దేశంలో మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల భారీ విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) మధ్య విలీన ప్రక్రియ ప్రారంభమైందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రెండు బ్యాంకులు అంతర్గత అంచనాలు, కార్యాచరణ ఏకీకరణ, డ్యూ డిలిజెన్స్ వంటి ప్రక్రియలను చేపడుతున్నట్లు సమాచారం. ఈ విలీనం క్యాలెండర్ సంవత్సరం ముగిసేలోపు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
నాలుగైదు బ్యాంకులు చాలు
ప్రస్తుతం ఉన్న 12 ప్రభుత్వ రంగ బ్యాంకులను కుదించి నాలుగు నుంచి ఐదు బ్యాంకులకు పరిమితం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విలీనాలను ప్రోత్సహిస్తున్నట్లు ఒక సీనియర్ బ్యాంకింగ్ అధికారి తెలిపినట్లుగా ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులతో విలీనం చేయడం ద్వారా బలమైన రుణదాతలను సృష్టించడమే ఈ విలీనాల లక్ష్యమట.
దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్!
ఈ విలీనంతో విస్తృతమైన బ్యాలెన్స్ షీట్, పెద్ద బ్రాంచ్ నెట్‌వర్క్, విస్తారమైన కస్టమర్ బేస్‌తో దేశంలోని అగ్ర ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటి అవతరించనుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి కలిపిన బ్యాంక్ ఆస్తులు సుమారు రూ.25.4 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా. దీని ద్వారా ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత రెండవ అతిపెద్ద పీఎస్‌యూ బ్యాంక్‌గా, అలాగే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల తర్వాత దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంక్‌గా నిలవనుంది.
మార్కెట్ క్యాప్‌లో కీలక మార్పులు
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా, ఈ విలీన బ్యాంక్ సుమారు రూ.2.13 లక్షల కోట్ల విలువతో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లను అధిగమించి ఆరో స్థానంలో నిలుస్తుంది. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఐదవ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరో అతిపెద్ద పీఎస్‌యూ బ్యాంకులుగా ఉన్నాయి.
గత విలీనాల నేపథ్యం
2017–2020 మధ్య కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మెగా విలీనాల్లో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏకీకృతం చేయడంతో, పీఎస్‌యూ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కి తగ్గింది. దేశంలో పెరుగుతున్న రుణ డిమాండ్‌ను సమర్థవంతంగా తీర్చడం, భారీ మౌలిక సదుపాయ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం, అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకులతో సమర్థంగా పోటీ పడగల శక్తివంతమైన రుణదాతలను రూపొందించడమే ఈ కొత్త విలీనాల వెనుక ప్రభుత్వ లక్ష్యమని విధాన రూపకర్తలు స్పష్టం చేస్తున్నారు.


