క్యూ3లో రూ. 5,073 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 10 శాతం ఎగసి రూ. 5,073 కోట్లను తాకింది. ప్రొవిజన్లు భారీగా తగ్గడం ఇందుకు అనుకూలించింది. అయితే నికర వడ్డీ ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 9,328 కోట్లకు చేరింది.
బ్యాంకింగ్ వ్యవస్థకంటే తక్కువగా రుణ వృద్ధి 7 శాతానికి పరిమితంకావడం, నికర వడ్డీ మార్జిన్లు 0.15 శాతం నీరసించి 2.76 శాతానికి చేరడం ప్రభావం చూపాయి. డిపాజిట్లు సైతం 3.4 శాతం మాత్రమే పుంజుకున్నాయి. వడ్డీయేతర ఆదాయం 3 శాతం పెరిగి రూ. 4,541 కోట్లకు చేరింది. కాగా.. తాజా స్లిప్పేజీలు రూ. 2,199 కోట్ల నుంచి రూ. 1,820 కోట్లకు నీరసించగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.29 శాతం నుంచి 3.06 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రూ. 1,599 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 322 కోట్లకు పరిమితమయ్యాయి. వెరసి లాభాలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి.
బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 180 వద్ద ముగిసింది.


