నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
ముంబై: మహారాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రిగా దివంగత నేత అజిత్ పవార్ భార్య, రాజ్యసభ సభ్యురాలు సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె శనివారమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ రికార్డు సృష్టించబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భర్త స్థానంలో సునేత్ర పవార్ బాధ్యతలు స్వీకరించాలని పార్టీ వర్గాలు కోరడంతో ఆమె అంగీకరించినట్లు సమాచారం.
శనివారం ఉదయం ముంబైలో తమ పార్టీ సమావేశం జరుగుతుందని, సునేత్ర పవార్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటామని ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గాలు తెలియజేశాయి. సాయంత్రం డిప్యూటీ సీఎంగా ఆమె ప్రమాణం చేస్తారని పేర్కొన్నాయి. సునేత్ర పవార్‌కు రాజకీయాలతో అనుబంధం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి ఎన్సీపీ(అజిత్ పవార్) అభ్యరి్థగా పోటీ చేశారు.
కానీ, ఎన్సీపీ(శరద్ పవార్) అభ్యర్థి సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. అనంతరం సునేత్ర రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె మహారాష్ట్ర అసెంబ్లీలో సభ్యురాలు కాదు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడితే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికల కావాల్సి ఉంది. తన భర్త మరణంతో ఖాళీ అయిన బారామతి నుంచి ఆమె పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఉభయ ఎన్సీపీలు ఏకం కాబోతున్నాయని, దీనిపై త్వరలో చర్చలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు.


