సాక్షి, ములుగు: మేడారం జనసంద్రమైంది. గద్దెలపై ఇద్దరు తల్లులు కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. సమ్మక్క, సారలమ్మ నామస్మరణతో మేడారం ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. దీంతో, జాతరకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మేడారం నుండి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 12 గంటల నుండి భక్తులు వేచి చూస్తున్నారు. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
మేడారంలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు, వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పసరా నుంచి నార్లాపూర్ రూట్‌లో వెళ్లే ప్రైవేటు వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. మేడారం నుంచి తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక వేలాది మంది భక్తులు మేడారం బస్టాండ్‌లో బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.
మేడారం రూట్ 163 జాతీయ రహదారి పై భారీ ట్రాఫిక్ జామ్!
సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో మేడారం ప్రధాన రహదారి పై భారీ #TrafficJam ఏర్పడింది. గంటలో వెళ్లే జర్నీ నాలుగైదు గంటలు పడుతుండటంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
#MedaramJathara pic.twitter.com/4UnSdWH2fr— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) January 31, 2026
తల్లుల దర్శనం కోసం కలెక్టర్ మంజూరు చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్‌లు పొందిన భక్తులకు క్యూలైన్లను ఎత్తేయడంతో శుక్రవారం జాతరకు వచ్చిన భక్తులు పాస్‌లు చేత పట్టుకొని క్యూలైన్లు, దర్శనాల కౌంటర్ల కోసం మేడారం వీధుల్లో వెతుకుతూ కనిపించారు. మరికొందరు దర్శనాలు చేసుకోకుండానే మెయిన్ గేటు బయట నుంచే మొక్కులు చెల్లించుకొని తిరుగు పయనమయ్యారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరిన తర్వాత భక్తుల రాక ఒక్కసారిగా పెరగడంతో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. ఎటు చూసినా దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి.


భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. శనివారం తల్లుల వన ప్రదేశంతో జాతర పరిసమాప్తం కానున్నది. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే సుమారు 45 లక్షల మందికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ప్రారంభమైంది మొదలు ఇప్పటివరకు మేడారానికి సుమారుగా 1.25 కోట్ల మంది వరకు జనం వచ్చారని అధికారులు తెలిపారు.


