ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) నేత, దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర ప్రమాణం చేయబోతున్న విషయంపై ఎలాంటి సమాచారం లేదని అన్నారాయన. ఈ విషయం పేపర్‌లోనే చూసి తెలుసుకున్నానని.. ఆ కథనాల్లోనూ తనకు స్పష్టత కనిపించలేదని వ్యాఖ్యానించారు.
‘‘ఈ విషయంపై నాకు ఎలాంటి సమాచారం లేదు. పేపర్‌లో ఓ వార్త చూశా. అందులో ప్రఫుల్ పటేల్, సునీల్ టాటాకరే.. ఇలా ఇతరుల పేర్లే కనిపించాయి. ఆమె డిప్యూటీ సీఎం పగ్గాలు చేపడుతోందనే విషయం నాకు తెలియదు. ఆమె నాతో కూడా ఆ మాట చెప్పలేదు. బీజేపీ కూటమితోనే కొనసాగాలని ఆమె భావిస్తుందని మేం అనుకోలేదు. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమే. దీనిపై నేను, మా వర్గం ఎలాంటి చర్చా జరపలేదు. బహుశా ఆమె పార్టీనే ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఆమె ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండొచ్చు.
రెండు వర్గాల విలీనంపై స్పందిస్తూ.. గత నాలుగు నెలలుగా రెండు వర్గాల విలీనంపై చర్చలు నడుస్తున్నాయన్నారు. అజిత్ పవార్, శశికాంత్ షిండే, జయంత్ పాటిల్‌లు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. జనవరి 17న విలీనంపై చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 12న ముహూర్తం పెట్టుకున్నాం. విలీనం సమయంలోనే ఇది ఊహించని పరిణామం అని అజిత్ పవార్ మృతిని ఉద్దేశించి అన్నారు. అయితే.. ఆయన(అజిత్ పవార్) కోరిక నెరవేరాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
2023 జులైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) వర్గం రెండుగా చీలింది. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలలో.. 40 మందితో కలిసి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరారు. ఆ తర్వాత అజిత్ పవార్ వర్గానికే అసలైన ఎన్సీపీ గుర్తింపు దక్కింది. దీంతో శరద్ పవార్ తన వర్గానికి ఎన్సీపీ-శరద్‌చంద్ర పవార్ కూటమి అని పేరు పెట్టారు.
2024 చివర్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలో మహాయుతి కూటమి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది. పవర్ షేరింగ్‌లో భాగంగా.. అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించారు. అయితే.. జనవరి 28వ తేదీన తన నియోజకవర్గం బారామతిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్తూ విమాన ప్రమాదంలో అజిత్ పవార్(66) మరణించారు. దీంతో ఈమధ్యలో జరిగిన ఎన్సీపీ వర్గ విలీన ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో..
ఆయన వర్గం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా తాము గౌరవిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. ఎన్సీపీ వర్గం ఆమెను శనివారం లెజిస్టేచర్ నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఆపై ఇవాళ సాయంత్రం ఆమె మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసే చాన్స్ ఉంది.
మరోవైపు.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గోవింద్‌బాగ్‌లో పవార్ కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అజిత్ పవార్ తనయుడు రోహిత్ పవార్ హాజరయ్యారు. అయితే ఇది కుటుంబ సంబంధిత కార్యక్రమానికి సంబంధించిన సమావేశం అనే ప్రచారం జరుగుతునప్పటికీ.. సునేత్ర ప్రమాణ స్వీకారం వేళే ఈ భేటీ జరగడం రాజకీయ చర్చా అనే అనుమానాలకు తావిస్తోంది.


