గూగుల్ వంటి దిగ్గజ సంస్థలో జాబ్ చేయాలని చాలామంది కలలు కంటుంటారు. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చని కొందరు అనుకుంటారు. కానీ.. ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా సాధ్యమవుతుందని చెబుతున్నారు గూగుల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన ఆర్చీ గుప్తా. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గూగుల్ సంస్థలో జాబ్ ఎలా తెచ్చుకున్నారు?, అక్కడ జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి?, అనే ఆసక్తికరమైన ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒక సాధారణ కాలేజీలో చదువుకుని.. గూగుల్‌లో ఉద్యోగం సాధించిన టెక్ ప్రొఫెషనల్ ఆర్చీ గుప్తా ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. ఆమె తన సక్సెస్ స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక వ్యక్తి ప్రతిభకు, కష్టపడే తత్వానికి.. కాలేజీ పేరు లేదా ప్రతిష్ట అడ్డంకి కాదని స్పష్టం చేశారు. సరైన నైపుణ్యాలు, అంకితభావం & నిరంతర ప్రయత్నం ఉంటే ఎవరైనా పెద్ద కంపెనీల్లో ఉద్యోగం సంపాదించవచ్చని వెల్లడించారు.
తాను షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులో.. ఆర్చీ గుప్తా కెరీర్‌లోని ముఖ్యమైన దశలను ఫోటోల రూపంలో చూపించారు. మొదటి ఇంటర్న్‌షిప్ నుంచి మొదటి ఉద్యోగం వరకు.. ఎదురైన తిరస్కారాలు, వచ్చిన అవకాశాలు అన్నింటినీ వెల్లడించారు. ప్రారంభంలో ఆమెను గూగుల్ తిరస్కరించింది. అదే తిరస్కారం ఆమెకు మరింత బలాన్ని ఇచ్చిందని, ముందుకు వెళ్లడానికి ప్రేరణగా మారిందని చెప్పారు. పట్టుదలతో శ్రమించి చివరికి గూగుల్‌లో జాబ్ తెచ్చుకుంది.
సాధారణ కాలేజీ నుంచి గూగుల్ వరకు ఎదగడానికి ఎలాంటి షార్ట్‌కట్స్ లేవు. అదృష్టం మీద ఆధారపడలేదు. సంవత్సరాల పాటు కృషి చేసాను. ప్రతిరోజూ ప్రయత్నించడం చేయడం మానుకోలేదని ఆర్చీ గుప్తా చెప్పారు. ఒక్కసారికే విజయం లభించదు. గొప్ప క్షణాలు వెంటనే కనిపించవు. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటే.. తప్పకుండా సక్సెస్ సాధించవచ్చని ఆమె వివరించారు.


