తృటిలో తప్పిన పెను విమాన ప్రమాదం.. 27వేల అడుగుల ఎత్తులో ఇంజిన్‌ పేలుడు | Arik Air Flight Diverts Safely To Benin After In-Flight Engine Anomaly | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన పెను విమాన ప్రమాదం.. 27వేల అడుగుల ఎత్తులో ఇంజిన్‌ పేలుడు

Feb 13 2026 8:30 PM | Updated on Feb 13 2026 8:30 PM

Arik Air Flight Diverts Safely To Benin After In-Flight Engine Anomaly

అబుజా: ఇటీవల కాలంలో ప్రపంచంలోని పలు దేశాల్లో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. విమానం ప్రయాణం ఎక్కితే గమ్య స్థానానికి చేరుకోగలామా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఓ విమానం ఘోర విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. 80 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. 

లాగోస్ నుండి పోర్ట్ హార్కోర్ట్ వెళ్తున్న అరిక్‌ ఎయిర్‌ విమానాయన సంస్థకు చెందిన బోయింగ్ 737-700 విమానం  బుధవారం ఉదయం 7:24 గంటలకు బయల్దేరింది. సుమారు 27 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఎడమ ఇంజిన్‌లో భారీ శబ్దం వినిపించింది. ఇంజిన్‌లో పేలుడు సంభవించి, లోపలి భాగాలు తునాతునకలయ్యాయి. ఫ్యాన్ బ్లేడ్లు విరిగిపోయాయి. అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని బెనిన్ ఎయిర్‌పోర్ట్ వైపు మళ్లించి, ఉదయం 8:05 గంటలకు అత్యవసర ల్యాండింగ్ చేశారు.

80 మంది ప్రయాణికులు, సిబ్బంది ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ల్యాండింగ్ సమయంలో ఇంజిన్ కవచం చీలిపోవడంతో లోపలి భాగాలు బయటకు కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఏవియేషన్‌ సేఫ్టీ నెట్‌వర్క్ నివేదికల ప్రకారం.. ఇంజిన్ ఇన్లెట్ భాగం పూర్తిగా విరిగిపోయింది. దీనిని ‘ఫ్యాన్ బ్లేడ్ ఆఫ్’ ఘటనగా పరిగణిస్తున్నారు. ఇంజిన్ నుండి విడిపోయిన లోహపు ముక్కలు విమానం వెనుక భాగంలోని వర్టికల్ స్టెబిలైజర్‌ను కూడా దెబ్బతీశాయని పరిశీలకులు గుర్తించారు. నైజీరియన్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ బోర్డు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. బెనిన్‌లో విమానాన్ని నిలిపి, సాక్ష్యాలను సేకరించడం, సిబ్బందిని ప్రశ్నించడం,ఫ్లైట్ డేటా, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను పరిశీలిస్తున్నారు. 

ఫ్యాన్ బ్లేడ్ ఆఫ్ అంటే..
ఫ్యాన్ బ్లేడ్ ఆఫ్ (Fan Blade-Off) అనేది విమాన ఇంజిన్‌లలో జరిగే ఒక తీవ్రమైన సాంకేతిక లోపాన్ని సూచించే పదం. టర్బోఫ్యాన్ ఇంజిన్‌లో గాలి పీల్చుకునే భాగంలో పెద్ద ఫ్యాన్ బ్లేడ్లు ఉంటాయి.వీటిలో ఒక బ్లేడ్ విరిగి, ఇంజిన్ లోపల నుంచి బయటకు త్రోసుకుపోతే దాన్ని Fan Blade-Off (FBO) ఘటన అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి,ఎందుకంటే విరిగిన బ్లేడ్ ముక్కలు ఇంజిన్‌ను, విమానం ఇతర భాగాలను దెబ్బతీసేయోచ్చు. 

 

Advertisement
 
Advertisement
Advertisement