లండన్: యూకేలో కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) రెస్టారెంట్‌లో మేనజర్‌గా పనిచేస్తున్న శ్రీలంక మేనేజర్‌కి.. భారతీయ ఉద్యోగి గట్టిషాకిచ్చాడు. నువ్వు నా బానిసవి అంటూ చేసిన అవమానకర వ్యాఖ్యలపై సదరు మేనేజర్‌ని ఆధారాలతో సహా కోర్టుకీడ్చాడు. కోర్టు సైతం మేనేజర్‌ని చివాట్లు పెట్టింది. భారత కరెన్సీలో రూ.81లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
అంతర్జాతీయ కథనాల ఆధారంగా.. తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ 2023లో లండన్‌లోని వెస్ట్ విక్హామ్ కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌లో ఉద్యోగం ప్రారంభించారు. కొద్ది నెలల్లోనే అతని మేనేజర్, శ్రీలంకకు చెందిన కజన్ థైవెంటిరం అతనిపై బానిస,భారతీయులు మోసగాళ్లు అంటూ అవమానించారు. దీంతో జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన కజన్‌పై రవిచంద్రన్ ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. అంతేకాదు.. లీవ్ అడిగితే ఇవ్వకపోవడం, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు పలు ఆధారాల్ని ట్రైబ్యునల్‌కు అందించాడు.
ఈ కేసును పరిశీలించిన ఎంప్లాయ్‌మెంట్ ట్రైబ్యునల్ రవిచంద్రన్‌కు అండగా నిలిచింది. మేనేజర్ ప్రవర్తనను జాతి వివక్షగా గుర్తించింది. కోర్టు తీర్పు ప్రకారం.. అతనికి 67వేల యూరోలు (సుమారు రూ.81 లక్షలు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ట్రైబ్యునల్ జడ్జి పాల్ అబ్బాట్ తీర్పులో ‘ఈ కేసులో జాతి వివక్ష స్పష్టంగా ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని’ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు యూకేలోని ఉద్యోగ రంగంలో జాతి వివక్షకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపిందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి.


