మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ రోజు (బుధవారం) ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇందులో కుట్రకోణం ఉందని ఆరోపించాయి. తాజాగా దీనిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ ప్రమాద ఘటనపై ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం చేయకూడదన్నారు.
ఈ రోజు జరిగిన ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం మహాయుతి కూటమి నుండి అజిత్ పవార్ ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. కనుక ఈ ప్రమాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ విమాన ప్రమాదంపై అనుమానం చేసింది. పారదర్శకమైన విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గోగోయ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు.
శరద్ పవార్ మాట్లాడుతూ.. "ఈ ప్రమాదంలో ఎటువంటి కుట్రలేదు. ఇదిపూర్తిగా ప్రమాదం అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్రకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక సమర్థుడైన నాయకుడు నేడు మనల్ని విడిచిపెట్టి వెళ్లారు. అంతా మనచేతుల్లో లేదు. నేను నిస్సహాయంగా భావిస్తున్నాను. కొన్ని సంఘటనల వెనుక రాజకీయాలుండవు." అని శరద్ పవార్ అన్నారు. కాగా 2023లో ఎన్సీపీ నుంచి బయిటకి వచ్చి బీజేపీతో చేతులు కలిపారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది.


