అజిత్‌ పవార్‌ విమాన ఘటన.. మళ్లీ తెరపైకి ‘టేబుల్‌టాప్ రన్‌వే’ | Did Baramati Tabletop Runway Play a Role in Ajit Pawar Fatal Plane Crash | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్‌పోర్టులు

Feb 3 2026 2:34 PM | Updated on Feb 3 2026 3:32 PM

Did Baramati Tabletop Runway Play a Role in Ajit Pawar Fatal Plane Crash

ఒక్క చిన్న పొరపాటు… పెద్ద ప్రమాదానికి దారి.” అనే మాట నిజంగానే విమాన ప్రయాణాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్ జరిగిన బారామతిలో టేబుల్‌టాప్ రన్‌వే ఉంది. కొండలను చదును చేసి లేదా లోయల మధ్య ఎత్తైన ప్రదేశంలో నిర్మించే రన్‌వేలను టేబుల్‌టాప్ రన్‌వేలు అంటారు. ఇవి సాధారణ రన్‌వేల కంటే ఎక్కువ ప్రమాదకరంగా ఉంటాయి. ఎందుకంటే ఎత్తైన ప్రాంతాల్లో గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. ల్యాండింగ్ సమయంలో విమాన వేగాన్ని కంట్రోల్ చేయడం పైలట్లకు చాలా కష్టంగా మారుతుంది.

మంగళూరు ఎయిర్‌పోర్ట్ కూడా టేబుల్‌టాప్ రన్‌వేతోనే ఉంది. 2010లో అక్కడ ఒక విమానం రన్‌వే అంచు దాటి లోయలో పడిపోవడంతో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2020లో కోజికోడ్‌లో భారీ వర్షంలో ల్యాండ్ అవుతున్న విమానం రన్‌వే దాటి 35 అడుగుల లోతులో పడిపోయి రెండు ముక్కలు అయింది. ఆ ఘటనలో 21 మంది మరణించారు. ఈ సంఘటనలు టేబుల్‌టాప్ రన్‌వేల ప్రమాదాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఇక భూటాన్‌లోని పారో ఎయిర్‌పోర్ట్ చుట్టూ 18 వేల అడుగుల ఎత్తైన పర్వతాలు ఉంటాయి. దీనిని ప్రపంచంలోనే అత్యంత డైంజరస్ ఎయిర్ పోర్ట్ గా భావిస్తారు. ఇక్కడ ల్యాండ్ కావాలంటే పైలట్లు పర్వతాల మధ్య నుంచి పదునైన కోణాల్లో విమానం నడపాలి. అందుకే అన్ని విమానాలకు అనుమతి ఉండదు. అలాగే నేపాల్‌లోని టెన్జింగ్-హిల్లరీ ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 527 మీటర్ల చిన్న రన్‌వే మాత్రమే ఉంది. రెండు వైపులా కొండలు ఉండటంతో ల్యాండింగ్ చాలా క్లిష్టంగా ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్ పోర్టులు

ఇలాంటివి ప్రపంచంలో ఇంకా కొన్ని విమానాశ్రయాలు ఉన్నాయి. అక్కడ ల్యాండింగ్ అంటే పైలట్లకు పెద్ద సవాలు. అనుభవం ఉన్న పైలట్లు కూడా ప్రతిసారీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధారణంగా పైలట్ల చాకచక్యంతోనే చాలా ప్రమాదాలు తప్పుతున్నాయి. కానీ పర్వతాలు, సముద్రాలు లేదా చిన్న రన్‌వేలు ఉన్న ప్రాంతాల్లో ఏమాత్రం పొరపాటు జరిగినా అది పెద్ద ప్రమాదంగా మారుతుంది. అందుకే అలాంటి ఎయిర్‌పోర్ట్‌లలో ప్రతి ల్యాండింగ్ ఒక పరీక్షలాంటిదే.

 

 

Advertisement
 
Advertisement
Advertisement