ఏఐ రాకతో మారుతున్న ముఖచిత్రం
భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఒకవైపు కృత్రిమ మేధ(ఏఐ) కొత్త పుంతలు తొక్కుతుంటే, మరోవైపు అదే వేగంతో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ప్రముఖ లేఆఫ్స్ ట్రాకర్ ‘లేఆఫ్స్.ఎఫ్‌వైఐ’(Layoffs.fyi) తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 551 టెక్ కంపెనీల నుంచి 1,22,549 మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. గత కొన్ని వారాలుగా ఈ వేగం కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తున్నా, ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది.
ప్రముఖ కంపెనీలు ఇలా..
అమెజాన్.. అక్టోబర్‌లో కంపెనీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా ఉద్యోగాల కోత విధిస్తూ 14,000 కొలువులను తొలగించింది.
మైక్రోసాఫ్ట్.. 2025 నాటికి మొత్తం 15,000 మందిని తొలగించే దిశగా అడుగులు వేసింది. జులైలోనే దాదాపు 9,000 మందిని పంపించివేసింది.
ఇంటెల్.. చిప్ తయారీలో వెనుకబడటం, ఆర్థిక నష్టాల నేపథ్యంలో ఏకంగా మొత్తం సిబ్బందిలో 15% (సుమారు 25,000 మంది) తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది.
సేల్స్ ఫోర్స్.. ఏఐ సహాయంతో 4,000 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తగ్గించినట్లు సీఈఓ మార్క్ బెనియోఫ్ ధ్రువీకరించారు.
టీసీఎస్.. భారత్‌లో దాదాపు 12,000 మందిని (మొత్తం ఉద్యోగుల్లో 2%) తొలగించి ఐటీ రంగంలో ఆందోళన కలిగించింది. అయితే ఇది ఏఐ వల్ల కాదని, నైపుణ్యాల అసమతుల్యత వల్లేనని సంస్థ స్పష్టం చేసింది.
మెటా (600 మంది), గూగుల్ (100+), వెరిజోన్ (13,000), హెచ్‌పీ (4,000-6,000 మంది) వంటి సంస్థలు కూడా లేఆఫ్స్ ఇచ్చాయి.
లేఆఫ్స్‌కు దారితీసిన కారణాలు
చాలా కంపెనీలు ఇప్పుడు ‘ఏఐ ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్నాయి. గతంలో వందలాది మంది చేసే పనులను (డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, బేసిక్ కోడింగ్..) ఇప్పుడు ఏఐ టూల్స్ తక్కువ ఖర్చుతో వేగంగా చేస్తున్నాయి. కంపెనీలు తమ బడ్జెట్‌ను మానవ వనరుల నుంచి ఏఐ మౌలిక సదుపాయాల వైపు మళ్లిస్తున్నాయి.
ద్రవ్యోల్బణం పెరగడం, సుంకాల భారం పెరగడంతో కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ ఉత్పాదకత సాధించడంపై యాజమాన్యాలు దృష్టి పెట్టాయి.
కరోనా సమయంలో డిజిటల్ సేవల కోసం డిమాండ్ పెరగడంతో టెక్ కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టాయి. ఇప్పుడు డిమాండ్ సాధారణ స్థితికి రావడంతో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని తొలగిస్తున్నాయి.
పాత ప్రాజెక్టులను మూసివేసి కేవలం క్లౌడ్, సెక్యూరిటీ, జనరేటివ్ ఏఐ వంటి భవిష్యత్తు అవసరాల మీదనే కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. దీనివల్ల పాత నైపుణ్యాలు కలిగిన వారు ఉద్యోగాలు కోల్పోతున్నారు.
టెక్ రంగం ప్రస్తుతం ఒక పరివర్తన దశలో ఉంది. ఉద్యోగాల కోత ఆందోళన కలిగించే విషయమే అయినా ఏఐ రంగంలో కొత్త రకమైన ఉద్యోగ అవకాశాలు కూడా పుట్టుకొస్తున్నాయి. సిబ్బంది తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడమే ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే..


