట్టడం, పాడవటం వంటివి జరుగుతుండేవి. అందుకే వాటి స్థానంలో అన్‌ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్(యూపీవీసీ) తలుపులు, కిటికీలు వచ్చి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు తెచ్చాయి. వీటి ధరలు అందుబాటులో ఉండటం, మన్నిక కూడా ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో యూపీవీసీ తలుపులు, కిటికీలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు. – సాక్షి, సిటీబ్యూరో
సౌకర్యాలెన్నో..
యూపీవీసీ తలుపులు, కిటికీలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం.
సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీలు నీటిలో తడిచినా కూడా బిగుతుగా మారవు. వీటి జీవితకాలం సుమారు 30 ఏళ్లు.
యూపీవీసీ తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తప్పుపట్టడం వంటివి ఉండవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికీ రంగులు వేయాల్సిన అవసరం కూడా లేదు.
అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. నష్టం చాలా వరకు తగ్గుతుంది.
యూపీవీసీ తలుపులు, కిటికీలకు శబ్దాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. బయటి నుంచి 80 శాతం శబ్దాన్ని, 60 శాతం ఉష్ణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. ఇంట్లో విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అదే యూపీవీసీ పర్యావరణహితమైనవి.
అంతేకాకుండా వీటికి ఉండే స్కూలు, గ్రిల్స్ బయటకు కనిపించవు.


